ఖాతాలు ఖాళీ!

ABN , First Publish Date - 2021-10-22T04:46:40+05:30 IST

గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థానిక సంస్థలు నిధులు లేక అచేతనంగా మిగులుతున్నాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలవుతున్నారు. వారికి కార్యాలయంలో కూర్చునేందుకు సీటు కూడా లేదు. ఎంపీపీల వరకూ ఫర్వాలేకపోయినా.. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు మాత్రం ఆ పరిస్థితి లేదు.

ఖాతాలు ఖాళీ!
నెల్లిమర్ల మండల పరిషత్‌ కార్యాలయం

జిల్లా పరిషత్‌కు నిధుల కొరత

మండల పరిషత్‌, పంచాయతీలదీ అదే తీరు

ఆర్థిక సంఘం నిధుల మళ్లింపు

నిలిచిన సినరేజ్‌, నీటి తీరువా చెల్లింపులు

ఉత్సవ విగ్రహాలుగా ఎంపీటీసీలు, జడ్పీటీసీలు

నిధుల కోసం ఎమ్మెల్యేల చుట్టూ ప్రదక్షిణలు

నెల్లిమర్ల, అక్టోబరు 21: గ్రామాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషించే స్థానిక సంస్థలు నిధులు లేక అచేతనంగా మిగులుతున్నాయి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉత్సవ విగ్రహాలవుతున్నారు. వారికి కార్యాలయంలో కూర్చునేందుకు సీటు కూడా లేదు. ఎంపీపీల వరకూ ఫర్వాలేకపోయినా.. జడ్పీటీసీ, ఎంపీటీసీలకు మాత్రం ఆ పరిస్థితి లేదు. కేవలం వారు సర్వసభ్య సమావేశాలకే అన్నట్టు పరిస్థితి తయారైంది. ప్రజలు, అధికారులతో కళకళలాడే మండల పరిషత్‌ కార్యాలయాలు సైతం దయనీయ స్థితిలో ఉన్నాయి. మండల పరిషత్‌, జిల్లా పరిషత్‌ల బ్యాంక్‌ ఖాతాలు ఖాళీగా కనిపిస్తున్నాయి. పంచాయతీల పరిస్థితీ అంతే. దీంతో ప్రజలకిచ్చిన హామీలు ఎలా తీర్చాలా అంటూ నేతలు తలలు పట్టుకుంటున్నారు.

పుష్కలమైన నిధులు.. 32 శాఖల పర్యవేక్షణతో తొణికిసలాడాల్సిన జిల్లా పరిషత్‌లు ప్రాభవాన్ని కోల్పోతున్నాయి. ఎంపీలు, ఎమ్మెల్యేలు దయతలస్తేనే నిధులు అన్నట్టు పరిస్థితి ఉంది. న్యాయబద్ధంగా జడ్పీకి రావాల్సిన స్థానిక సంస్థల పన్నులు, గనులు... ఇసుక సీనరేజ్‌ చార్జీలు వంటివి ఏళ్ల తరబడి  నిలిచిపోయాయి. ప్రజల్లోకి వెళ్లాలంటే భయం వేస్తోందని కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 34 మండలాల్లో 920 పంచాయతీలు ఉన్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఇటీవల  జడ్పీ చైర్మన్‌తో పాటు ఎంపీపీలు ఎన్నికయ్యారు. కానీ అటు జడ్పీ, ఇటు మండల పరిషత్‌లలో ఆశించిన స్థాయిలో నిధులు లేవు. కొన్ని మండలాల్లో బ్యాంక్‌ అకౌంట్లలో నిల్‌ బ్యాలెన్స్‌ చూపిస్తోంది. 2018లో పంచాయతీ పాలకవర్గాలకు, 2019 జూన్‌తో ఎంపీటీసీ, జడ్పీటీసీల పదవీ కాలం ముగిసింది. అయితే ఎన్నికలు సకాలంలో జరగలేదు. పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌లకు ప్రత్యేకాధికారుల పాలన ఏళ్ల తరబడి కొనసాగింది. దీంతో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యమయ్యాయి. 14, 15 ఆర్థిక సంఘాల నిధులు సైతం సరిగ్గా ఖర్చు కాలేదు. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకుగాను ఏటా జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయి. పాలకవర్గాలు లేక 14వ ఆర్థిక సంఘం నిధులు సరిగ్గా ఖర్చుకాలేదు. ఫిబ్రవరిలో సర్పంచ్‌లు ఎన్నికైనా..వారికి తెలియకుండా ప్రభుత్వం విద్యుత్‌ బిల్లుల పేరిట ఆర్థిక సంఘం నిధులను మళ్లించింది.  దీంతో కొన్ని గ్రామాల్లో పారిశుధ్య కార్మికులకు కూడా వేతనాలు చెల్లించలేని స్థితిలో పంచాయతీలు ఉన్నాయి. 

పూర్వ వైభవం ఎప్పుడో?

జిల్లా పరిషత్‌ అంటేనే గతంలో ఎంతో గౌరవం. నిధులు, విధుల్లో జడ్పీ స్వతంత్రంగా వ్యవహరించేది. 32 శాఖలకు సంబంధించి పర్యవేక్షణ జడ్పీదే. విద్యాశాఖ పదోన్నతులు, బదిలీలు కూడా జడ్పీ పరిధిలోనే జరిగేవి. విచక్షణాధికారాలు సైతం ఉండేవి. కానీ రానురాను ప్రభుత్వాలు ఆ అధికారాలకు కత్తెర వేశాయి. కీలక అధికారాలను హస్తగతం చేసుకున్నాయి. గతంలో ఇసుక, గనుల సీనరేజ్‌ అంతా జడ్పీ పరిధిలోనే ఉండేవి. ఇసుక రీచ్‌ల నిర్వహణ కూడా ఉండేది. కానీ ఇసుక ప్రభుత్వానికి ఆదాయ వనరుగా మారడంతో హస్తగతం చేసుకుంది. గతంలో సీనరేజ్‌ రూపంలో వచ్చే ఆదాయాన్ని పంచాయతీలకు 50 శాతం, జిల్లా పరిషత్‌, మండల పరిషత్‌లు చెరో 50 శాతం పంచుకునేవి. సీనరేజ్‌ చార్జీలు గత కొన్నేళ్లుగా చెల్లించడం లేదు. నేరుగా ప్రభుత్వ ఖాతాకే జమ అవుతున్నాయి. కానీ ప్రభుత్వం నుంచి తిరిగి రావడం లేదు

చెల్లింపుల్లో జాప్యం

రిజిస్ర్టేషన్‌ సర్‌చార్జీలు, నీటి తీరువా పన్నుల్లో కొంత మొత్తం స్థానిక సంస్థలకు ఆదాయంగా సమకూరేవి. ఎకరాకు నీటి తీరువా రూ.200 వసూలు చేస్తే అందులో 5 నుంచి 10 శాతం పంచాయతీలకు జమయ్యేది. పంచాయతీ పరిధిలో ఎవరైనా భూములు విక్రయించి రిజిస్ర్టేషన్‌ చేసుకున్నట్టయితే రిజిస్ర్టేషన్‌ శాఖ నుంచి సర్‌ చార్జీల రూపంలో కొంత మొత్తం పంచాయతీలకు వచ్చేది. కానీ కొన్నేళ్లుగా ఈ చెల్లింపులు నిలిచిపోయాయి.  అటు ఆదాయం లేక  ఎమ్మెల్యేలు, ఎంపీల నిధులపై ఆధారపడుతున్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎమ్మెల్యేల నిధులూ అంతంతమాత్రమే. దీంతో నియోజకవర్గాల్లోని అన్ని మండలాలకు నిధులు సర్దుబాటు చేయలేక ఎమ్మెల్యేలు చేతులెత్తేస్తున్నారు. కొన్ని మండలాల్లో అయితే ఎంపీపీలు, జడ్పీటీసీలు కూర్చునేందుకు కనీసం చాంబర్లు లేవు. పాత భవనాల్లో అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణకే కష్టంగా ఉంది. ఈ పరిస్థితుల్లో మరో చాంబర్‌ కష్టమని అధికారులు చెబుతున్నారు. దీంతో ఏదో మూలన ఒక కుర్చీ వారి కోసం కేటాయిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మండల, జిల్లా పరిషత్‌లకు నేరుగా నిధులు కేటాయించాలని ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. 



Updated Date - 2021-10-22T04:46:40+05:30 IST