నీటి బొట్టు.. ఒడిసిపట్టు

ABN , First Publish Date - 2021-06-23T06:58:18+05:30 IST

స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాద్‌కి అమృత్‌ మహోత్సవం కింద పలు కార్యక్రమాలు చేపట్టింది. అందు లో భాగంగా నీటి వనరులను ఒడిసిపట్టి భూగర్భజలాలు, వృక్ష సంపదను పెంచేందుకు దశలవారీగా ప్రణాళికలు రూపొందించింది.

నీటి బొట్టు.. ఒడిసిపట్టు
నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొత్తపల్లిలో చేపట్టిన నీటి నిల్వ పనులు

జలశక్తి అభియాన్‌లో ఉమ్మడి జిల్లాలో నీటి సంరక్షణ కార్యక్రమాలు

ప్రజల్లో అవగాహనకు విస్తృత ప్రచారం

సాంకేతిక పద్ధతుల ద్వారా పనుల గుర్తింపు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి,నల్లగొండ): స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఆజాద్‌కి అమృత్‌ మహోత్సవం కింద పలు కార్యక్రమాలు చేపట్టింది. అందు లో భాగంగా నీటి వనరులను ఒడిసిపట్టి భూగర్భజలాలు, వృక్ష సంపదను పెంచేందుకు దశలవారీగా ప్రణాళికలు రూపొందించింది. నీటిని ఎందుకు నిల్వ చేసుకోవాలో గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడం, ఈ పనుల కు ఉపాధిహామీ నుంచి నిధులు మంజూరుచేయడం వంటివి ఇప్పటి వరకు జరుగుతోంది. రాబోయే రోజుల్లో సాంకేతికతను జోడించి ఏ ప్రాంతాల్లో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంది, చెరువులు, చెక్‌ డ్యా మ్‌లు వంటి వాటిల్లో ఎక్కడ పూడికతీత చేపట్టాలో నిర్ధారిస్తారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరువు కారణంగా నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో ఈ పథకాన్ని స్థానికంగా  విస్తృతంగా చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.


ప్రకృతి వైపరీత్యాల కారణంగా పడిపోతున్న భూ గర్భ జలాలను కాపాడేందుకు కేంద్రం ‘జలశక్తి అభియాన్‌’ కార్యక్రమానికి శ్రీకారంచుట్టింది. అందులో భాగంగా వృథాగాపోతున్న వర్షపు నీటిని ఒడిసి పట్టడంతో కలిగే ప్రయోజనాలను వివరిస్తూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నా రు. ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైన ఈ కార్యక్రమం నవంబరు వరకు నిర్వహిస్తారు. నీ టి నిల్వలను ఎలా కాపాడుకోవాలో, ఎలాంటి పనులు చేపట్టడం భూగర్భ జలాలు పెరుగుతాయో సదస్సుల ద్వారా గ్రామాల్లో వివరిస్తున్నారు. పల్లెపల్లెన కళాజాతలు నిర్వహించడంతోపాటు కరపత్రాలు,వాల్‌పోస్టర్ల ద్వా రా విస్తృత ప్రచారం చేస్తారు. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో చేపడుతున్నారు. తొలి దశలో 2019 జూలై నుంచి సెప్టెంబరు వరకు కార్యక్రమాలు నిర్వహించారు. కరోనా ప్రభావంతో గత ఏడాది నిర్వహించలేదు. తాజాగా, మూడో దశ జిల్లాలోని 844 పంచాయతీలు, 8 మునిసిపాలిటీల్లో అవగాహన సదస్సులు జరుగుతున్నాయి. 


నీటి సంరక్షణ ప్రణాళికలు

ప్రజలకు నీటి సంరక్షణపై అవగాహన కల్పించడం, అందుకు ప్రతి గ్రామానికి, మండలానికి ప్రణాళిక తయారుచేయడం ఈ కార్యక్రమ ముఖ్యఉద్దేశం. కలెక్టర్‌స్థాయిలో సంబంధిత శాఖల సమన్వయంతో జిల్లాస్థాయి కమిటీని ఏర్పాటు చేశారు. జిల్లా స్థాయిలో జరిగే కార్యక్రమాలను క్రోడీకరిచేందుకు ఓ కేంద్రాన్ని సైతం ఏర్పాటు చేశారు. అందులో పంచాయతీరాజ్‌, నీటిపారుదలశాఖ అధికారులు సభ్యులుగా ఉంటారు. అన్ని శాఖల సమన్వయంతో కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పథకంలో భాగంగా ఇంటి పైకప్పు నీటి సంరక్షణ, నీటి సంరక్షణ గుంతలు, చెక్‌డ్యామ్‌లు, చెరువుల పూడికతీత, సాగునీటి కాల్వల్లో ముళ్లపొదలు తొలగించడం, చెరువు శిఖం ఆక్రమణలు గుర్తించి వాటిని తొలగించడం వంటివి చేస్తారు. గుర్తించిన పనులను ఉపాధిహామీ నిధులతో చేపడతారు. మ్యాజిక్‌ సోక్‌ పి ట్‌, కమ్యూనిటీ సోక్‌ పిట్లు, బోర్‌వెల్‌ రీచార్జ్‌ స్ట్రక్చర్లు, ఇంటి పైకప్పు వర్షపు నీటిసంరక్షణ వంటి పనులతో మంచి ఫలితాలు ఉంటాయని అఽధికారు లు చెబుతున్నారు. భూగర్భ జలాలు తక్కువగా ఉన్న దేవరకొండ, మునుగోడు, నకిరేకల్‌, సాగర్‌, సూర్యాపేట జిల్లాలో తుంగతుర్తి, యాదాద్రి జిల్లా లో ఆలేరు, భువనగిరి నియోజవర్గాలపై అధికారులు దృష్టి సారించారు. ఇప్పటివరకు చేపట్టిన నీటి నిల్వ పనులకు భవిష్యత్తులో సాంకేతికను వినియోగించనున్నారు. త్వరలో ఒక యాప్‌ను కేంద్రం అందుబాటులోకి తేనుంది. దీని ద్వారా అక్షాంక్ష, రేఖాంశాల ఆధారంగా ఎక్కడెక్కడ నీటి నిల్వ చేయాలో, పూడికతీత పనులు చేపట్టాలో నిర్ధారిస్తారు. ఇప్పటికే చేపట్టిన నీటి నిల్వ పనుల సమాచారం ఈ యాప్‌లో ఉంటుంది.


రైతులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి : కాళిందిని, డీఆర్‌డీఏ పీడీ

వృథాగా పోతున్న వర్షపు నీటిని సంరక్షించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం పలు రకాల పథకాలను అమలు చేస్తోంది. ఏ స్కీం ద్వారా ఎవరి కి,ఎలాంటి ప్రయోజనం జరుగుతుందో సదస్సుల్లో వివరిస్తున్నాం. ఉపాధి నిధులతోనే జిల్లా ప్రజలు, రైతుల వ్యక్తిగత స్థలాల్లో నీటి సంరక్షణ పనులు చేపడతున్నాం. రైతులు, జిల్లా ప్రజలు ముందుకు వచ్చి దీన్ని ఉపయోగించుకోవాలి. ఇలాంటి పథకాలు అరుదుగా వస్తుంటాయి.


Updated Date - 2021-06-23T06:58:18+05:30 IST