వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐకి ఏబీ లేఖ

ABN , First Publish Date - 2021-04-16T19:29:55+05:30 IST

తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి..

వైఎస్ వివేకా హత్య కేసుపై సీబీఐకి ఏబీ లేఖ

అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై సీబీఐ ఎందుకంత అచేతనత్వంగా ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మర్డర్ నాటి విషయాలపై తాజాగా ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వేంకటేశ్వర రావు సీబీఐకు లేఖ రాశారు. ఉగాది నాడే సీబీఐకి ఈ లేఖ రాయగా ఆలస్యంగా ఇది వెలుగు చూసింది. కాగా.. మర్డర్ జరిగిన సమయంలో రాష్ట్ర నిఘా విభాగం అధినేతగా వేంకటేశ్వర రావే ఉన్న విషయం విదితమే. ఈ లేఖ ద్వారా.. సీబీఐ విచారణ మొదలై ఏడాది గడిచినా, కేసు దర్యాప్తులో పురోగతి లేని విషయాన్ని సీబీఐ దృష్టికి తీసుకెళ్లారు. 


లేఖలో ఏముంది..!?

ఈ మర్డర్ ఘటనకు సంబంధించిన సమాచారం నా వద్ద ఉన్నది. ఈ విషయాన్ని సీబీఐకి రెండు సార్లు తెలిపాను. అయినా సీబీఐ నుంచి ఎలాంటి స్పందన లేదు. దర్యాప్తు అధికారి ఎన్. కే సింగ్‌కు స్వయంగా నేనే ఫోన్ చేసి చెప్పినా ఎలాంటి స్పందనా లేదు. వివేకా మర్డర్‌ను గుండెపోటు గానో.. ప్రమాదం గానో చిత్రీకరించేందుకు కొందరు ఎంపీలు ప్రయత్నాలు చేశారు. అంతేకాదు.. మర్డర్ జరిగిన ఇల్లంతా కడిగేసి, శవాన్ని ఆసుపత్రికి తరలించే దాకా.. ఘటనా స్థలాన్ని ఎంపీ అవినాష్ రెడ్డి, ఇతర బంధువులు వారి ఆధీనంలోకి తీసుకున్నారు. ఆ సమయంలో మీడియాను గానీ, ఇంటలిజెన్స్ సిబ్బందిని గానీ ఘటనా స్థలంలోకి అనుమతించలేదు. పోలీసులను కొందరు ప్రజా ప్రతినిధులు కావాలనే అడ్డుకున్నారుఅని ఏబీ లేఖలో నిశితంగా వివరించారు.


ఇదిలా ఉంటే.. ఈ ఘటనకు సంబంధించి సేకరించిన మొత్తం సమాచారాన్ని అప్పటి దర్యాప్తు బృందంకు ఏబీ అందజేసిన సంగతి తెలిసిందే. హత్య జరిగినప్పుడు తాను ఇంటలిజెన్స్ చీఫ్‌గా ఉన్నానని.. ఈ కారణంగానే తనను విధుల నుంచి తప్పించి ఉండొచ్చని కూడా మాజీ చీఫ్ అనుమానం వ్యక్తం చేశారు. మరోవైపు.. మర్డర్ జరిగిన సమయంలో నిఘా విభాగం బాస్‌గా ఉన్న డీజీపీ స్థాయి అధికారి సమాచారం ఇస్తానంటే పట్టించుకోని సీబీఐ వైఖరిపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-04-16T19:29:55+05:30 IST