Abn logo
Jun 24 2021 @ 00:57AM

గజ.. గజ!

పలమనేరు పట్టణానికి ఆనుకొని ఉన్న పెద్దచెరువు ఆయకట్టులో బుధవారం ఉదయం 6గంటల ప్రాంతంలో కనిపించిన 26 ఏనుగులగుంపు

పలమనేరు సమీపంలోకి వచ్చిన 26 ఏనుగుల మంద 


పలమనేరు: మంగళవారం రాత్రి 26 ఏనుగుల గుంపు కొలమాసనపల్లె మీదుగా గొల్లపల్లె వద్దకు చేరుకున్నాయి. అక్కడ అందినకాడికి పంటలు ఆరగిస్తూ హల్‌చల్‌ చేశాయి. అప్రమత్తమైన రైతులు, ట్రాకర్లు టపాకాయలు పేల్చుతూ ఏనుగులను తరమడంతో అడవిలోకి వెళ్లకుండా గ్రామాలవైపుకు మళ్లుకున్నాయి. అక్కడినుంచి మొరం, నక్కపల్లె, రామాపురం, కమలాపురం, చిన్నపేట కురప్పల్లె మీదుగా బొమ్మిదొడ్డికి బుధవారం వేకువజామున చేరుకున్నాయి. ఆ తరువాత బోడిరెడ్డిపల్లె గ్రామంవైపుకు నడిచాయి. అక్కడి పొలాల్లో బద్రీనాద్‌ అనే రైతుకు చెందిన పాడిఆవును తొండంతో బాది చంపేశాయి. బుధవారం తెల్లవారి ఝామునే పలమనేరు పెద్దచెరువు ఆయకట్టులోనికి ప్రవేశించిన ఏనుగుల మందను ఉదయం 6 గంటల ప్రాంతంలో ప్రజలు గుర్తించారు.  ఈ వార్త దావానలంలా పట్టణంలో పాకింది.  వందలాది మంది పట్టణ ప్రజలు ట్యాంకు బండ్‌ పైకి చేరుకొన్నారు. రహదారి మీద వెళ్లే వాహనాలన్నీ బారులు తీరి ఆగిపోయాయి. ప్రయాణీకులు సైతం దిగి ఏనుగులను చూశారు. పొలాలు ఎక్కడ   ధ్వంసం చేస్తాయో అనే ఆందోళనలో రైతులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.  జనాన్ని లెక్కచేయకుండా అవి ఉదయం 8గంటలనుంచి ఉదయం 10 గంటల వరకు పెద్దచెరువు ఆయకట్టులోనే అటుఇటు తిరగాయి. 


విషయం తెలిసి ఉదయం 7.30 ప్రాంతంలో చిత్తూరు, కుప్పం నుంచి వచ్చిన అటవీశాఖ అధికారులు ట్రాకర్లు పెద్దసంఖ్యలో చేరుకున్నారు.  ఏనుగులను అటవీ ప్రాంతానికి పంపేందుకు  9 గంటల నుంచి  బాణసంచాకాల్చుతూ, బాంబులు పేల్చుతూ ప్రయత్నించారు. బాంబులు పేల్చే యత్నంలో ప్రమాదవశాత్తు బాంబు చేతిలో పేలడంతో ట్రాకర్‌ హరిబాబు చేతివేళ్లు చితికిపోయాయి. సమీపంలోని మరో ట్రాకర్‌ గుణశేఖర్‌చెవికి గాయం కాగ, మరో ట్రాకర్‌ అర్జునప్ప చేతికి గాయం తగిలింది. వీరిని చికిత్సకోసం పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో హరిబాబు, గుణశేఖర్‌లను మెరుగైన చికిత్సకోసం తిరుపతి రూయా ఆసుపత్రికి తరలించారు. ఈ విరామ సమయంలో  ఏనుగులు పట్టణంలోని  రాధాబంగ్లా ప్రాంతంలోను అటుపిమ్మట పట్టణానికి ఆనుకొని ఉన్న బొమ్మిదొడ్డి, నీళ్లకుంట పొలాల వద్దకు పరుగులు తీశాయి.


ఆరెండు గ్రామాలకు చెందిన రైతులు, ప్రజలు కేకలు పెట్టడంతో  అక్కడినుంచి బొమ్మిదొడ్డి చెరువు వద్దకు చేరుకొని సుమారు 30 నిముషాల పాటు చెరువులోని నీటిలో జలకాలాటలు ఆడాయి. అక్కడికి ట్రాకర్లు చేరుకొని మళ్లి బాంబులు, బాణసంచాపేల్చి ఏనుగులను అటవీ ప్రాంతం వైపుకు మళ్లించేందుకు ప్రయత్నాలు చేశారు. ఏనుగుల గుంపు 12 గంటల ప్రాంతంలో  కౌండిన్య నదిలో దిగి అటవీ ప్రాంతం వైపుకు కదలడం ప్రారంభించాయి.  ఏనుగుల గుంపును మళ్లించడానికి ఓపక్క పొలాలవద్ద రైతులు, మరోపక్క వాటిని చూడడానికి ఎగబడుతున్న ప్రజలతో అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. నివాసాల్లోకి ప్రవేశిస్తే అదుపుచేయడం ఎలా అని తీవ్ర ఆందోళన చెందారు.  అ తరువాత అధికారులందరూ కలసి చర్చించుకుని ఒక ప్రణాళిక ప్రకారం ప్రయత్నాలు మొదలుపెట్టారు.  ఏనుగుల గుంపును తావడపల్లె, జంగాలపల్లె, కోతిగుట్ట, చిన్నకుంట మీదుగా మొపలిమడుగు అటవీ ప్రాంతంలోకి అతికష్టంపై మళ్లించగలిగారు. అడవిలోకి ప్రవే శించడంతో, రైతులతోపాటు అటవీశాఖ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. అతికష్టం మీద బుధవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో  పలమనేరు మండలంలోని ఇందిరానగర్‌ అటవీప్రాంతం లోనికి ఏనుగుల గుంపును పంపివేశారు. 


పంటలు ధ్వంసం

ఈ ఏనుగుల దాడుల్లో పలు గ్రామాల రైతులకు చెందిన టమోటా, వరి, చెరకు, బొప్పాయి, మామిడి తోటలు, పైప్‌లైన్లు ద్వంసమయ్యాయి. ఒక్కసారిగా ఇంతపెద్ద సంఖ్యలో ఏనుగుల గుంపులు పొలాల్లోకి ప్రవేశించడంతో, వాటిని అదుపుచేయడానికి రైతులకు సాధ్యం కాలేదు. ప్రభుత్వం స్పందించి ఏనుగుల దాడుల నుంచి పంటలకు రక్షణ కల్పించడంతోపాటు, గ్రామాలపైకి ఏనుగుల గుంపు ప్రవేశించకముందే తగిన చర్యలు తీసుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. 


నాటు బాంబు చేతిలోనే ఎలా పేలిపోయింది?

ఏనుగులను తరిమే ప్రయత్నంలో చేతిలోనే నాటుబాంబు పేలి ఒక ట్రాకర్‌ చేతి వేళ్లు చితికిపోయి, మరో ఇద్దరు గాయపడ్డ సంఘటన అటవీ సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. తమిళనాడు రాష్ట్రం లో తయారు చేసిన నాటు బాంబులను, బాణ సంచాలనే అటవీశాఖ అధికారులు ఎక్కువగా కొనుగోలు చేసి ట్రాకర్లకు సరఫరా చేస్తారని తెలుస్తోంది. ఇవి నాసిరకంగా ఉన్నందు వల్లే ఆకస్మికంగా చేతిలోనే పేలిపోయి వుంటాయన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  చేతిలో బాంబు పేలి వేళ్లు కోల్పోయిన హరిబాబు భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం అవుతోంది.  ఈసంఘటన మీద లోతుగా విచారిస్తే చాలా అంశాలు వెలుగులోకి వస్తాయని అంటున్నారు.

పలమనేరు పెద్దచెరువు ఆయకట్టునుంచి ఏనుగుల గుంపును తరుముతున్న ఎలిఫెంట్‌ ట్రాకర్స్‌