అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ

ABN , First Publish Date - 2022-09-18T06:33:45+05:30 IST

స్వరాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ట్రేడ్‌మార్క్‌గా మారిందని, జిల్లాను కూడా ముందంజలో నిలిపామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు.

అభివృద్ధి, సంక్షేమంలో ముందంజ
సిరిసిల్లలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

 - దేశానికి తెలంగాణ ట్రేడ్‌ మార్క్‌ 

- పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు

-  ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు 

- జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి కేటీఆర్‌ 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

స్వరాష్ట్రంగా ఏర్పడిన ఎనిమిదేళ్లలోనే  తెలంగాణ అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే ట్రేడ్‌మార్క్‌గా మారిందని, జిల్లాను కూడా ముందంజలో నిలిపామని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు అన్నారు. శనివారం  జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మంత్రి కేటీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. స్వాతంత్య్ర సమరయోధులను సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి వైపు దేశం మొత్తం చూస్తోందని,  ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనదక్షతతో కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సహా ఎన్నో అనితరమైన పనులు సుసాధ్యమయ్యాయని అన్నారు.  విద్యుత్‌, నీటిపారుదల, వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ ఉపాధి కల్పన, అభివృద్ధి, ప్రజా సంక్షేమం, ఐటీ ఇలా అన్ని రంగాల్లోనూ యావత్‌ భారతావనికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిందన్నారు. 

జిల్లాలో 2.52 లక్షల ఎకరాలకు సాగునీరు

 తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే  కేసీఆర్‌  రైతాంగ ప్రధాన సమస్యలైన సాగునీరు, విద్యుత్‌ కష్టాలను  తీర్చారని మంత్రి కేటీఆర్‌ అన్నారు.   అనితర సాధ్యమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని మూడేళ్లలోనే పూర్తిచేసి తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా తీర్చిదిద్దారని, కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చారని అన్నారు. ఇదంతా కేసీఆర్‌ నాయకత్వంతో సాధ్యమైందన్నారు. మెట్ట ప్రాంతంగా ఉన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే కాళేశ్వరం ఎత్తిపోతల పథకం, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా 2.52 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం అందించేందుకు రైతుబంధు పథకం ద్వారా 2 .39 లక్షల మంది రైతులకు ఇప్పటి వరకు వెయ్యి 76 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అందజేశామన్నారు. రైతులు  పంటలను నిల్వ చేసుకునేందుకు వీలుగా జిల్లాలో రూ.33 కోట్లతో 55 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం ఉన్న 14 ఆధునిక గోదాములను నిర్మించాన్నారు. రైతుబీమా ద్వారా 1524 మంది రైతు కుటుంబాలకు రూ.76.20 కోట్ల బీమా పరిహారం చెల్లించామన్నారు. 

మిడ్‌ మానేరు వద్ద ఆక్వాహబ్‌

జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌ కేంద్రంగా రూ.2 వేల కోట్ల భారీ పెట్టుబడితో 10 నుంచి 15 వేల మందికి ఉపాధి ఇచ్చేలా 367 ఎకరాల విస్తీర్ణంలో   ఆక్వాహబ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఆక్వా రంగంలో పేరున్న అమెరికాకు చెందిన ఫిష్‌ ఇన్‌, ఫ్రెష్‌ టు హోం, ఆనందా గ్రూప్‌, సీపీ ఆక్వా గ్రూప్‌ సంస్థలు ఆక్వాహబ్‌లో పెట్టుబడులు పెట్టనున్నాయన్నారు. 

మిషన్‌  భగీరథతో ఇంటింటికీ తాగునీరు

సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాల పరిధిలో నివసిస్తున్న మూడు మున్సిపాలిటీలు సహా 447 ఆవాసాల్లో నివసిస్తున్న ప్రజలకు తాగునీరు అందించేందుకు రూ.1132 కోట్లతో మిషన్‌ భగీరథ పథకం పూర్తి చేశామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోనే తొలిసారిగా ప్రతీ ఇంటికి తాగునీరు సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ ప్రత్యేకత చాటుకుందన్నారు.

అత్మగౌరవానికి ప్రతీక డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు 

జిల్లాలో ఇప్పటి వరకూ 3,500 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు పూర్తి చేశామని, పేదల ఆత్మగౌరవానికి ప్రతికగా నిలుస్తున్నాయని మంత్రి కేటీఆర్‌ అన్నారు. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం త్వరలో రూ.3 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందించే కార్యక్రమం ప్రారంభం కానుందన్నారు. 

జిల్లాలో కొత్తగా 17 వేల మందికి పింఛన్లు 

అభాగ్యులకు ఆసరాగా ఉండాలనే సంకల్పంతో  జిల్లాలో   లక్షా 7 వేలకు పైగా నిరుపేద కుటుంబాల్లోని వృద్ధులు, వితంతువులు వికలాంగులు, ఒంటరి మహిళలు, గీత కార్మికులు, చేనేత కార్మికులు బీడీ కార్మికులు, వృద్ధ కళాకారులకు పింఛన్లు అందిస్తున్నామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ప్రతినెలా పింఛన్‌ దారులకు రూ.22.47 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. జిల్లాలో కొత్తగా 17 వేల మందికి  ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందని, లాంఛనంగా ప్రారంభించుకున్నామని అన్నారు. కల్యాణ -లక్ష్మీ పథకం ద్వారా జిల్లాలో 1783 మందికి రూ.160.20 కోట్లు షాదీ ముబారక్‌ పథకం ద్వారా 758 మందికి రూ. 6.64 కోట్లు  ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. 

జిల్లాలో 205 మందికి దళిత బంధు 

దళితుల అభ్యున్నతిని కాంక్షించి చేపట్టిన గొప్ప పథకం దళిత బంధు అని మంత్రి కేటీఆర్‌ అభివర్ణించారు. జిల్లాలో దళిత బంధు పథకంలో భాగంగా 205 మంది లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరికి లాభదాయకమైన యూనిట్ల గ్రౌండింగ్‌ పనులు కొనసాగుతున్నాయన్నారు.  ఇలాంటి అనేక సంక్షేమ పథకాలతో  తెలంగాణ సంక్షేమానికి ట్రేడ్‌మార్క్‌గా మారిందన్నారు.  దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్ర బడ్జెట్లో 35 శాతం నిధులను సంక్షేమానికే వెచ్చిస్తున్నామన్నారు. 

ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం

నిరుపేదల ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. జిల్లా కేంద్ర ఆస్పత్రి సహా వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో కార్పొరేట్‌ ఆస్పత్రులకు దీటుగా అధునాతన వైద్య పరికరాలను సమకూర్చామని, ఖరీదైన వైద్యం  అందిస్తున్నామని అన్నారు. ఇటీవల  ఎన్‌బీసీయూ వార్డును, రేడియాలజీ విభాగం, ిసీటీ స్కాన్‌, సియాన్‌, డిజిటల్‌ ఎక్స్‌రే, అలా్ట్ర సౌండ్‌ మెషిన్‌, టూడీ ఎకో అందుబాటులోకి తెచ్చామన్నారు. డెడికేటెడ్‌ పీడియాట్రిక్‌ కేర్‌ యూనిట్‌, సిక్‌ న్యూ బార్న్‌ కేర్‌ యూనిట్‌ అందుబాటులోకి తీసుకొచినట్లు చెప్పారు. వేములవాడ అధునాత ప్రాంతీయ ఆస్పత్రి భవనాన్ని ప్రారంభించుకున్నామన్నారు.  జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా  రాష్ట్రంలోని ప్రజలందరి ఆరోగ్య సంక్షేమం దృష్ట్యా  ఈ-హెల్త్‌ ప్రొఫైల్‌ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు.  18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరి అరోగ్య వివరాలు అరచేతిలో ఉండే విధంగా పరీక్షలు నిర్వహించామన్నారు. ములుగు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో పైలట్‌ ప్రాజెక్ట్‌గా చేపట్టిన హెల్త్‌  ప్రొఫైల్‌కు సంబంధించి డిజిటల్‌ హెల్త్‌ కార్డులను త్వరలో అందజేస్తామన్నారు. 

నేత కార్మికుల సంక్షేమానికి ప్రాధాన్యం 

పవర్‌లూం, చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు, వారి సంక్షేమానికి  ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. మరమగ్గాల కార్మికులకు, ఆసాములకు నిరంతరాయంగా ఉపాధి కల్పించడానికి రూ.2500 కోట్లతో  బతుకమ్మ చీరల ఉత్పత్తి, క్రిస్మస్‌, రంజాన్‌ పండుగలకు సంబంధించి ప్రభుత్వ ఆర్డర్లు ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆర్డర్లతో 15వేల మందికిపైగా కార్మికులు నెలకు రూ.16 వేలకు పైగా వేతనం పొందుతున్నారన్నారు. అలాగే గ్రూప్‌ వర్క్‌ షెడ్ల నిర్మాణం, త్రిఫ్ట్‌పథకం, ఉమ్మడి వసతుల కేంద్రం, నూలు డిపో, జనశ్రీ బీమా యోజన వంటి కార్యక్రమాల ద్వారా మరమగ్గాల పరిశ్రమ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. సిరిసిల్ల మండలం పెద్దూరు గ్రామం వద్ద 60 ఎకరాల స్థలంలో  రూ.174 కోట్ల వ్యయంతో అపెరల్‌ పార్కు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.   ఇప్పటికే రూ.4.50 కోట్లతో  గోకుల్‌ దాస్‌ ఇమేజ్‌ పరిశ్రమ స్థాపించినట్లు, 950 మంది మహిళలకు ఉపాధి కల్పించినట్లు చెప్పారు. అపెరల్‌ పార్కు నిర్మాణం పూర్తయితే 8 వేల మంది మహిళలకు గార్మెంట్‌ రంగంలో స్థానికంగా ఉపాధి లభించనుందన్నారు. వీటితోపాటు  రైతుబీమా తరహాలో దేశంలో మొట్టమొదటి సారిగా నేతన్నబీమా పథకాన్ని ప్రారంభించామన్నారు.  సిరిసిల్లతో సహా తెలంగాణలో దాదాపు 80 వేల మంది చేనేత, పవర్‌లూం కార్మికులకు బీమా వర్తిస్తుందన్నారు. 

తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు 

 ‘మతతత్వ శక్తులు తెలంగాణలో అశాంతిని సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నాయి. చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నాయి. అనాటి త్యాగధనుల ఆశయాలకు విరుద్ధంగా మతపిచ్చి మంటలు రేపాలని విచ్ఛిన్నకర శక్తులు ప్రయత్నిస్తున్నాయి. అప్రమత్తంగా ఉండి కుట్రలను తిప్పికొడుదాం, వివేకంతో విద్వేషాన్ని ఓడిద్దాం’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఎందరో వీరుల త్యాగాలు, బలిదానాల ఫలితంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం  అభివృద్ధి, సంక్షేమంలో ముందుకు దూసుకుపోతోందన్నారు.   పచ్చని పంటలతో ముందుకు వెళ్తున్న తెలంగాణలో జాతీయ సమై క్యత దినోత్సవ స్ఫూర్తితో మతసామరస్యాన్ని, జాతి సమగ్రతను నిలబెట్టుకుందామని, ప్రజల మధ్య ఐక్యతను చెదరనివ్వకుండా కాపాడుకుందామని అన్నారు. 1948 నుంచి 1956 వరకు రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ పేరిట ఆంధ్రాలో విలీనం చేసే సమయంలోనూ ‘ఆంధ్రా సాంబార్‌ గో బ్యాక్‌’ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. 60వ దశకంలో తెలంగాణ కోసం పోరాడామని, 2001లో కేసీఆర్‌ నాయకత్వంలో 14 ఏళ్లు పోరాటం చేశామని అన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అభివృద్ధిలో దేశానికే ట్రేడ్‌ మార్కుగా నిలిచిందన్నారు. సెప్టెంబరు 17 సందర్భాన్ని కూడా వక్రీకరిస్తున్నారని, స్వార్థ ప్రయోజనాల కోసం కొన్ని శక్తులు మంటలు రగిలిస్తున్నాయని అన్నారు. తెలంగాణ శాంతి సౌభాగ్యాలతో ఉండాలే తప్ప అశాంతి, అలజడులతో కాదన్నారు మతోన్మాద శక్తుల నుంచి మరోసారి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉదన్నారు. సెప్టెంబరు 17వ తేదీకి ఒక విశిష్టత ఉందన్నారు. 74 సంవత్సరాల క్రితం తెలంగాణ భారతదేశంలో అంతర్భాగంగా మారిందన్నారు. రాచరిక పాలన నుంచి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందిందన్నారు. ఈ సందర్భంగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను ఘనంగా జరుపుకుంటున్నామన్నారు. భారత స్వాంతంత్య్ర వజ్రోత్సవాలను కూడా దేశంలో ఎక్కడా నిర్వహించనంత ఘనంగా జరుపుకున్నామన్నారు. ప్రజలందరి గుండెల్లో దేశభక్తి భావన రగిలేలా 15 రోజులపాటు  ఉత్సవాలు నిర్వహించుకున్నట్లు చెప్పారు.  బ్రిటీష్‌ వాళ్లు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటీష్‌ ఇండియా ఒక భాగం కాగా స్వదేశీ రాజుల పాలనలో ఉన్న సంస్థానాలు రెండో భాగమని అన్నారు. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువలు, జవహరల్‌లాల్‌ నెహ్రూ కల్పించిన విశ్వాసం, మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌  నెలకొల్పిన మతాతీత దేశభక్తి, తొలి హోంమంత్రి సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ప్రదర్శించిన చాకచక్యంతో సంస్థానాలు దేశంలో కలిసి పోయాయన్నారు. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం అనాటి సమాజం ఉద్భవించిందని, అనాటి యోధుల వెలకట్టలేని త్యాగాలను తలచుకోవడం మనందరి బాధ్యతని అన్నారు. అదివాసీ యోధుడు కొమురంభీం, అమరత్వంతో చరిత్రను లిఖించిన దొడ్డికొమురయ్యతోపాటు రావి నారాయణరెడ్డి, స్వామి రామానందతీర్థ, భీంరెడ్డి నర్సింహరెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన అరుట్ట రామచంద్రారెడ్డి, కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్‌, దేవులపల్లి వెంకటేశ్వర్‌రావు, బద్దం ఎల్లారెడ్డి, సీహెచ్‌ రాజేశ్వర్‌రావు వంటి ప్రజానేతల త్యాగాలను సగౌరవంగా స్మరించుకోవాలన్నారు. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజం నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ, ముగ్దుం మొయినుద్దీన్‌, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, సోయబుల్లా ఖాన్‌, వంటి సాహిత్య మూర్తులకు ఘనమైన నివాళులు అర్పిద్దామన్నారు. ప్రజల మధ్య సమైక్యత విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యతతో దేశం అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడడమే నిజమైన దేశభక్తి అన్నారు. 75 ఏళ్ల స్వాంతంత్య్ర భారతదేశంలో తెలంగాణ 60 సంవత్సరాలపాటు అస్థిత్వం కోసం ఉద్యమించిందన్నారు. ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడి అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని, అనతి కాలంలోనే దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా రూపు దాల్చిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనతి కాలంలోనే రైతాంగం ఎదుర్కొంటున్న సాగునీరు, కరెంట్‌ సమస్యలను తీర్చారన్నారు. కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణను దేశపు ధాన్యాగారంగా మార్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు.   కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, పవర్‌లూం టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌,  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఎస్పీ రాహుల్‌హెగ్డే, అదనపు కలెక్టర్లు సత్యప్రసాద్‌, ఖీమ్యానాయక్‌, ఆర్డీవో శ్రీనివాసరావు, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట అగయ్య, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌,  సిరిసిల్ల టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, పాల్గొన్నారు. 

మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ 

జిల్లా కేంద్రంలో న్యాక్‌ ద్వారా 30 రోజులపాటు కుట్టు శిక్షణ పొందిన 25 మంది మహిళలకు మంత్రి కేటీఆర్‌ కుట్టు మిషన్లను పంపిణీ చేశారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా కలెక్టరేట్‌లో రూ.6,500 విలువైన మిషన్‌లను అందించారు.  




Updated Date - 2022-09-18T06:33:45+05:30 IST