ఎన్జీవోల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ తప్పనిసరి!

ABN , First Publish Date - 2020-09-21T07:35:26+05:30 IST

విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని (ఎఫ్‌సీఆర్‌) సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం లోక్‌సభలో సవరణ బిల్లును ప్రవేశపెట్టింది...

ఎన్జీవోల రిజిస్ట్రేషన్‌కు ఆధార్‌ తప్పనిసరి!

  • లోక్‌సభలో ఎఫ్‌సీఆర్‌ఏ సవరణ బిల్లు
  • తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు

న్యూఢిల్లీ, సెప్టెంబరు 20: విదేశీ విరాళాల నియంత్రణ చట్టాన్ని (ఎఫ్‌సీఆర్‌) సవరించడానికి కేంద్ర ప్రభుత్వం ఆదివారం లోక్‌సభలో  సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్‌ రాయ్‌ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ఈ చట్టాన్ని సవరిస్తే ఎన్జీవోల కీలక సభ్యులు, డైరెక్టర్లు తమ సంస్థ రిజిస్ట్రేషన్‌ కోసం తమ ఆధార్‌ నంబర్‌ను తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. అలాగే రాజకీయ నాయకులు విదేశాల నుంచి నిధులు సేకరించడానికి వీలు ఉండదు.


ఎన్జీవో లేదా ఏదైనా సంస్థ తన ఎఫ్‌సీఆర్‌ఏ ధ్రువపత్రాన్ని కేంద్రానికి సమర్పించాల్సి ఉంటుంది. స్వీకరించిన మొత్తం విదేశీ నిధుల్లో 20ు కన్నా ఎక్కువ నిధులను పరిపాలనా వ్యయాలపై ఖర్చు చేయడానికి వీలులేకుండా బిల్లును సవరించాలని కేంద్రం యోచిస్తోంది. ప్రస్తుతం పరిపాలనా ఖర్చులపై 50ు వరకు పరిమితి ఉంది. ప్రస్తుతం ప్రజాప్రతినిధులు, ఎన్నికల అభ్యర్థులు, ప్రింట్‌-ఎలకా్ట్రనిక్‌ మీడియా సంస్థలు, జడ్జీలు, ప్రభుత్వ ఉద్యోగులు లేదా ఏదైనా సంస్థ ఉద్యోగులు లేదా ప్రభుత్వ నియంత్రణలో ఉండే సంస్థలకు ఈ చట్టం నిబంధనలు వర్తిస్తాయి. వీరు విదేశీ విరాళాలను అందుకోలేరు.


విదేశీ విరాళాలను అందుకున్న కొన్ని ఎన్జీవోలు ఆ నిధులను దుర్వినియోగం చేశాయని, ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధల ఉల్లం ఘనలకు పాల్పడిన 19 వేల సంస్థల రిజిస్ట్రేషన్లను రద్దు చేశామని నిత్యానంద్‌ రాయ్‌ తెలిపారు. దుర్వినియోగానికి పాల్పడిన వివిధ సంస్థలపై క్రిమినల్‌ చర్యలు కూడా తీసుకుంటున్నామని, ఉల్లంఘనలకు పాల్పడిన సంస్థల ఎఫ్‌సీఆర్‌ఏ ధ్రువపత్రాన్ని రద్దుచేయడం, ఆ సంస్థలను నిషేధిత జాబితాలో చేర్చడం వంటి చర్యలూ తీసుకుంటామని చెప్పారు. మరోవైపు ఈ సవరణ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఎఫ్‌సీఆర్‌ఏ నిబంధనలను సడలించాలని కాంగ్రెస్‌ నేత మనీష్‌ తివారీ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఎన్జీవోలు విదేశీ విరాళాలను పొందకుండా చేసేందుకే ఈ బిల్లును ప్రవేశపెట్టారని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్‌ విమర్శించారు. 


Updated Date - 2020-09-21T07:35:26+05:30 IST