బాలలకేదీ రక్ష?

ABN , First Publish Date - 2021-09-13T04:24:02+05:30 IST

బాలలకేదీ రక్ష?

బాలలకేదీ రక్ష?
డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో మూలకు చేరిన ముఖ్యమంత్రి బాల సురక్ష పథకం వాహనాలు

- రెండేళ్లుగా నిలిచిన బాల సురక్ష పథకం 

- మూలకు చేరిన వాహనాలు

- విద్యార్థుల ఆరోగ్యం గాలికి

- చిన్నారుల్లో పెరుగుతున్న మానసిక సమస్యలు 

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ముఖ్యమంత్రి బాల సురక్ష పథకం జిల్లాలో నిలిచిపోయింది.  రెండేళ్లుగా ఈ సేవలు అందకపోవడంతో విద్యార్థుల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చిన్నారుల్లో అనారోగ్య సమస్యలు, పుట్టుకతో వచ్చే లోపాలను సకాలంలో గుర్తించి.. వారికి చికిత్స చేయించి.. భవిష్యత్‌ను ఆరోగ్యక రంగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి బాల సురక్ష పథకాన్ని ప్రారంభించారు. 2018-19లో జిల్లావ్యాప్తంగా ఈ సేవలు ప్రారంభమయ్యాయి. దీనికోసం రూ.లక్షలు ఖర్చు చేసి 29 వాహనాలను కొనుగోలు చేశారు. కొన్ని రోజులపాటు సక్రమంగా అందిన ఈ సేవలు.. రెండేళ్లుగా నిలిచిపోవడంతో వాహనాలు మూలకు చేరాయి. 


కొవిడ్‌ కారణంతో ఆగిన సేవలు

జిల్లాలో 3,274 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో 2,74,627 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరి ఆరోగ్య సంరక్షణ కోసం బాల సురక్ష పథకం కింద జిల్లాకు 29 వాహనాలను కేటాయించారు. ప్రతి వాహనంలో ఎంబీబీఎస్‌ వైద్యుడితో సహా నలుగురు సిబ్బంది ఉండేలా చర్యలు తీసుకున్నారు. మూడు, నాలుగు మండలాలను ఒక క్లస్టర్‌గా పరిగణించి రెండు వాహనాలను కేటాయించారు. రోజూ ప్రభుత్వ పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు వెళ్లి అక్కడి పిల్లలకు పరీక్షలు చేసి అనారోగ్య సమస్యలు, లోపాలను గుర్తించేవారు. సుమారు 30 రకాల వ్యాధులను పరీక్షల ద్వారా గుర్తించేవారు. అయితే, కొవిడ్‌ కారణంగా ఇటీవల వరకు పాఠశాలలు మూసివేయడంతో ఈ పథకం కూడా ఆగిపోయింది. దీంతో ఈ వాహనాలన్నీ ప్రభుత్వ వైద్యశాలల ఆవరణలో నిరుపయోగంగా ఉన్నాయి. ప్రస్తుతం పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో ఈ పథకాన్ని అమలు చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

 

ప్రైవేటు సంస్థకు అప్పగింత?

బాల సురక్ష పథకం పునఃప్రారంభంపై జిల్లా అధికారులకు సమాచారం లేదు. దీని నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించినట్లు సమాచారం. అంగన్‌వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు స్థానిక పీహెచ్‌సీల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందితో పరీక్షలు చేయించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. చిన్నారుల్లో ఎక్కువ మందికి రక్తహీనత ఉంది. గుండె, చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవారిని వైద్యులు గతంలో గుర్తించారు. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో ఏడాదిన్నరగా ఇళ్లకే పరిమితమైన విద్యార్థుల్లో మానసిక సమస్యలు పెరుగుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. బాల సురక్ష పథకాన్ని అందుబాటులోకి తీసుకువస్తే వారిలోని లోపాలను త్వరగా గుర్తించి చికిత్స అందించే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఈ పథకం అమలుపై ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి అనుమతులు రాలేదని ఇన్‌చార్జి డీఐవో అప్పారావు తెలిపారు. ఆదేశాలు వస్తే నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. 


 

Updated Date - 2021-09-13T04:24:02+05:30 IST