నృత్య ప్రదర్శన అదిరింది

ABN , First Publish Date - 2022-09-19T04:32:33+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవం చివరి రోజు ఆదివారం మహబూబ్‌నగర్‌లో అబ్బుర పరిచింది. కళాకారులు పోటాపోటీగా ప్రదర్శించిన నృత్యాలు మంత్ర ముగ్దులను చేశాయి.

నృత్య ప్రదర్శన అదిరింది
వీణలు వాయిస్తున్న కళాకారిణులు

ఆకట్టుకున్న భరతనాట్యం, కూచుపూడి, పేరిణి శివతాండవం

ముగిసిన జాతీయ సమైక్యతా వజ్రోత్సవం


మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 18: రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవం చివరి రోజు ఆదివారం మహబూబ్‌నగర్‌లో అబ్బుర పరిచింది. కళాకారులు పోటాపోటీగా ప్రదర్శించిన నృత్యాలు మంత్ర ముగ్దులను చేశాయి. పట్టణంలోని రాయల్‌ ఫంక్షన్‌ హాల్‌లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. అంతకు ముందు అంబేడ్కర్‌ చౌరస్తా నుంచి రాయల్‌ ఫంక్షన్‌హాల్‌ వరకు కళాకారులు వివిధ వేషధారణలతో డప్పు దరువులతో ర్యాలీగా ఫంక్షన్‌హాల్‌కు చేరుకున్నారు. కార్యక్రమానికి రాష్ట్ర ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కళారూపాలను తిలకించి ప్రశంసలు కురిపించారు. ప్రముఖ నృత్యకారిణి మంజుల రామస్వామి బృందం ‘కోటి రతనాల వీణ నా తెలంగాణ’ అనే పాటకు చేసిన భరతనాట్యం అందరినీ కట్టిపడేసింది. సారే జహాసే అచ్చా గీతానికి 25 మంది సంగీత కళాకారిణులు ఒకేసారి వీణలు వాయించడం సభికులను మంత్రముగ్దులను చేసింది. వెంకట్‌   శ్రీనివాస్‌గౌడ్‌ సత్కరించారు. 


అభివృద్ధిలో ఆదర్శం: మంత్రి

అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా ఉందని మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రసంగించారు. మనతోపాటు స్వాతంత్య్రం సాధించిన దేశాలతో పోలిస్తే మనం అభివృద్ధిలో ఏ స్థానంలో ఉన్నామో పరిశీలించి, వేగంగా అభివృద్ధి చెందిన దేశాల మాదిరిగా మన దేశమూ ఒక లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. పేదరికాన్ని తరిమేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. స్వాతంత్య్రం సిద్ధించినపుడు మనలాంటి జీడీపీ స్థాయి ఉన్న దేశాలు ఎలా ముందుకు వెళ్తున్నాయో, ఆస్థాయికి మనం వెళ్లేందుకు ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన 13 నెలల తరువాత తెలంగాణ ప్రజాస్వామ్య వ్యవస్థలోకి వెళ్ళిందన్నారు. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో భవిష్యత్తు తెలంగాణ అద్భుతంగా ఉండబోతోందన్నారు. జాతీయ సమైక్యతా దినోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు వేడుకలను ఎంతో వైభవంగా నిర్వహించామన్నారు. వజ్రోత్సవాలను విజయవంతం చేయడం కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ స్వర్ణాసుధాకర్‌రెడ్డి, కలెక్టర్‌ ఎస్‌ వెంకట్రావు, అడిషనల్‌ కలెక్టర్‌ తేజస్‌నందలాల్‌ పవార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ఏ.రాములు, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ రాజేశ్వర్‌గౌడ్‌, మునిసిపల్‌ చైర్మన్‌ కోరమోని నర్సింహులు, ముడా చైర్మన్‌ గంజి వెంకన్న, రైతుబంధు అధ్యక్షుడు గోపాల్‌యాదవ్‌, కమిషనర్‌ ప్రదీప్‌కుమార్‌, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.











Updated Date - 2022-09-19T04:32:33+05:30 IST