కారు వెనక సీటు నుంచి శబ్దం.. చూసి హడలిపోయిన యజమాని!

ABN , First Publish Date - 2021-04-03T01:34:01+05:30 IST

షాపింగ్‌కు వెళ్లి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కుని కారు డిక్కీలో వేసుకుని వెళ్తున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది.

కారు వెనక సీటు నుంచి శబ్దం.. చూసి హడలిపోయిన యజమాని!

న్యూఢిల్లీ: షాపింగ్‌కు వెళ్లి ఇంటికి అవసరమైన సామాన్లు కొనుక్కుని కారు డిక్కీలో వేసుకుని వెళ్తున్న వ్యక్తికి వింత అనుభవం ఎదురైంది. వెనక సీటు నుంచి వింతగా శబ్దం వస్తుండడంతో యథాలాపంగా అటువైపు తలతిప్పి చూసిన అతడు షాక్‌తో బిగుసుకుపోయాడు. భయంతో వణికిపోయాడు. మెక్సికోలో జరిగిందీ ఘటన. వెనక సీటులో దాదాపు 15వేల తేనెటీగలు ఝుమ్మని శబ్దం చేస్తూ కనిపించాయి. హడలిపోయిన అతడు కారు దిగి అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశాడు. వెంటనే కారు వద్దకు చేరుకున్న సిబ్బంది కారు లోపల ఉన్న తుమ్మెదల గుంపును చూసి నోరెళ్లబెట్టారు. వారితోపాటు వచ్చిన డ్యూటీలో లేని ‘బీ కీపర్’ కూడా అయిన ఫైర్ ఫైటర్ జెస్సీ జాన్సన్ చొరవ తీసుకుని కారులోకి వెళ్లి తేనెటీగలను బయటకు వెళ్లగొట్టాడు. ప్రజలు తేనెటీగల బారినపడకుండా తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని జాన్సన్ చెప్పుకొచ్చాడు. 


ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలను అగ్నిమాపక శాఖ షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి. వైట్ జాకెట్, జీన్స్ ప్యాంట్ ధరించిన జాన్సన్ తేనెటీగలను వెళ్లగొడుతున్నట్టు ఆ ఫొటోలో ఉంది. వేలాది తేనెటీగలు అతడిని కమ్మేశాయి. అదృష్టవశాత్తు ఆ తేనెటీగలు కోపంగా లేవని, చాలా ప్రశాంతంగా ఉండడంతో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని పేర్కొన్నాడు. కాగా, ఇది వాటికి పునరుత్పత్తి సీజన్ కావడంతో ఇలాంటి ఘటనలు అరుదైనవేమీ కాదని నిపుణులు చెబుతున్నారు. రాణి తేనెటీగ, వాటి వెంట ఉండే శ్రామిక తేనెటీగలు కొత్త ఇంటి కోసం వెతుకుతుంటాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో ఇలాంటి ఘటనలు కనిపిస్తుంటాయని వివరించారు.   

Updated Date - 2021-04-03T01:34:01+05:30 IST