అసాధారణ జ్ఞానానికి మారుపేరు
ABN , First Publish Date - 2021-06-29T07:10:14+05:30 IST
దేశ అభివృద్ధిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీలకపాత్ర పోషించారని,
- దేశాభివృద్ధికి పీవీ చేసిన సేవలు ఎనలేనివి: ప్రధాని మోదీ
- ఆర్థిక, విదేశీ విధానాలకు కొత్త దిశ చూపారు: మన్మోహన్
- పీవీ ఆలోచనలను అమలు చేస్తున్న కేసీఆర్: సురేశ్‌రెడ్డి
న్యూఢిల్లీ/హైదరాబాద్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): దేశ అభివృద్ధిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కీలకపాత్ర పోషించారని, ఆయన సేవలు ఎన్నటికీ మరువలేనివని ప్రధాని మోదీ అన్నారు. అసాధారణ జ్ఞానానికి ఆయన మారు పేరని తెలిపారు. పీవీ శత జయంతి సందర్భంగా సోమవారం ఆయనకు మోదీ ఘనంగా నివాళులర్పించారు. ‘‘మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులు. జాతి అభివృద్ధికి ఆయన చేసిన విశేష సేవలను దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఆయన అసాధారణ జ్ఞాని, మేధావి’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. గత ఏడాది మన్‌కీ బాత్‌లో పీవీకి ఘనంగా నివాళులర్పించిన ఆడియో క్లిప్‌ను కూడా ట్వీట్‌కు జత చేశారు.
మాజీ ప్రధాని పీవీ.. భారతదేశ ఆర్థిక సంస్కరణలకు వివాదరహిత మార్గదర్శకుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. దేశాభివృద్ధికి ఆయన చేసిన సేవలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోరన్నారు. ఆయన పాలనా దక్షుడు, దార్శనికుడని కొనియాడారు.
మరోవైపు తెలంగాణ భవన్‌లో పీవీ శత జయంతి ఉత్సవాలను నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధి కేఎం సాహ్ని, ఎంపీలు కేఆర్ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ పాల్గొని పీవీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశాన్ని, సమాజాన్ని ముందుకు తీసుకెళ్లాలనే మంచి ఆలోచనతో పీవీ తన పాలనను కొనసాగించారని తెలిపారు. పీవీ విధానాలను మరింత బలంగా మార్చి సీఎం కేసీఆర్ ప్రస్తుతం తెలంగాణలో అమలు చేస్తున్నారని చెప్పారు.
రాజకీయాల్లో ఆయన సన్యాసి: మన్మోహన్
భారతదేశ ఆర్థిక, విదేశాంగ విధానాలకు పీవీ నరసింహారావు ఒక కొత్త దిశను చూపారని మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్ అన్నారు. ఆయన రాజకీయాల్లో సన్యాసి అని చెప్పారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఇందిరా భవన్ నుంచి వర్చువల్‌గా నిర్వహించిన పీవీ శత జయంతి ఉత్సవ ముగింపు కార్యక్రమంలో మన్మోహన్‌సింగ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్, మాజీ మంత్రి పళ్లంరాజు పాల్గొన్నారు. ఈ సదర్భంగా పీవీ వ్యక్తిగత వైద్యుడు కె.శ్రీనాథ్‌రెడ్డికి జీవిత సాఫల్య పురస్కారాన్ని మన్మోహన్‌సింగ్ అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు హయాంలో దేశ ఆర్థిక, విదేశాంగ విధానాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపరిచే కార్యక్రమాన్ని ప్రారంభించారని.. దాన్నే ఇప్పుడు లుక్ ఈస్ట్ పాలసీగా పిలుస్తున్నారని చెప్పారు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణకు పీవీ ముద్దుబిడ్డ అన్నారు. భూసంస్కరణలు చేపట్టి లక్షలాది ఎకరాలను తెలంగాణలోని దళితులు, గిరిజనులకు పంపిణీ జరిగేలా చూశారని తెలిపారు.