స్వేచ్ఛాయుత అఫ్ఘాన్ కోసం.. పోరాటమే మార్గం
ABN , First Publish Date - 2021-08-19T06:36:09+05:30 IST
మాది అఫ్ఘనిస్థాన్‌లోని పాంజ్‌షెయిర్. ఉన్నత చదువు కోసం 2017లో హైదరాబాద్ వచ్చాను. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం ఇక్కడే ఒక
- అఫ్ఘానీ యువకుడు మహ్మద్ అక్బర్ ఇబ్రహీమి
అఫ్ఘానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై మాట్లాడేందుకు హైదరాబాద్‌లోని చాలామంది అఫ్ఘానీలు అస్సలు ఇష్టపడలేదు. కొందరు స్పందించినా, తమ పేర్లు వెల్లడించడానికి ససేమిరా అన్నారు.! అలాంటిది తన దేశం వెళ్లి తాలిబాన్‌పై పోరు సలుపుతానని ధైర్యంగా చెబుతున్నాడు 24ఏళ్ల మహ్మద్ అక్బర్ ఇబ్రహీమి. ఉన్నత విద్య కోసం నాలుగేళ్ల కిందట నగరానికి వచ్చిన అతడు తాలిబాన్ రహిత అఫ్ఘాన్ కోసం ఉద్యమించేందుకు సన్నద్ధమవుతున్నట్టు తెలిపాడు. తాలిబాన్ మాటలు అస్సలు నమ్మకూడదని చెబుతున్న మహ్మద్ అక్బర్ ఇబ్రహీమి ఇంకా పలు అంశాలను ‘ఆంధ్రజ్యోతి’తో పంచుకున్నారు.
- హైదరాబాద్ సిటీ, ఆగస్టు18 (ఆంధ్రజ్యోతి)
అఫ్ఘాన్‌లోని మీ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంది ?
మాది అఫ్ఘనిస్థాన్‌లోని పాంజ్‌షెయిర్. ఉన్నత చదువు కోసం 2017లో హైదరాబాద్ వచ్చాను. నిజాం కాలేజీలో డిగ్రీ పూర్తిచేశాను. ప్రస్తుతం ఇక్కడే ఒక హోటల్‌లో మేనేజర్‌గా పని చేస్తున్నాను. రెండు, మూడు రోజులుగా అఫ్ఘాన్‌లో నెలకొన్న పరిస్థితుల గురించి వింటుంటే గుండె తరుక్కుపోతోంది. మా అమ్మ, నాన్నలతో పాటు నా ముగ్గురు తమ్ముళ్లతో రోజూ ఫోన్లో మాట్లాడుతున్నాను. ఇప్పటివరకైతే వారంతా క్షేమంగా ఉన్నామంటున్నారు. పాంజ్‌షెయిర్ వాసులంతా కలిసి తాలిబాన్ రాజ్యాన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. ఆ పోరాటానికి జమైతే-ఇ-ఇస్లామీ పార్టీ నాయకులతో పాటు అఫ్ఘాన్ పోరాట వీరుడు అహ్మద్ షా మసూద్ కుమారుడైన అహ్మద్ మస్సూద్ వంటి సాహసోపేతమైన యువత వెన్నుదన్నుగా నిలిచారు. కనుకే ఇప్పటి వరకు పాంజ్‌షెయిర్‌లో తాలిబాన్ అడుగు పెట్టలేకపోయారు.
శాంతియుత పాలనను అందిస్తామని ప్రకటించారు కదా?
సామరస్య పాలనను అందిస్తామని చెబుతున్న తాలిబాన్ మాటలు నమ్మడమంటే రక్తం రుచిమరిగిన పులినోటికి చిక్కడమే.! ఆడవాళ్లకు సమాన హక్కులిస్తామనీ ప్రకటిస్తారు. మరోవైపు వాళ్లు చేయాల్సిన దమనకాండను కొనసాగిస్తుంటారు. ఆడవాళ్లు చనిపోయాక మాత్రమే వాళ్ల భౌతికకాయం ఇంటి గుమ్మందాటాలి. ఇస్లాం నియమనిబంధనల పేరుతో బాలికలు, మహిళలపై తీవ్ర అణచివేత, నిర్బంధం అమలు చేస్తారు. వాళ్లకు నచ్చనివాళ్లను షరియా చట్టాల పేరుతో చంపేస్తారు. నేను ఇస్లాం మత బోధనలను గౌరవిస్తాను. రోజుకి ఐదుసార్లు నమాజ్ చేస్తాను. తోటి ప్రాణికి హానితలపెట్టొదని ఇస్లాం బోధిస్తుంది. తాలిబాన్ అందుకు పూర్తి విరుద్ధం. తాలిబాన్ పాలనను 80శాతం మంది అఫ్ఘానీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సమాఖ్య ప్రభుత్వం ఏర్పడాలని వారంతా ఆకాంక్షిస్తున్నారు.
అఫ్ఘానీ పౌరుడిగా మీరెలాంటి పాలనను ఆశిస్తున్నారు.?
ప్రజాస్వామ్యయుత అఫ్ఘాన్‌ను కోరుకుంటున్నాం. అందుకు ఇతర దేశాల సహకారాన్ని కోరుతున్నాం. అసలు తాలిబాన్‌లో 90శాతం మంది పాకిస్థానీలే ఉంటారు. మా పొరుగునున్న పాకిస్థాన్ మాకు నిత్యం అశాంతిని రగిలిస్తుంటే, భారత్ మాత్రం ప్రత్యక్షంగానో, పరోక్షంనో అఫ్ఘాన్ అభివృద్ధికి తోడ్పడింది. కనుక మాకు భారతదేశమంటే అమితమైన గౌరవం, అభిమానం. అమెరికా సైతం అఫ్ఘాన్ పట్ల నిజాయితీగా వ్యవహరించడంలేదు. కొన్ని అభివృద్ధి నిరోధక అతివాద గ్రూపులను అమెరికా సైతం ప్రోత్సహించింది. అందుకే అమెరికా వైఖరిని స్పృహ కలిగిన అఫ్ఘానీలెవ్వరూ విశ్వసించరు.
ఆడవాళ్లకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలుంటాయని తాలిబాన్ ప్రతినిధి వెల్లడించారు కదా.!
మహిళల జీవించే హక్కునే తాలిబాన్లు కాలరాస్తారు. వాళ్లు ముందు అలాగే చెబుతారు. కానీ అవేవీ పాటించరు. తాలిబాన్ అడుగుపెట్టడంతోనే అప్పటికప్పుడు అఫ్ఘాన్ రాజకీయ మహిళా ప్రతినిధులు చాలామంది ఢిల్లీకి వచ్చి తలదాచుకున్నారు. గతంలో తాలిబాన్లు చేసిన విధ్వంసాన్ని స్థానిక మహిళలెవ్వరూ ఇంకా మర్చిపోలేదు. అంతెందుకు, నిన్నటి వరకు కొనసాగిన అఫ్ఘాన్ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో ఆడవాళ్లకు 50శాతం రిజర్వేషన్ అమల్లో ఉంది. ఇప్పుడు దాన్ని కొనసాగిస్తారా.? అంటే సమాధానం ఎవ్వరి వద్దా ఉండదు. అందుకే తాలిబాన్లను నమ్మడానికి వీల్లేదు. అఫ్ఘాన్‌లోని రాజకీయ పార్టీలు, విద్యావంతులు, యువత అంతా కలిసి తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడటమే అఫ్ఘానీల ముందున్న ఏకైక మార్గం. అంతకు మించి మరోదారిలేదు. అన్నీరాజకీయ పార్టీలు కలిసి సమస్య పరిష్కారం కోసం చర్చించాలి.
మీరేం చేయాలనుకుంటున్నారు.? మీ లక్ష్యం ఏమిటి ?
నా వీసా గడుపు ఈ ఏడాది చివరి వరకూ ఉంది. అయితే, అంత వరకు నేనిక్కడే ఉండాలనుకోవడం లేదు. ఒకవైపు నా దేశం అల్లకల్లోలమవుతుంటే, నేను ఇక్కడ ప్రశాంతంగా ఎలా ఉండగలను. విమానయానం అందుబాటులోకి వచ్చిన మరుక్షణం నా దేశానికి వెళతాను. తాలిబాన్‌కు వ్యతిరేకంగా పోరాడుతాను. సమాఖ్య స్ఫూర్తితో నడిచే ప్రభుత్వ సాధన కోసం జమైతే-ఇ-ఇస్లామి పార్టీతో కలిసి నా వంతు ఉద్యమిస్తాను. హైదరాబాద్‌లో అఫ్ఘానిస్థాన్ శరణార్థుల సంఘం, అఫ్ఘానీ విద్యార్థి సంఘం ఉన్నాయి. ఇంటి వద్ద నెలకొన్న పరిస్థితులను తలుచుకొని చాలామంది బాధ పడుతున్నారు. దుఃఖమో, బాధో ఈ సమస్యకు పరిష్కారం కాదని వారందరికీ చెప్పదలుచుకున్నాను.