భారత్ ఇప్పటివరకు ఎదుర్కొన్న భారీ షాక్‌లు.. వాటి నుంచి ఎలా బయటపడిందంటే..

ABN , First Publish Date - 2021-06-11T23:23:25+05:30 IST

కరోనా.. ప్రపంచం మొత్తాన్ని తీవ్రంగా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా భారత్‌లో దారుణ పరిస్థితులు సృష్టించింది

భారత్ ఇప్పటివరకు ఎదుర్కొన్న భారీ షాక్‌లు.. వాటి నుంచి ఎలా బయటపడిందంటే..

కరోనా.. ప్రపంచం మొత్తాన్ని తీవ్రంగా అతలాకుతలం చేసింది. ముఖ్యంగా భారత్‌లో దారుణ పరిస్థితులు సృష్టించింది. గత వందేళ్లలో భారత్ కనీ వినీ ఎరుగని విలయాన్ని సృష్టించింది. లక్షల సంఖ్యలో ప్రాణాలను బలితీసుకుంది. ఆర్థికంగా, సామాజికంగా తీరని నష్టాన్ని మిగిల్చింది. కరోనా స్థాయిలో కాకపోయినా స్వాతంత్రానంతరం భారత్ చాలా సమస్యలను ఎదుర్కొంది. తీవ్ర నష్టాన్ని చవిచూసింది. వాటి నుంచి గుణపాఠాలు నేర్చుుకుంది. వాటి గురించిన సమగ్ర కథనం. 


దేశవిభజన-మతకల్లోలం


ఎన్నో ఏళ్ల పోరాట ఫలితంగా ఆంగ్లేయుల చెర విడిపించుకుని స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న భారతావని ఎన్నో కష్టాలతో పయనం ప్రారంభించింది. ప్రారంభంలోనే దేశ విభజన కారణంగా జరిగిన మతకల్లోలాలు ఎంతో మందిని పొట్టనబెట్టుకున్నాయి. విభజన సమయంలోనూ, అంతకుముందూ జరిగిన ప్రాణనష్టం అపారం. మతకల్లోలాల కారణంగా ఉత్తర భారత్‌లో దాదాపు 5 లక్షల మంది ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంచనా. అన్ని ప్రాంతాలలోకీ అత్యంత ఘోరమైన హింస బెంగాల్, పంజాబ్‌లో జరిగింది. ముస్లింలందరూ పాకిస్థాన్‌కు, హిందువులందరూ భారత్‌కు వలస వెళ్లారు. ఈ క్రమంలో ఎంతో దోపిడి, హింస జరిగింది. ఈ స్థాయి వలసలను, హింసను ఇరు దేశాల పాలకులు అంచనా వేయలేదు.


1962 చైనా యుద్ధం


1962 అక్టోబర్ 20.. పంచశీల సూత్రాలను సమాధి చేసి భారత్‌పై చైనా దండెత్తిన రోజు. ఈశాన్య భారతంలోని 3,225 కిలోమీటర్ల హిమాలయ సరిహద్దులతో పాటు టిబెట్‌ కూడా చైనాలో అంతర్భాగమని వాదిస్తూ చైనా పాలకులు యుద్ధానికి దిగారు. 1962 యుద్ధం దేశంపై పెనుప్రభావాన్నే చూపించింది. ఎంతో మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. యుద్ధం చేసిన గాయం నుంచి కోలుకోడానికి భారత జాతికి చాలా కాలమే పట్టింది. యుద్ధం మిగిల్చిన విషాదం జవహర్‌లాల్‌ రాజకీయ జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. నెహ్రూపై ఇంటా బయటా తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. యుద్ధం ముగిసిన రెండేళ్లకే ఆయన అకాల మరణం చెందారు. అయితే తర్వాత వచ్చిన ప్రభుత్వం రక్షణ శాఖపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశ రక్షణ బడ్జెట్‌ను గణనీయంగా పెంచారు. సోవియట్‌ యూనియన్‌ సహకారంతో దేశ రక్షణ రంగాన్ని ఆధునీకరించే ప్రయత్నాలు ప్రారంభించారు.


1965-66 కరువు


1965-66, 1966-67 సంవత్సరాల్లో భారత్‌లో చాలా పెద్ద ఎత్తున పంటనష్టం జరిగింది. దేశం మొత్తం తీవ్ర క్షామం ఏర్పడింది. దీంతో భారత్ అమెరికా ముందు మోకరిల్లాల్సి వచ్చింది. దిగుమతి చేసుకున్న తిండిగింజలను ఆ నౌకల వద్దే ప్రజలకు పంపిణీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ కరువు ఫలితంగానే దేశంలో హరిత విప్లవం ప్రారంభమైంది. ప్రధాని ఇందిరా గాంధీ, వ్యవసాయ మంత్రి సి.సుబ్రమణ్యం, శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాథన్ హరిత విప్లవాన్ని విజయవంతం చేశారు. ఫలితంగా భారత్ తిండి గింజల విషయంలో స్వయం సమృద్ధి సాధించింది. ఇతర దేశాలకు సైతం ఎగుమతి చేసే స్థాయికి చేరింది. 


ఎమర్జెన్సీ


అలహాబాద్ కోర్టు తీర్పు కారణంగా 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ సూచన మేరకు రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ అంతర్గత అత్యవసర స్థితి విధించారు. అది 1977 మార్చి 21 వరకూ కొనసాగింది. ఎమర్జెన్సీ పేరుతో ఇందిరా గాంధీ తన రాజకీయ ప్రత్యర్థులను జైలుపాలు చేశారు. పత్రికలను సెన్సార్ చేశారు. ప్రధానమంత్రి కుమారుడు సంజయ్ గాంధీ ముందుండి మాస్-స్టెరిలైజేషన్ (సామూహిక గర్భనివారణ కార్యక్రమం)ను బలవంతంగా అమలు చేశారు. ఎమర్జెన్సీ ఎత్తేసిన తర్వాత ఆనాటి అకృత్యాలు ఒక్కొక్కటీ బయటపడ్డాయి. ఫలితంగా తర్వాత జరిగిన ఎన్నికల్లో ఇందిరా గాంధీ అధికారం కోల్పోయారు. స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత వివాదాస్పద కాలాల్లో ఎమర్జెన్సీ ఒకటి.


కరోనా

2019లో చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి 2020లో భారత్‌లోకి ప్రవేశించి విలయతాండవం చేసింది. మొదటి వేవ్‌ను సమర్థంగానే ఎదుర్కొన్న ప్రభుత్వం, ప్రజలు రెండో వేవ్‌లో మాత్రం చేతులెత్తేశారు. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటివరకు 2.92 కోట్ల పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3.63 లక్షల మరణాలు సంభవించాయి. వాస్తవ లెక్కలు ఇంతకు మూడు, నాలుగు రెట్లు ఉంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. వైద్య సదుపాయాల లేమి, ఆక్సిజన్ కొరత, మందుల కొరత కారణంగా స్మశానాల ముందు వరసలు కట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. వ్యాపారాలు దివాళా తీశాయి. వలస కార్మికుల విషాదం గురించి ఎంత చెప్పినా తక్కువే. 


ఇప్పటివరకు దేశం ఎదుర్కొన్న ప్రతి సమస్యా ఓ పరిష్కారాన్ని సూచించింది. ప్రస్తుతం కరోనా మహమ్మారి దేశంలోని వైద్య సౌకర్యాల కొరతను బయటపెట్టింది. దీని నుంచి గుణపాఠం నేర్చుకుని వైద్య సౌకర్యాల కల్పనపై ప్రభుత్వాలు దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. 




Updated Date - 2021-06-11T23:23:25+05:30 IST