mumbai: సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేశారు...

ABN , First Publish Date - 2021-09-18T18:34:37+05:30 IST

ప్రముఖ సినీనటుడు సోనూసూద్ రూ.20కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్నుశాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది....

mumbai: సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేశారు...

 ఆదాయపు పన్నుశాఖ వెల్లడి 

ముంబై : ప్రముఖ సినీనటుడు సోనూసూద్ రూ.20కోట్లకు పైగా ఆదాయపు పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్నుశాఖ శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది.వరుసగా మూడు రోజుల పాటు శోధించిన ఆదాయపుపన్నుశాఖ ఈ మేరకు తేల్చి చెప్పింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ చట్టాన్ని ఉల్లంఘించి క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ ఫాం ను ఉపయోగించి సోనూసూద్ విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించారని ఆదాయపుపన్ను శాఖ అధికారులు చెప్పారు. సోనూసూద్, అతని సహచరుల నివాసాల్లో శోధించడంతో ఆదాయపు పన్ను ఎగవేతకు సంబంధించిన సాక్ష్యాలు దొరికాయి.


 పన్ను ఎగవేత కోసం ఖాతాలను పుస్తకాల్లో రుణాలుగా మభ్యపెట్టారని అధికారులు చెప్పారు. సోనూసూద్ ఇళ్లు, అతని కార్యాలయాల్లో మూడు రోజుల పాటు జరిపిన దాడుల్లో పన్ను ఎగవేతకు సంబంధించి పలు పత్రాలు దొరికినట్లు ఐటీశాఖ అధికారులు చెప్పారు. ఇటీవల ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ యొక్క ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన  దేశ్ కా మెంటార్స్ అనే సంస్థకు బ్రాండ్ అంబాసిడరుగా పనిచేస్తున్నట్లు సోనూసూద్ ప్రకటించిన నేపథ్యంలో ఆదాయపుపన్ను శాఖ దాడులు జరగడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది.కొవిడ్ మహమ్మారి ప్రబలిన సమయంలో నిరుపేదలకు సహాయపడేందుకు గత ఏడాది జులై నెలలో సూద్ ఛారిటీ ఫౌండేషన్ ను స్థాపించారు. 


సూద్ ఛారిటీ ఫౌండేషన్ ఈ ఏడాది ఏప్రిల్ వరకు రూ.18 కోట్ల విరాళాలను సేకరించగా, అందులో 1.9 కోట్లను సహాయపనులకు ఖర్చు  చేశారని తేలింది. మిగిలిన 17 కోట్లు లాభాపేక్ష లేని ఆ సంస్థ బ్యాంకు ఖాతాలో ఉంచారని వెల్లడైంది. సోనూ సూద్ కంపెనీకి, లక్నో రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య జరిగిన ఒప్పందంపై ఆదాయపుపన్ను శాఖ అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఒప్పందంలో సోనూసూద్ పన్ను ఎగవేశారని ఐటీ శాఖ అనుమానం వ్యక్తం చేసింది.కరోనా సందర్భంగా దేశవ్యాప్తంగా పలు దాతృత్వ కార్యక్రమాలతో సోనూ సూద్ రియల్ హీరోగా నిలిచారు.కాగా రాజకీయ కక్షతోనే సోనూసూద్ పై కేంద్రం ఐటీ శాఖతో దాడులు చేయిస్తుందని ప్రతిపక్షాలు ఆరోపించాయి.


Updated Date - 2021-09-18T18:34:37+05:30 IST