9 ఏళ్ల క్రితం యాసిడ్ దాడి.. 12 సర్జరీల తర్వాత కోలుకున్న యువతి.. మళ్లీ ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితి..

ABN , First Publish Date - 2021-09-03T16:04:34+05:30 IST

9 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా ఒక యువతిపై యాసిడ్ దాడి జరిగింది. అప్పుడు చావు వరకూ వెళ్లొచ్చిన ఆమె.. ఆ తర్వాత తన కాళ్లపై సొంతగా నిలబడి కుటుంబానికి కూడా సహాయం చేసే స్థాయికి చేరింది.

9 ఏళ్ల క్రితం యాసిడ్ దాడి.. 12 సర్జరీల తర్వాత కోలుకున్న యువతి.. మళ్లీ ఇప్పుడు ప్రాణాపాయ పరిస్థితి..

ఇంటర్నెట్ డెస్క్: 9 ఏళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా ఒక యువతిపై యాసిడ్ దాడి జరిగింది. అప్పుడు చావు వరకూ వెళ్లొచ్చిన ఆమె.. ఆ తర్వాత తన కాళ్లపై సొంతగా నిలబడి కుటుంబానికి కూడా సహాయం చేసే స్థాయికి చేరింది. కానీ ఆమెపై విధి మరోసారి సీతకన్నేసింది. మరోసారి ప్రాణాపాయ స్థితిలోకి నెట్టింది. అయితే ఈసారి కారణం బయట నుంచి రాలేదు. ఆమె శరీరంలోని రెండు కిడ్నీలు చెడిపోవడంతో ప్రస్తుతం ఆమె ప్రాణాల కోసం పోరాడుతోంది. యూపీలోని ఆగ్రాకు చెందిన బాలా ప్రజాపతి అనే యువతి కథే ఇది.


బిజనైర్‌ ప్రాంతంలో నివసిస్తుండగా.. బాల కుటుంబానికి హరకేష్ సింహ్ అనే వ్యక్తితో కుటుంబ కలహాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే ఒక రోజు ఇంట్లోకి బలవంతంగా చొరబడిన హరకేష్.. బాల, ఆమె తాతయ్యపై యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో బాల తాతయ్య మరణించగా.. ఆమె తీవ్రంగా గాయపడింది. 12 సర్జరీల తర్వాత అతికష్టం మీద కోలుకున్న బాల.. సమాజంలో తన ముఖం చూపించడానికి భయపడింది. అయితే అదే సమయంలో మరో యాసిడ్ దాడి బాధితురాలు అన్షుతో స్నేహమైంది. ఆమెతో పరిచయం అయ్యాక బాల కొంత ఆత్మస్థైర్యం పొందింది. నెమ్మదిగా బయటకు వెళ్లడం ప్రారంభించింది. ఆ తర్వాత షిరేజ్ హ్యాంగవుట్ కేఫేలో ఉద్యోగంలో చేరింది. 2017 నుంచి అక్కడే పని చేస్తూ కుటుంబానికి కూడా కొంత ఆర్థిక సాయం చేసింది. ఆగ్రా ప్రాంతంలో ఆమె ఏ సెలెబ్రిటీకి తక్కువ కాదని స్థానికులు అంటున్నారు. ఇలా జీవనం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో.. బాలకు అనారోగ్యం చేసింది.


ఉద్యోగం కూడా చేయలేని స్థితిలో పడిపోయిన ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ పరీక్షలు చేసి బాల రెండు కిడ్నీలూ చెడిపోయాయి వైద్యులు తేల్చారు. దీంతో ఆమె ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ ఆస్పత్రిలో చేరింది. ప్రస్తుతం డయాలసిస్‌ చేయించుకుంటోంది. ఆమె పూర్తిగా కోలుకోవాలంటే కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేయాలని వైద్యులు చెప్పారు. ఈ చికిత్స చేయాలంటే రూ.16 లక్షల వరకూ ఖర్చవుతుంది. కానీ బాల కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. దీంతో ఆమె పని చేస్తున్న కేఫె.. ఆన్‌లైన్‌లో క్రౌడ్ ఫండింగ్ ప్రారంభించింది. విషయం తెలిసిన బాలీవుడ్ నటి దీపికా పదుకోణ్ కూడా బాలకు ఆర్థిక సాయం చేసింది. బాల కోసం రూ.10 లక్షలు విరాళం ఇచ్చింది. ఆమె యాసిడ్ బాధితురాలిగా నటించిన ‘ఛపాక్’ చిత్రంలో బాల కూడా చిన్న పాత్ర పోషించింది. ప్రస్తుతం బాల ఆపరేషన్‌కు రూ.10.78లక్షలు పోగు చేసినట్లు తెలుస్తోంది. మిగతా డబ్బు కోసం వాళ్లు ఎదురుచూస్తున్నారు.

Updated Date - 2021-09-03T16:04:34+05:30 IST