కలవరపెడుతున్న సెకండ్‌ వేవ్‌

ABN , First Publish Date - 2021-03-09T03:35:00+05:30 IST

కరోనా సేకండ్‌ వేవ్‌ కలవర పెడుతోంది. గతేడాది మార్చిలో ప్రారంభమైన కరోనా ఈ సంవత్సరం జనవరి నాటికి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది.

కలవరపెడుతున్న సెకండ్‌ వేవ్‌
గత సంవత్సరం జాతీయ రహదారిని మూసివేత

 పెరుగుతున్న కరోనా కేసులు 

 అప్రమత్తతే శ్రీరామరక్ష..

 శివరాత్రి జాతరల్లో నిబంధనలు పాటించాలి

 కోటపల్లి/కరీంనగర్ మార్చి 8: కరోనా సేకండ్‌ వేవ్‌ కలవర పెడుతోంది. గతేడాది మార్చిలో ప్రారంభమైన కరోనా ఈ సంవత్సరం జనవరి నాటికి కొంత తగ్గుముఖం పట్టినప్పటికీ మళ్లీ సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కావడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా విజృంభించగా అక్కడి ప్రభుత్వం కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. సరిహద్దులో స్ర్కీనింగ్‌ పరీక్షలు చేయకపోవడం, ప్రజలు నిర్లక్ష్యం వహించడంతో కరోనా తీవ్రత పెరుగుతోంది.  జిల్లాలో నిత్యం పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. దీంతో సరిహద్దుల వద్ద వైద్య శిబిరాలు నిర్వహించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. 

-భయం గుప్పిట్లో విద్యార్థులు

కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులు భయం గుప్పిట్లో ఉన్నారు. ప్రత్యక్ష తరగతుల నిర్వ హణ కొనసాగుతుండగా విద్యార్థులు పూర్తిస్థాయిలో హాజరు కావడం లేదు. పాఠశాలలు, వసతి గృహాల్లో రక్షణ చర్యలు చేపట్టినా పిల్లలను వసతి గృహాలకు పంపేందుకు తల్లిదండ్రులు సుముఖత చూపడం లేదు. గత సంవత్సరం 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే ప్రమోట్‌ చేయగా, ప్రస్తుతం పాఠశాలలు తెరుచుకున్నాయి. అయితే సెకండ్‌ వేవ్‌ ప్రారంభం కావడంతో పరీక్షలు జరుగుతాయా లేదా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.   ఎండలు పెరుగుతుండడంతో వైరస్‌ అంతగా వ్యాపించదని, మాస్కులు, శానిటైజర్లు, సోషల్‌ డిస్టెన్స్‌ పాటించాలని వైద్యులు అంటున్నారు. 

-సరిహద్దు భయం...

కోటపల్లి, వేమనపల్లి మండలాలను ఆనుకుని  మహారాష్ట్ర ఉండడం, అక్కడ కరోనా ఉధృతి ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. సరిహద్దున ఉన్న గడ్చిరోలి జిల్లాలో అంతగా ప్రమాదం లేదని, భయపడాల్సిన అవసరం లేదని పలువురు అంటున్నారు. పక్క రాష్ట్రం నుంచి జిల్లాలోని సరిహద్దు మండలాలకు బంధుత్వాలు ఉండడం,  రెండు రాష్ట్రాల మధ్యన ఉన్న ప్రాణహిత నదిలో నీటి ప్రవాహం తగ్గడంతో రేవులు ఏర్పడగా రాకపోకలు సాగుతున్నాయి. అలాగే అంతర్రాష్ట్ర వంతెనపై నుంచి నిత్యం రాకపోకలు సాగుతుండగా అధికారులు వీటిపై దృష్టి పెట్టి వైద్య పరీక్షలు నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. 

-శివరాత్రి జాతరలకు పోటెత్తనున్న ప్రజలు

ఈ నెల 11న జరిగే శివరాత్రి పర్వదినంపై అధికార యంత్రాంగం దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది. పండుగ సందర్భంగా శివాలయాలకు భక్తులు పోటెత్తనున్నారు. తెలంగాణ, మహారాష్ట్ర నుంచి భక్తులు కాళేశ్వర క్షేత్రానికి రానున్నారు. జాతరతోపాటు గోదావరి నదుల్లో భక్తుల పుణ్యస్నానాలతో కరోనా పెరిగే అవకాశం ఉంది.  

అప్రమత్తతే శ్రీరామరక్ష 

- డాక్టర్‌ సత్యనారాయణ, పీహెచ్‌సీ కోటపల్లి  

కరోనా క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాస్కులు, శానిటైజర్‌లు వాడుతూ భౌతికదూరం పాటించాలి. పాఠశాలలు, వసతి గృహాల్లోని విద్యార్థులకు అవగాహన కల్పించాం. శివరాత్రి లాంటి పర్వదినాల్లో మరింత రక్షణ చర్యలు తీసుకోవడంతోపాటు ప్రజలు అప్రమత్తంగా ఉంటే కరోనా నుంచి కాపాడుకోవచ్చు. 


Updated Date - 2021-03-09T03:35:00+05:30 IST