ఐసీడీఎస్‌లో ఏసీబీ కలకలం

ABN , First Publish Date - 2022-08-24T06:47:49+05:30 IST

జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధులశాఖ కార్యాలయ ఇన్‌చార్జి ఝాన్సీలక్ష్మి మంగళవారం ఆర్మూర్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడడం కలకలం సృష్టించింది. ఆర్మూర్‌ సీడీపీవోగా పనిచేస్తున్న ఝాన్సీలక్ష్మికి ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీగా బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లుగా ఇన్‌చార్జి పీడీగా పనిచేస్తున్న ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను నిత్యం వేధింపులకు గురిచేసేదని పలు ఫిర్యాదులు అందాయి.

ఐసీడీఎస్‌లో ఏసీబీ కలకలం

ఆర్మూర్‌లో ఏసీబీకి చిక్కిన ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీ ఝాన్సీలక్ష్మి

రూ.12వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన సీడీపీవో

నిజామాబాద్‌అర్బన్‌/ఆర్మూర్‌టౌన్‌ ఆగస్టు 23: జిల్లా మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధులశాఖ కార్యాలయ ఇన్‌చార్జి ఝాన్సీలక్ష్మి మంగళవారం ఆర్మూర్‌లో లంచం తీసుకుంటూ పట్టుబడడం కలకలం సృష్టించింది. ఆర్మూర్‌ సీడీపీవోగా పనిచేస్తున్న ఝాన్సీలక్ష్మికి ఐసీడీఎస్‌ ఇన్‌చార్జి పీడీగా బాధ్యతలు అప్పగించారు. మూడేళ్లుగా ఇన్‌చార్జి పీడీగా పనిచేస్తున్న ఆమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలను నిత్యం వేధింపులకు గురిచేసేదని పలు ఫిర్యాదులు అందాయి. ఆర్మూర్‌ సీడీపీవో వాహన అద్దె డ్రైవర్‌ మహేందర్‌ నుంచి బిల్లుల మంజూరు కోసం లంచం డిమాండ్‌ చేస్తూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడడంతో ఏసీబీ బృందం ఐసీడీఎస్‌ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించింది. పలు ఫైళ్లను పరిశీలించింది. 

మూడేళ్లుగా ఇన్‌చార్జి పీడీగా..

ఆర్మూర్‌ సీడీపీవోగా ఉన్న ఝాన్సీలక్ష్మికి మూడేళ్ల క్రితం జిల్లా ప్రాజెక్టు అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. ఆమె పరిధిలో ఐదు ప్రాజెక్టు కార్యాలయాలు ఉండగా కిందిస్థాయి సిబ్బంది, అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలపై వేధింపులకు గురిచేసేదనే ఆరోపణలు ఉన్నాయి. అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలు ధర్నాలకు వెళ్లినపుడు ఆ రోజు వారి జీతాన్ని కూడా కట్‌చేసేదనే ఆరోపణలు ఉన్నాయి. ఐదు ప్రాజెక్టుల పరిధిలో ఐదు అద్దె వాహనాలు, జిల్లా ప్రాజెక్టు అధికారి వాహనం మొత్తం ఆరు వాహనాలకు సంబంధించిన బిల్లులు ఈమెకే మంజూరు చేసే అధికారం ఉండడంతో బిల్లుల మంజూరు చేసే విషయంలో ఇబ్బందులకు గురిచేసేదనే విమర్శలు ఉన్నాయి. మంగళవారం ఆర్మూర్‌ సీడీపీవో కార్యాలయ వాహనానికి సంబంధించిన  ఎనిమిది నెలల బిల్లులకు సంబంధించి వాటిని మంజూరు విషయంలోనే రూ.12వేలు లంచం తీసుకుంటూ పట్టుబడింది.

పెర్కిట్‌ ఐసీడీఎస్‌ కార్యాలయంలో..

ఆర్మూర్‌టౌన్‌: మున్సిపల్‌ పరిధిలోని పెర్కిట్‌లో ఐసీడీఎస్‌ కా ర్యాలయంలో మంగళవారం అవినీతి నిరోదక శాఖ అధికారులు దాడులు నిర్వహించి రూ.12వేల లంచం తీసుకుంటున్న ఇన్‌చార్జీ పీడీ, సీడీపీవో ఝాన్సీలక్ష్మీ, డాటా ఎంట్రీ ఆపరేటర్‌ అర్చనను పట్టుకు న్నారు. అవినీతి నిరోధక శాఖ ఏసీపీ ఆనంద్‌కుమార్‌, సీఐలు నగేష్‌, శ్రీనివాస్‌లు దాడులు నిర్వహించారు. ఆర్మూర్‌కు చెందిన మహేందర్‌ తన కారును ఐసీడీఎస్‌ కార్యాలయంలో సీడీపీవోకు అద్దెకు ఇచ్చాడు. ఓనర్‌ కం డ్రైవర్‌ అయిన మహేందర్‌ తన కారును నెలకు రూ.33వేల చొప్పున అద్దెకు ఇచ్చాడు. ఈయనకు రూ.8నెలలకు సంబంఽధించిన కిరాయి డబ్బులు రావల్సి ఉండగా అందుకు సంబంధించిన బిల్లును సీడీపీవో అందజేశారు. డబ్బులు మంజూరు చేసే అధికారం సీడీపీవో ఝాన్సీలక్ష్మీకి ఉండడంతో కిరాయి డబ్బులు మహేందర్‌ అకౌంట్‌లో వేశారు. మీ డబ్బులు ఇచ్చాం కాదా తమకు నెలకు రూ.3వేల చొప్పున లంఛం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ విషయమై బాధితుడు ఏసీపీ అధికారులను ఆశ్రయించాడు. డాటా ఎంట్రీ ఆపరేటర్‌ అర్చన తనకు డబ్బులు డిమాండ్‌ చేస్తుందని ఫిర్యాదు చేశాడు. ఏసీపీ అధికారులు మహేందర్‌కు మళ్లీ ఒకసారి వెళ్లి రిక్వెస్ట్‌ చేయమని సూచించారు. దీంతో సీడీపీవో వద్దకు వెళ్లి అంత డబ్బు ఇచ్చుకోలేనని బతిమిలాడగా నెలకు రూ.1500 చొప్పున ఎనిమిది నెలలకు రూ.12వేలు ఇవ్వాలని సీడీపీవో స్పష్టం చేశారు. డబ్బులను డాట ఆపరేటర్‌ అర్చనకు ఇవ్వాలని సూచించారు. మంగళవారం లంచం రూ.12వేలను డాటా ఎంట్రీ ఆపరేటర్‌ అర్చనకు ఇస్తుండగా ఏసీపీ అధికారులు పట్టుకు న్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని అన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేసిపెట్టడానికి ఇతర కారణాలకు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీపీ ప్రజలను కోరారు.

Updated Date - 2022-08-24T06:47:49+05:30 IST