ధాన్యం.. దైన్యం

ABN , First Publish Date - 2020-12-04T05:56:47+05:30 IST

జిల్లాలో సుమారుగా 40 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దుక్కులు, నాట్లు, కలుపు కూలీలు, ఎరువులు, పురుగు మందుల రూపంలో ఎకరాకు సగటున రూ.35 వేలు పెట్టుబడి పెట్టారు. మరో నాలుగైదు రోజుల్లో పంట దిగుబడులు ఇల్లు చేరాల్సిన సమయంలో నివర్‌ తుఫాన నిలువునా ముంచింది.

ధాన్యం.. దైన్యం
ఇది నారు మండి కాదు.. వల్లూరు మండలంలో వర్షానికి పడిపోయి మొలకొచ్చిన వరిధాన్యం

 పొలాల్లోనే మొలకొచ్చిన వరి

 తడిసిన పైరును చూసి కన్నీళ్లు పెడుతున్న రైతు

 27,255 హెక్టార్లలో దెబ్బతిన్న వరి

 సర్కారు అంచనా ప్రకారం నష్టం రూ.40.83 కోట్లు

 రైతుల అంచనా ప్రకారం నష్టం రూ.416 కోట్లు

 తడిసినా.. రంగుమారినా మద్దతు ధరకే కొనాలంటున్న రైతులు


వరి రైతులను కష్టాలు నష్టాలు వెండాతున్నాయి. అతివృష్టికి పొలంలోనే పైరు నేలకొరిగింది. అరకొర పంటైనా చేతికొస్తుందని ఆశిస్తే.. కోత యంత్రాలు దొరకడం లేదు. దొరికినా యంత్రం బాడుగ రెండింతలు చేసేశారు. మనుషులతో కోయలేని పరిస్థితి. పొలంలో మొలకొచ్చిన పైరును చూసి కుమిలికుమిలి దుఃఖిస్తున్నారు. నివర్‌ తుఫాన పంజాకు 27,225 హెక్టార్లలో వరి పూర్తిగా దెబ్బతింది. 25 శాతం కూడా చేతికొచ్చేలా లేదు. తడిసినా.. మొలకొచ్చినా.. రంగుమారినా.. పొలంలో ఎలా ఉంటే అలానే మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో సుమారుగా 40 వేల హెక్టార్లలో వరి సాగు చేశారు. దుక్కులు, నాట్లు, కలుపు కూలీలు, ఎరువులు, పురుగు మందుల రూపంలో ఎకరాకు సగటున రూ.35 వేలు పెట్టుబడి పెట్టారు. మరో నాలుగైదు రోజుల్లో పంట దిగుబడులు ఇల్లు చేరాల్సిన సమయంలో నివర్‌ తుఫాన నిలువునా ముంచింది. ఎడతెరిపి లేని వానలకు కోతకొచ్చిన వరిపైరు నేలకొరిగింది. ఇవన్నీ పొలంలోనే మొలకలు వస్తున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం 27,255.38 హెక్టార్లలో పూర్తిగా దెబ్బతింది. స్కేల్‌ ఆఫ్‌ రిలీఫ్‌ ప్రకారం హెక్టారుకు రూ.15వేలు (ఎకరాకు రూ.6 వేలు) ప్రకారం రూ.40.83 కోట్లు నష్టం జరిగిందని వ్యవసాయ అధికారులు ప్రభుత్వానికి పంపిన నివేదిక. అన్నదాత అంచనా ప్రకారం దిగుబడి రూపంలో రూ.416 కోట్లకుపైగా నష్టపోయామని కన్నీరు పెడుతున్నారు. 8.82లక్షల క్వింటాళ్ల వరి ధాన్యం నష్టపోయారని అనధికారిక అంచనా.

పొలంలోనే మొలకలు

వర్షంతో, వరదతో నేలవాలిన పంట కొన్ని మండలాల్లో 25 శాతం కూడా చేతికొచ్చేలా లేదని రైతుల అంటున్నారు. ఆ పంటైనా కోద్దామంటే కోత యంత్రం బాడుగకు దొరకడం లేదు. పది రోజుల క్రితం మిషన బాడుగ గంటకు రూ.2 వేలకు మించిలేదు. డిమాండ్‌ దృష్ట్యా రూ.3,500-4,000 అడుగుతున్నారు. ఎకరాకు రెండు గంటలు పడుతోంది. అంటే... రూ.8  వేలు బాడుగ వస్తుంది. కోతకోశాక కోత మిషన బాడుగ మేర ధాన్యం చేతికొస్తుందా అనేది అనుమానమే. దీనికి తోడు తడిసిందని, రంగు మారిందని కొనేవారే లేరు. దీంతో పొలంలోనే వదిలేయక తప్పదని రైతులు అంటున్నారు. పొలంలో ఎలా ఉంటే అలాగే మద్దతు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.


సడలింపులు వర్తించేనా..!

నివర్‌ తుఫాన వల్ల తడిసిన, రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం అంటోంది. ఈ మేరకు బుధవారం పౌరసరఫరాల శాఖ ఎక్స్‌ అషిషియో కార్యదర్శి కోన శశిధర్‌ ఆదేశాలు జారీ చేశారు. రంగుమారిన, మొలకెత్తిన, పురుగుపట్టిన ధాన్యం కొనుగోలు పరిమితి ఇప్పటి వరకు ఉన్న 5 శాతం నుంచి 10 శాతం పెంచారు. ఈ సడలింపుల మేరకు కొనుగోలు చేస్తారా..? అన్నది ప్రశ్నార్థకమే.


ఒక్క గింజ కూడా చేతికి రాదు

- ఎన.సుబ్బారెడ్డి, ఆదినిమ్మాయపల్లె, వల్లూరు మండలం

కేసీ కాలువ కింద ఆరు ఎకరాల్లో వరి సాగు చేశాను. ఎకరాకు రూ.35 వేలు పెట్టుబడి పెట్టా. పంట చేతికొచ్చింది. మూడు ఎకరాల్లో కోత కోశాం. మిగిలిన పొలం కోద్దామనుకునేలోగా నివర్‌ నిలువున ముంచింది. పైరంతా నేలకొరిగి కుళ్లిపోయింది. పొలమంతా నారుమడిలా మొలకొచ్చింది. ఒక్క గింజ కూడా చేతికి రాదు. పెట్టుబడి రూ.లక్ష, దిగుబడి రూ.2.25 లక్షలు నీటిపాలైంది.


కౌలు కట్టేదెలా..?

- కోర సుబ్బిరెడ్డి, కోటంగురవాయపల్లె, ఖాజీపేట మండలం

ఎకరా సొంత పొలం, నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకొని వరి సాగు చేశా. ఎకరం కౌలు రూ.18-20 వేలు. సాగు ఖర్చులు అదనం. తుఫానతో పైరంతా నేలకొరిగింది. పాతిక శాతం పంట కూడా చేతికిరాదు. ఆ పంటైనా కోద్దామంటే మిషన బాడుగ గంటకు రూ.2 వేల నుంచి రూ.3,500-4,000లకు పెంచారు. కోత కూలీ కూడా రాదు.. పెట్టుబడి అప్పులు, కౌలు ఎలా కట్టాలో దిక్కుచోచడం లేదు. పొలంలో ఎలా ఉందే అలాగే మద్దతు ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసి ఆదుకోవాలి.


నిలువునా ముంచేసింది

- లక్కినేని దానం, ఈదుళ్లపల్లె 

నివర్‌ తుఫాను నిలువునా ముంచేసింది. ఒకటిన్నర ఎకరా కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తే తీరా చేతికొచ్చే సమయానికి తుఫాను వల్ల పంటంతా దెబ్బతిని మొలకలు వచ్చాయి. కోతకు కూడా అనుకూలంగా లేకపోవడంతో ప్రస్తుతానికి అలాగే వదిలేయాల్సి వచ్చింది. ఫలసాయం వస్తుందని భావిస్తే కష్టాలు కన్నీళ్లే మిగిలాయి. ప్రభుత్వం ఆదుకోవాలి.


పొలంలోనే పైరు వదిలేశా

- నాగిపోగు జయన్న, ఈదుళ్లపల్లె 

ఎకరా పొలంలో వరి సాగు చేస్తే నివర్‌ తుఫాను ఽధాటికి వెన్ను అంతా దెబ్బతిని గింజలు రాలిపోయాయి. తెల్లగా మారి మోసులొచ్చాయి. అప్పులు చేసి వరి సాగు చేస్తే కనీసం పెట్టుబడులు కూడా దక్కలేదు. దీంతో కోతకోయకుండా వదిలేశా. ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలి.


ఎలా కొనాలో పరిశీలిస్తున్నాం 

- గౌతమి, జాయింట్‌ కలెక్టరు

తుఫానతో తడిసి రంగుమారిన, మొలకొచ్చిన, పురుగుపట్టిన ధాన్యం కొనుగోలు పరిమితి 5 నుంచి 10 శాతానికి ప్రభుత్వం పెంచింది. ఎలా కొనుగోలు చేయాలో చర్చిస్తున్నాం. రైతులకు నష్టపరిహారం, బీమా కూడా అందేలా చర్యలు తీసుకుంటాం.



Updated Date - 2020-12-04T05:56:47+05:30 IST