రాయలసీమ నుంచి Chevireddy, Roja, Bhumanaకు కాకుండా ఈ ఎమ్మెల్యేకు YS Jagan మంత్రి పదవి ఇస్తారా.. ఆయన కోసం చక్రం తిప్పుతున్న సీనియర్లు.. ఏమవుతుందో..!?

ABN , First Publish Date - 2021-10-28T20:25:48+05:30 IST

రాయలసీమలో వారి ప్రాబల్యం తక్కువ. అధికారపార్టీ నుంచి ఆ సామాజికవర్గానికి ...

రాయలసీమ నుంచి Chevireddy, Roja, Bhumanaకు కాకుండా ఈ ఎమ్మెల్యేకు YS Jagan మంత్రి పదవి ఇస్తారా.. ఆయన కోసం చక్రం తిప్పుతున్న సీనియర్లు.. ఏమవుతుందో..!?

రాయలసీమలో వారి ప్రాబల్యం తక్కువ. అధికారపార్టీ నుంచి ఆ సామాజికవర్గానికి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యేగా ఆయనకు గుర్తింపు. అలాంటిది ఆ శాసనసభ్యుడు మంత్రి కావాలనుకుంటున్నారు. జిల్లాకు పెద్దదిక్కు, సీఎం జగన్‌ దగ్గర పరపతి ఉన్న మంత్రిగారితో మాటామంతి కలుపుతున్న సదరునేత అమాత్యపదవి కోసం ఆశగా చూస్తున్నారు. పనిలో పనిగా  పొరుగు ప్రాంతంలో ఉన్న తన సామాజికవర్గానికి చెందిన మంత్రి, మరో బంధువుతో కలిసి ఫైరవీలు చేస్తున్నారు. ఇంతకీ సీమలో, అందునా వైసీపీలో హవా చూపించే సామాజికవర్గాన్ని తట్టుకుని ఆయన మంత్రి పదవి సాధించగలరా? ఎవరా వైసీపీ ఎమ్మెల్యే.. అనే విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ ఇన్‌సైడ్‌లో చూద్దాం.


బొత్సతో, ఉమ్మారెడ్డితో రాయభారం..!

ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మంత్రిపదవి కోసం జిల్లా మంత్రి పెద్దిరెడ్డితో మాత్రమే కాకుండా తన సామాజికవర్గానికి చెందిన ఉత్తరాంధ్ర మంత్రి బొత్స సత్యనారాయణపై కూడా భారం వేసి నమ్ముకుంటున్నారట. బంధువు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సహకారం కూడా ఎమ్మెల్యే కోరుతున్నారట. ఇలా సామాజిక, రాజకీయ కోణాలను ఉపయోగించుకుని మంత్రిపదవి పొందాలనేది సీమ నుంచి గెలిచిన ఒకేఒక్క బలిజ ఎమ్మెల్యేగారు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు టాక్‌ వస్తోంది.


హేమాహేమీలకు కాకుండా..!

జిల్లాలో వైసీపీ తరఫున హేమాహేమీలైన రెడ్డి సామాజిక వర్గ ఎమ్మెల్యేలు ఒకటికి రెండు, మూడు సార్లు గెలిచినవారున్నారు. చంద్రగిరి నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డి హవా కొనసాగుతుందని వైసీపీ కార్యకర్తల అభిప్రాయం. ఫైర్‌బ్రాండ్‌ రోజా నగరి నుంచి రెండు సార్లు గెలిచి మంత్రిపదవి కోసం చూస్తున్నారు. తిరుపతి నుంచి గెలిచిన కరుణాకర్‌రెడ్డి కూడా ఆశలు పెట్టుకున్నవారే అంటుంటారు వైసీపీలో వ్యవహారాలు గమనించే నేతలు. సీఎం జగన్‌ రెడ్డి తన సామాజికవర్గానికి చెందినవారిని, మిగతా సామాజికవర్గ ప్రజాప్రతినిధులను సమతుల్యం చేసుకుంటూ ఎవరికి మంత్రిపదవులు ఇస్తారనే ఉత్కంఠ జిల్లాలో నెలకొంది.


పెద్దదిక్కుతోనే మంత్రిపదవి కోసం ఫైరవీ..!

నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీనివాసులు తొలుత తీసుకున్న నిర్ణయాలు జిల్లా మంత్రి పెద్దిరెడ్డికి కోపం తెప్పించాయనే టాక్ ఉంది. సీఎం దగ్గర పలుకుబడి ఉన్న పెద్దిరెడ్డితో పెట్టుకుంటే బాగుండదని అర్థమైన ఎమ్మెల్యే శ్రీనివాసులు పద్దతి మార్చుకుని రాజకీయ పరిణితితో వ్యవహరిస్తుండంతో పరిస్థితులన్నీ చక్కదిద్దుకున్నాయని అనుచరులు చెప్పేమాట. మంత్రిగారితో మంచిమాట ఉండటంతో ఆయనగారితోనే అమాత్యయోగం కోసం శ్రీనివాసులు మంత్రాంగం నడుపుతున్నట్లు వినికిడి.


సర్పంచ్ నుంచి శాసనసభ్యుడిగా..!

ఆరణి శ్రీనివాసులు సర్పంచ్‌ నుంచి శాసనసభ్యుడిగా ఎదిగిన నేత. కాంగ్రెస్‌, ప్రజారాజ్యం, తెలుగుదేశం పార్టీలు తిరిగి ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. 2009లో ప్రజారాజ్యం నుంచి, 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిపోగా 2019లో ఎట్టకేలకు ఎమ్మెల్యే కాగలిగారు. అధికారంలో లేనప్పుడు ఉన్న వ్యవహారశైలికి, పవర్‌లోకి వచ్చాక పరిస్థితిలో వచ్చిన మార్పుపై సొంత కేడర్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఆ సామాజికవర్గానికి మంత్రి పదవి లభిస్తుందా..?

రాయలసీమలో అందునా వైసీపీలో రెడ్డి సామాజిక వర్గానిదే పెత్తనమంతా అనేది విశ్లేషకులు అభిప్రాయం. ఎమ్మెల్యే సీట్ల కేటాయింపు నుంచి మంత్రి పదవుల వరకు అంతా ముందే రెడీ అయి ఉంటుందనే అందరూ చెబుతుండే మాట. సీమ జిల్లాలో చిత్తూరు జిల్లా కాస్త డిఫరెంట్‌. సామాజిక సమతుల్యత ఉంటుందని చెప్పుకునేలా అక్కడ రెడ్డీలతో పాటు కమ్మ సామాజికవర్గ ఆధిపత్యం కూడా చూస్తుంటాం. ఇక తిరుపతిలో కాపుల ప్రభావం కూడా ఎక్కువే. చిత్తూరు అసెంబ్లీ నుంచి వైసీపీ తరఫున గెలిచిన కాపు సామాజిక వర్గం నేత ఆరణి శ్రీనివాసులు మంత్రి పదవి అయ్యేందుకు చేస్తున్న ప్రయత్నాలు జిల్లాలో చర్చనీయాంశం అవుతున్నాయి.


ఆరణి శ్రీనివాసులుపై సీఎం దగ్గర రిపోర్ట్స్‌..!

చిత్తూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యే అయిన ఆరణి శ్రీనివాసులు మంత్రిపదవి కోసం చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా? జగన్‌ దగ్గర ఎమ్మెల్యేగారి గురించి రిపోర్ట్స్‌ ఎలా ఉన్నాయి? రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సామాజిక సమీకరణాలు శ్రీనివాసులుకు ఎలా ఉపయోగపడే అవకాశముందనేది మంత్రిపదవుల భర్తీ జరిగేప్పుడు కానీ తెలియద నే విశ్లేషణలు వస్తున్నాయి. ఆయన సామాజికవర్గం నేతలు మాత్రం ఎమ్మెల్యేగారికి ఆల్‌ది బెస్ట్‌ చెబుతున్నట్లు టాక్‌. 



Updated Date - 2021-10-28T20:25:48+05:30 IST