ఎక్కువ వడ్డీ ఆశ చూపి 80లక్షలు టోకరా.. క్రోసూరి అరెస్ట్

ABN , First Publish Date - 2021-06-26T14:16:29+05:30 IST

డిపాజిటర్లను బురిడీ కొట్టించి రూ.80లక్షలు కాజేసిన స్వర్ణ భారతి ఎంఎంఏసీ సొసైటీ

ఎక్కువ వడ్డీ ఆశ చూపి 80లక్షలు టోకరా.. క్రోసూరి అరెస్ట్

  • సొసైటీ అధ్యక్షుడు క్రోసూరి శ్రీనివాసరావు అరెస్టు 
  • డిపాజిటర్ల డబ్బు గల్లంతు.. సీసీఎస్‌లో ఫిర్యాదుతో వెలుగులోకి

హైదరాబాద్‌ సిటీ : డిపాజిటర్లను బురిడీ కొట్టించి రూ.80లక్షలు కాజేసిన స్వర్ణ భారతి ఎంఎంఏసీ సొసైటీ లిమిటెడ్‌ ప్రెసిడెంట్‌ క్రోసూరి శ్రీనివాసరావును సీసీఎస్‌ పోలీసులు అరెస్టు చేశారు. ధూల్‌పేట్‌ ప్రాంతానికి చెందిన రాజ్‌కుమార్‌ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు ఈ ఏడాది జనవరి 16న సీసీఎస్‌లో అతనిపై టీఎస్‌పీడీఎఫ్ఈ (తెలంగాణ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ డిపాజిటర్స్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ ఎస్టాబ్లి్‌షమెంట్స్‌ యాక్ట్‌) కింద కేసు నమోదైంది. గడువు ముగిసిన తర్వాత పెద్ద ఎత్తున వడ్డీ చెల్లిస్తామంటూ సొసైటీ తనవద్ద నుంచి రూ.80లక్షలు తీసుకున్నట్లు బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిర్ణీతకాలం ముగిసిన తర్వాత మెచ్యూరిటీ డబ్బు తిరిగి చెల్లించాలంటూ ఫిర్యాదుదారునితోపాటు ధూల్‌పేట్‌కు చెందిన ఇతర బాధితులు కోరారు. 


మేనేజర్‌ శ్రీనివాసరావుతోపాటు ఇతర సిబ్బంది వేర్వేరు సాకులు చెప్పి డబ్బులు ఇవ్వకుండా దాటవేశారని, పలుమార్లు ప్రయత్నించినా ఎలాంటి స్పష్టమైన హామీ ఇవ్వకపోగా డబ్బులు ఇవ్వలేమని చెప్పేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మోసపోయామని గ్రహించిన బాధితుడు రాజ్‌కుమార్‌ సీసీఎస్‌ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడైన సొసైటీ ప్రెసిడెంట్‌ క్రోసూరి శ్రీనివాసరావును శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇందులో ఇతర డైరెక్టర్ల పాత్ర కూడా ఉండొచ్చనే అనుమానాలతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీఎ్‌సలోని వైట్‌ కాలర్‌ అఫెన్సెస్‌- ఈఓడబ్ల్యూ అదనపు డీసీపీ ఎన్‌.మహేందర్‌ పర్యవేక్షణలో ఏసీపీ ఎస్‌ఆర్‌. దామోదర్‌ రెడ్డి, కె.శ్రీనివాస్‌ రెడ్డి నేతృత్వంలో దర్యాప్తు కొనసాగిందని అదనపు డిప్యూటీ కమిషనర్‌ వెల్లడించారు.

Updated Date - 2021-06-26T14:16:29+05:30 IST