ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్‌!

ABN , First Publish Date - 2021-08-10T05:08:52+05:30 IST

ఇంటర్‌లో ప్రవేశాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల ఇంటి నుంచే అడ్మిషన్‌ పొందే ఏర్పాట్లు చేస్తున్నారు. దీని కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థి పది కళాశాలలను ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు.

ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్‌!
పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులు


ఇంటర్‌ ప్రవేశాలపై కసరత్తు

మొబైల్‌ యాప్‌ ద్వారా ప్రక్రియ

కళాశాల ఎంపిక చేసుకునే వెసులబాటు

తొలిసారి రిజర్వేషన్‌ అమలు

త్వరలో మార్గదర్శకాలు

(శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి)

ఇంటర్‌ ప్రవేశాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. పారదర్శకంగా అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టడానికి నిర్ణయించింది. ఆన్‌లైన్‌లో చేపట్టాలని భావిస్తోంది. ఇటీవలే పదో తరగతి ఫలితాలు వెల్లడయ్యాయి. విద్యార్థులకు గ్రేడ్లను సైతం ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇంటర్‌ ప్రవేశాలు వీలున్నంత త్వరగా పూర్తిచేసి తరగతులు ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇంజనీరింగ్‌ అడ్మిషన్లలో మెరిట్‌, రిజర్వేషన్‌కు ప్రాధాన్యమిచ్చినట్టే ఇంటర్‌ ప్రవేశాలకు అదే పద్ధతిని అనుసరించనున్నారు. ఇక ద్వితీయ సంవత్సరానికి సంబంధించి ఈ నెల 16 నుంచి తరగతులు నిర్వహించనున్నారు. 

- ఇంటర్‌లో ప్రవేశాలకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి అధికారులు కసరత్తు చేస్తున్నారు. విద్యార్థుల ఇంటి నుంచే అడ్మిషన్‌ పొందే ఏర్పాట్లు చేస్తున్నారు.  దీని కోసం ప్రత్యేక యాప్‌ను రూపొందిస్తున్నారు. స్మార్ట్‌ఫోన్‌ ఉన్నవారు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ప్రతి విద్యార్థి పది కళాశాలలను ఆప్షన్‌గా పెట్టుకోవచ్చు. రెండు, మూడు చోట్ల సీట్లు ఆఫర్‌ చేయవచ్చు. మెరిట్‌, రిజర్వేషన్‌ను బట్టి సీట్ల కేటాయింపు ఉంటుంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ ప్రధాన గ్రూపులుగా ఉంటాయి. ఎస్సీ, ఎస్టీలకు 15 శాతం, బీసీలకు 25 శాతం, మైనార్టీలకు 5 శాతం, క్రీడా కోటా కింద 5 శాతం, ఈబీఎస్‌ కోటా కింద 10 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగిలినవి ఇతరులకు లభిస్తాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల కింద ఉన్న జూనియర్‌ కాలేజీలు 206 వరకూ ఉన్నాయి. గత ఏడాది సెక్షన్‌కు 88 మంది విద్యార్థులకు ప్రభుత్వం అనుమతిచ్చింది. కళాశాలల సామర్ధ్యాన్ని బట్టి ఐదు నుంచి ఏడు వరకూ సెక్షన్లు ఉంటాయి. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా వేలాది సీట్లు ఉంటాయి. జిల్లాలో 26 కళాశాలల్లో సంప్రదాయ కోర్సులతో పాటు వృత్తి విద్య కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు సైతం ఆప్షన్లుగా చూపుతారు. చాలా మంది విద్యార్థులు ఇతర జిల్లాల కాలేజీలను ఎంపిక చేసే అవకాశముంది. 


 తల్లిదండ్రులపై ఒత్తిడి

ఇప్పటికే కొన్ని ప్రైవేటు కాలేజీలు అడ్మిషన్ల ప్రక్రియను అనధికారికంగా ప్రారంభించాయి. సిబ్బందిని నియమించుకొని మరీ విద్యార్థులను ఆకర్షించే పనిలో పడ్డాయి. విద్యార్థి పది కాలేజీలను ఎంపిక చేసుకునే అవకాశముందని..అందులో తమ కళాశాలను ఎంపిక చేసుకుంటే ఉత్తమ విద్యాబోధనతో పాటు ఫీజు రాయితీ ఇస్తామని నమ్మబలుకుతున్నాయి. ఇప్పటికే కొన్ని కళాశాలలు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహిస్తున్నాయి. కొన్ని కళాశాలల యాజమాన్యాలు మరో అడుగు ముందుకేసి ఫీజులు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే కరోనాతో ఏడాదిన్నర కాలంగా పిల్లలు చదువులకు దూరమవుతుండడంతో వారి భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకొని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కార్పొరేట్‌ కాలేజీల భ్రమలో పడుతున్నారు. ఇంటర్‌ అడ్మిషన్లకు సంబంధించి ఇన్‌చార్జి ఆర్‌ఐవో ప్రకాశరావు వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా..అంతా పారదర్శకంగా ఉంటుందన్నారు. త్వరలో మార్గదర్శకాలు విడుదలవుతాయని చెప్పారు. ఇంటి నుంచే అడ్మిషన్లు పొందే వీలుగా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ప్రైవేటు కాలేజీల ఫీజుల వసూలుపై దృష్టి పెట్టామన్నారు. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.


16 నుంచి తరగతులు

ఇంటర్‌ తరగతులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ నెల 16 నుంచి తెరిచేందుకు నిర్ణయించారు. ఈ మేరకు ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూలై 12 నుంచి ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌-19 నిబంధనలు పాటిస్తూనే ఆఫ్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నారు.  జిల్లాలో 107 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు, 99 ప్రైవేటు కళాశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ద్వితీయ సంవత్సరానికి సంబంధించి అన్ని గ్రూఫులు కలిపి 10,621 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ తరగతులు ప్రారంభం కానున్నాయి. గత ఏడాది కాలంగా కరోనా కారణంగా కళాశాలలు ఎక్కువగా తెరుచుకోలేదు. తరగతులు కూడా సక్రమంగా జరగలేదు. థర్డ్‌ వేవ్‌ నేపథ్యంలో విద్యాసంస్థలు కొనసాగుతాయా? లేదా? అన్న అనుమానం నేపథ్యంలో ఎక్కువ మంది ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పించేందుకు ఆసక్తి చూపుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలు అమలు చేస్తుండడంతో ఎక్కువ శాతం ప్రభుత్వ కళాశాలల వైపే ముగ్గుచూపుతున్నారు. 


 కోవిడ్‌ నిబంధనలు తప్పనిసరి

ఈనెల 16 నుంచి ఇంటర్మీడియట్‌ ఆఫ్‌లైన్‌ తరగతుల నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ఇప్పటికే యాజమాన్యాలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేశాం. పాటించకపోతే చర్యలు తప్పవు. తరగతి గదుల్లో శుభ్రతకు పెద్దపీట వేయాలి. విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చూడాలి. విద్యార్థులు, అధ్యాపకులు విధిగా మాస్క్‌లు ధరించాలి. 

- కె.ప్రకాశరావు, ఆర్‌ఐఓ, శ్రీకాకుళం 





Updated Date - 2021-08-10T05:08:52+05:30 IST