లాల్‌ మాస్‌

ABN , First Publish Date - 2018-12-29T21:25:13+05:30 IST

ఉల్లిపాయలు - రెండు (సన్నటి ముక్కలుగా తరిగి), పచ్చిమిర్చి - రెండు (సన్నటి ముక్కలుగా తరిగి..

లాల్‌ మాస్‌

కావలసినవి
 
ఉల్లిపాయలు - రెండు (సన్నటి ముక్కలుగా తరిగి), పచ్చిమిర్చి - రెండు (సన్నటి ముక్కలుగా తరిగి), ఎండుమిర్చి - ఇరవై, ధనియాలు - రెండు టీ స్పూన్లు, జీలకర్ర - ఒక టీ స్పూను, ఆవనూనె - ఒక కప్పు, వెల్లుల్లిపాయలు - రెండు (సన్నటి ముక్కలుగా చేసి), అల్లం - చిన్న ముక్క (సన్నటి ముక్కలుగా తరిగి), మటన్‌ - అరకిలో (బోన్లతో కలిపి), ఉప్పు - ఒక టీ స్పూను, కచ్రి పడి - ఒక చిన్న కప్పు (రాజస్థాన్‌లో దొరికే ఒక వెరైటీ కీరకాయలను ఎండబెట్టి పొడిలా చేస్తారు), యాలకులు - నాలుగు, మిరియాలు - అర టీస్పూను, దాల్చినచెక్క - ఒకటి (సరిపడా సైజులో), జాపత్రి - చిటికెడు, నల్ల యాలకులు - ఒకటి, నీళ్లు - సరిపడా, కొత్తిమీర - గుప్పెడు (తరుగు).
 
తయారీవిధానం
 
ఎండుమిర్చి ఘాటైన సువాసన వచ్చేదాకా నూనె వేయకుండా పాన్‌ లో వేగించాలి. ధనియాలు, జీలకర్ర కూడా వేయాలి. అవి వేగిన తర్వాత పొడి చేయాలి. పాన్‌లో కొద్దిగా ఆవనూనె వేడిచేసి వెల్లుల్లిపాయ ముక్కలు, అల్లం ముక్కలు అందులో వేయాలి.
వెల్లుల్లి పాయలు లేత బ్రౌన్‌ రంగులోకి రాగానే మటన్‌ ముక్కలు అందులో వేసి బాగా కలపాలి. అప్పుడే ఉప్పు కూడా వే యాలి. అందులో కచ్రి పొడి వేయాలి. ఈ పొడి వల్ల మటన్‌ మృదువుగా తయారవడమే కాదు మటన్‌కు మంచి రుచి జత కలుస్తుంది.
తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అందులో వేసి బాగా కలపాలి. ఉల్లిపాయముక్కలు బాగా వేగిన తర్వాత అందులో మసాలాదినుసులు, యాలకులు, నల్ల మిరియాలు, దాల్చినచెక్క, జాపత్రి, యాలకులు వేసి బాగా కలపాలి. తర్వాత కారం వేసి కాసేపు రోస్టు కానివ్వాలి. మటన్‌ముక్కలు ఉడకడానికి తగినన్ని నీళ్లు పోయాలి. మూతపెట్టి మటన్‌ మెత్తబడేవరకూ ఉడికించాలి. తర్వాత ముక్కలను మాత్రం బయటకు తీసి ఒక ప్లేటులో పెట్టి, గ్రేవీని వాటి నుంచి వేరుచేయాలి. గ్రేవీని వడపోయడం వల్ల అన్ని రకాల మసాలాలు పోతాయి కానీ వాటి తాలూకూ సువాసనలు మటన్‌ ముక్కలకు పట్టి ఉంటాయి. ఈ ముక్కలను రిఫైన్డ్‌ గ్రేవీలో కలిపి సన్నని సెగ మీద పెట్టాలి. అందులో అరకప్పు నీళ్లు, కొన్ని కొత్తిమీర ఆకులు వేసి కలిపి ఈ మిశ్రమాన్ని కొద్దిసేపు ఉడికించాలి. గ్రేవీ దగ్గరపడిన తర్వాత స్టవ్‌ మీద నుంచి దించాలి. కొత్తిమీర చల్లి వేడిగా తింటే బాగుంటుంది.

Updated Date - 2018-12-29T21:25:13+05:30 IST