కాగుతున్న కల్తీనూనె

ABN , First Publish Date - 2021-01-10T05:15:17+05:30 IST

పండుగల వేళ కల్తీ నూనెలు యథేచ్ఛగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా కల్తీ నూనె వ్యాపారం జోరుగా సాగుతోంది. జీఎస్టీ లేకుండానే జీరో దందా నడుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో కల్తీనూనె దందా వెలుగుచూస్తున్నా యథావిధిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి

కాగుతున్న కల్తీనూనె

- పండగల వేళ యథేచ్ఛగా అమ్మకాలు

- ప్రజల ప్రాణాలతో చెలగాటం

- భారీగా పెరిగిన బ్రాండెడ్‌ నూనె ధరలు 

 (ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) 

పండుగల వేళ కల్తీ నూనెలు యథేచ్ఛగా మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా కల్తీ నూనె వ్యాపారం జోరుగా సాగుతోంది.  జీఎస్టీ లేకుండానే జీరో దందా నడుస్తోంది. టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో కల్తీనూనె దందా వెలుగుచూస్తున్నా యథావిధిగా అమ్మకాలు కొనసాగుతున్నాయి.  నూనెల లూజ్‌ విక్రయాలపై నిషేధం ఉన్నా అమ్మకాలు సాగుతూనే ఉన్నాయి. గతంలో పండుగవేళ టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో లక్షల  రూపాయల విలువచేసే కల్తీ నూనె పట్టుబడిన సంఘటనలు ఉన్నాయి. ఆహార తనిఖీ అధికారుల దాడుల్లోనూ బ్రాండెడ్‌ కంపెనీల పేరుతో నకిలీ సరుకులు దొరికాయి. ఈ సారి పండుగల సమయంలో కనీసం తనిఖీలు కూడా లేకపోవడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కోట్ల రూపాయల్లో కల్తీ వ్యాపారం సాగుతున్నా నియంత్రించేవారు లేకపోవడంతో పండుగ సమయాల్లో కల్తీ నూనె, కల్తీ నెయ్యి, ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. డాల్డలో కృత్రిమ రంగులు కలిపి నెయ్యిగా మారిస్తే, పసుపు పచ్చ పత్తినూనెతో పల్లినూనె  కల్తీ చేస్తున్నారు. తెల్లపత్తి నూనెను పొద్దుతిరుగుడు అయిల్‌లో కలుపుతారనే ఆరోపణలు ఉన్నాయి. కల్తీనూనెకు తోడు నాసిరకం పప్పులు, మసాలా దినుసుల పొడులను ప్రజలకు అంటగడుతున్నట్లు తెలుస్తోంది. 


భారీగా పెరిగిన నూనె ధరలు 

బ్రాండెడ్‌ కంపెనీల నూనె ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి.  గడిచిన నాలుగు నెలల్లో  లీటరు పల్లి నూనె రూ.35 వరకు పెరిగింది. ప్రస్తుతం పల్లి నూనె రూ.145 ధర పలుకుతోంది. సన్‌ఫ్లవర్‌ రూ.135 వరకు అమ్ముతున్నారు. దీంతో బ్రాండెడ్‌ కంపెనీల నూనెలు కొనలేని సామాన్యులు  దుకాణాల్లో విడిగా అమ్ముతున్న నూనెలను కొనుగోలు చేస్తున్నారు. దీన్ని ఆసరా చేసుకొని వ్యాపారులు కల్తీనూనెను విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. 


కల్తీ నూనె, నెయ్యి అమ్మకాలు ఇలా... 

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంతోపాటు వివిధ మండలాల్లో కల్తీ సరుకుల అమ్మకాలకు అనేక పద్ధతులు ఉపయోగిస్తున్నారు. నూనెల్లో ఆముదం, ఖనిజ తైలం, జంతువుల కొవ్వును కరిగించి కల్తీ చేయడం, సోయాబీన్‌, పత్తిగింజలు, పామోలిన్‌ వంటి నూనెలను కల్తీ చేస్తున్నారు. నెయ్యిలో కృతిమ రంగులు కలుపుతున్నారు.    ఆహారపు పరిరక్షణ ప్రమాణపు చట్టం ప్రకారం 2006, నిబంధనల నియామవళి చట్టం 2011 వరకు పరిరక్షణ లేని ఆహార పదార్థాలను తయారు చేసినా, అమ్మినా, నిల్వ ఉంచినా, సరఫరా చేసినా, దిగుమతి చేసుకున్నా, లైసెన్స్‌ లేకపోయినా చట్టరీత్యా నేరం. ఏడాది వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. కానీ విచ్చల విడిగా ఆహార పదార్థాలు తయారు చేస్తున్నా నియంత్రించిన దాఖలాలు లేవు. 

Updated Date - 2021-01-10T05:15:17+05:30 IST