ఐదేళ్ల చిన్నారికి కరోనా

ABN , First Publish Date - 2020-06-02T11:03:11+05:30 IST

ఐదేళ్ల చిన్నారి.. ఆటపాటలు తప్ప మరో ప్రపంచం తెలియదు. అటువంటి చిన్నారికి కరోనా సోకింది.

ఐదేళ్ల చిన్నారికి కరోనా

నాన్న ద్వారా వ్యాపించిన వైరస్‌

చాపకింద నీరులా విస్తరిస్తున్న కరోనా


కడప, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఐదేళ్ల చిన్నారి.. ఆటపాటలు తప్ప మరో ప్రపంచం తెలియదు. అటువంటి చిన్నారికి కరోనా సోకింది. మైలవరం మండలంలో ఇటీవల తండ్రికి కరోనా రావడంతో కోవిడ్‌-19 ఆసుపత్రికి తరలించారు. ఇంట్లో కుటుంబ సభ్యులకు టెస్టులు చేయగా ఐదేళ్ల చిన్నారికి పాజిటివ్‌ నిర్ధారణ అయిందని సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. ఈ విషయం తెలిసి కన్నవాళ్లు ఆందోళన చెందుతున్నారు. అందరికీ దూరంగా ఆ చిన్నారి కోవిడ్‌-19 ఆసుపత్రిలో దాదాపు 14 రోజులకు పైగా చికిత్స పొందాల్సి ఉంటుంది. కన్నవాళ్లకు దూరంగా ఉండగలదా..? అందరినీ కలచివేస్తున్న ప్రశ్న ఇది. మైలవరం మండలంలో ఈ ఘటన చోటు చేసుకుంది. 


జిల్లాలో సోమవారం రెండు పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి ఐదేళ్ల చిన్నారి. అలాగే కడప నగరానికి చెందిన బెటాలియన్‌లో పనిచేసే పోలీసు కానిస్టేబులుకు కూడా పాజిటివ్‌ వచ్చింది. ఈయన విజయవాడ నుంచి వచ్చారు. ఆ కానిస్టేబుల్‌ ప్రైమరీ కాంటాక్టును గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. కడప ఫాతిమా మెడికల్‌ కాలేజీ కోవిడ్‌-19 ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఉత్తరపద్రేశ్‌ చెందిన ఒకరు కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. జిల్లాలో కామన్‌ క్వారంటైన్‌, ఐసోలేషన్స్‌లలో 480 మంది ఉన్నారు. సోమవారం 988 మందికి కరోనా శాంపిల్స్‌ సేకరించారు. 


100 మంది శాంపిల్స్‌ సేకరణ

మైలవరంలో సోమవారం 5 సంవత్సరాల చిన్నారికి కరోనా పాజిటివ్‌ తేలింది. శనివారం ఈ బాలిక తండ్రికి కరోనా నిర్ధారణ కావడంతో కడపలోని కోవిడ్‌ ఆసుపత్రికి తరలించారు. ఆ కుటుంబంలో మరొకరికి కరోనా రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. కరోనా నివారణ చర్యలు మొదలుపెట్టారు. గ్రామం నుంచి రాక పోకలను పూర్తిగా నిలిపివేశారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు ఎవరెవరితో కలిశారని ఆరా తీస్తున్నారు. ఇప్పటికే దాదాపు 100 మందికి పైగా శ్వాబ్‌ శాంపిల్స్‌ సేకరించి ల్యాబ్‌కు పంపించారు. 


Updated Date - 2020-06-02T11:03:11+05:30 IST