ఎక్కడ దించాలి..?

ABN , First Publish Date - 2020-05-31T10:44:10+05:30 IST

మార్క్‌ఫెడ్‌ అధికారుల వైఫల్యం మొక్కజొన్న రైతుకు శాపంగా మారింది. గోదాములు సకాలంలో సిద్ధం చేయకపోవడంతో రైతులు

ఎక్కడ దించాలి..?

  • మొక్కజొన్న నిల్వకు గోదాముల కొరత
  • రోజుల తరబడి వేచివున్న లారీలు
  • టన్నుకు రూ.500 అదనపు వసూలు

(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి)

మార్క్‌ఫెడ్‌ అధికారుల వైఫల్యం మొక్కజొన్న రైతుకు శాపంగా మారింది. గోదాములు సకాలంలో సిద్ధం చేయకపోవడంతో రైతులు పంటను విక్రయిం చలేక దళారులను ఆశ్రయించి నష్టపోతున్నారు. తీరా గోదాములకు పంట తరలించినా రోజుల తరబడి వేచి ఉండాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో టన్ను మొక్కజొన్నపై లారీ యజమానులు రూ.500 వసూలు చేస్తున్నారు. గోదా ముల వద్ద సకాలంలో డెలివరీ జరగక అదనపు సొమ్ము వసూలు చేయాల్సి వస్తోందని లారీ యజమానులు చెబుతున్నారు. మరోవైపు మొక్కజొన్న పంటను తరలించే కాంట్రాక్టర్ల వద్ద అద్దె వసూలు చేసుకుంటున్నారు. కనీసం పది రోజులవరకు గోదాముల వద్ద డెలివరీ చేయకపోవడం వల్ల లారీలు ఉండి పోవాల్సివస్తోందని, తమకు నష్టం వాటిల్లుతోందని లారీ యజమానుల వాదన. లారీ మొక్కజొన్న తరలించేందుకు రూ. 12500 నష్ట పోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు.


మార్క్‌ఫెడ్‌ వైఫల్యం

గోదాములు సిద్ధం చేసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ సూచించినా మార్క్‌ ఫెడ్‌ సకాలంలో స్పందించడం లేదు. తూర్పు గోదావరి జిల్లాలో గోదాములు సిద్ధంగా ఉన్నాయి. గతంలో ఇదే విషయాన్ని అధికారులు చెప్పినా ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. తాజాగా నరసాపురం ఏఎంసీలో మొక్కజొన్న భద్ర పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అక్కడ కూడా కేవలం 5 వేల ట న్నుల సామర్థ్యం మాత్రమే ఉంది. రైతుల నుంచి కొనుగోలు చేయాల్సిన ఉత్పత్తులు అంతకు మించి ఉంటున్నాయి. గోదాముల సమస్య అంతిమంగా రైతులపై ప్రభావం చూపుతోంది.


రైతుకు అందని సొమ్ము

రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరకు పంటను కొనుగోలు చేస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో సొమ్ము అందడం లేదు. గోదాముల కొరత కారణంగా రైతులు టన్ను మొక్కజొన్న పంటపై రూ. 500 కోల్పోవలసి వస్తోంది. ఒక్కో లారీలో రూ.25 టన్నుల మొక్కజొన్న తరలిస్తారు. దానికోసం రూ. 12500 చెల్లించాల్సి వస్తోంది. లారీల కోసం క్వింటాల్‌ మొక్కజొన్నపైనే రూ.50 నష్టపోతున్నారు. ఆ పైన దళారులు దందా కొంత. వాస్తవానికి ప్రభుత్వం క్వింటాల్‌ మొక్కజొన్న రూ. 1760 ధరకు కొనుగోలు చేస్తోంది.  రైతుల నుంచి గరిష్ఠంగా రూ. 1600 ధరకు దళారులు  కొనుగోలు చేస్తున్నారు. రైతులు క్వింటాల్‌కు రూ.160 నష్టపోవాల్సి వస్తోంది.   


దిగుమతిలో చేతివాటం

మొక్కజొన్న డెలివరీ విషయంలో ఒక అధికారి చేతివాటం చూపుతు న్నాకనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారికి కొంత ముట్టజెపితే వెళ్లిన రోజే లారీ అన్‌లోడ్‌ చేసేస్తున్నారు. ఫలితంగా ముందుగా వెళ్లిన లారీలు రోజుల తరబడి క్యూలో ఉండాల్సి వస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 89వేల టన్నుల మొక్కజొన్నను కొనుగోలు చేశారు. వాస్తవానికి 1.06 లక్షల టన్నుల పంట కొనుగోలు చేయాల్సి వుంది. అంతకు మించి జిల్లాలో మొక్కజొన్న ఉత్పత్తి ఉంది. తాడేపల్లిగూడెం రూరల్‌ మండలం ఎల్‌.అగ్రహారంతో ఉన్న గోదాముల వద్ద నిల్వ ఉన్న లారీలను పరిశీలిస్తే గోదాముల సమస్య తీవ్రతకు అద్డం పడుతుంది. ఎల్‌ అగ్రహారం వద్ద తాజాగా  750 టన్నులకు సరిపడా గోదాముల సామర్థ్యం మిగిలి ఉంటే అక్కడ  350 లారీలు  నిల్వ ఉన్నాయి. సుమారు 12500 టన్నుల మొక్కజొన్న డెలివరీకి సిద్ధంగా ఉంది.  లారీ డ్రైవర్లు అక్కడే వంటా వార్పు చేసుకుని ఎండకు మలమల మాడిపో తున్నారు. తమ పేపర్లు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేస్తున్నా ఇవ్వడం లేదని డ్రైవర్లు వాపోతున్నారు.


అదేరోజు వచ్చిన లారీలు డెలివరీ అయిపో వడం సాధారణమైందంటూ డ్రైవర్లు ఆవేదన వెలిబుచ్చుతున్నారు. రైతుల సమస్యను దృష్టిలో ఉంచుకుని జిల్లాలో కొనుగోలు లక్ష్యాన్ని పెంచే యోచన లో ప్రభుత్వం ఉంది. జిల్లా నుంచి దాదాపు 1.20 లక్షల టన్నులు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. అది నెరవేరాలంటే మరో 30వేల టన్నులు మొక్కజొన్న పంటను రైతుల నుంచి సేకరించాలి. అందుకు సంబంధించి గోదాములు సిద్ధం చేసుకోవాలి. డెలివరీలో పక్షపాతం చూపితే అధికారులు అపవాదును మూట కట్టుకోవాల్సి ఉంటుంది.


గోదాములు సిద్ధం చేస్తున్నాం

గోదాముల సమస్యను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. ఒకే చోట లారీలు నిల్వ ఉండడం వాస్తవమే. ఆ సమస్యను అధిగమించడానికి తాజాగా నరసాపురం ఏఎంసీలో  గోదాములను అద్దెకు తీసుకుంటున్నాం. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తాం.

 మల్లిక, డీఎం, మార్క్‌ఫెడ్‌

Updated Date - 2020-05-31T10:44:10+05:30 IST