Advertisement
Advertisement
Abn logo
Advertisement
Oct 10 2021 @ 13:33PM

Iran వైపు పరుగులు తీస్తున్న Afghan పౌరులు

కాబూల్ : ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్నప్పటి నుంచి ఆ దేశం నుంచి ఇరాన్ వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తున్నవారి సంఖ్య పెరుగుతోంది. రోజుకు దాదాపు 4 వేల మంది ఆఫ్ఘన్ నుంచి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తున్నారు. దేశంలో ఆర్థిక, మానవతావాద సంక్షోభం నెలకొనడమే దీనికి కారణం. దేశంలోని మూడో వంతు జనాభా కరువుకాటకాలకు గురయ్యే అవకాశం ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించిన సంగతి తెలిసిందే. 


ఆఫ్ఘనిస్థాన్‌ను తాలిబన్లు ఆగస్టు 15న స్వాధీనం చేసుకున్నారు. అంతకుముందు ఆ దేశం నుంచి ఇరాన్‌కు నెలకు దాదాపు 1,000 నుంచి 2,000 మంది వరకు వెళ్ళేవారు. నిమ్రోజ్‌లోని జరంజ్ బోర్డర్ స్టేషన్ నుంచి వీరు ఇరాన్ వెళ్ళేవారు. నిమ్రోజ్ ప్రావిన్స్ బోర్డర్ కమాండర్ మహమ్మద్ హషీమ్ హంజలేహ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, సరిహద్దులను దాటేందుకు ప్రయత్నించేవారి సంఖ్య రోజుకు 3,000 నుంచి 4,000 మందికి పెరిగిందని తెలిపారు. సరిహద్దులను దాటేందుకు అవసరమైన పత్రాలు చాలా తక్కువ మంది వద్ద మాత్రమే ఉంటున్నాయన్నారు. వ్యాపారులు, రెసిడెన్స్ వీసాలుగలవారు, వైద్య సేవల కోసం వెళ్ళేవారు ఇరాన్‌లోకి వెళ్ళగలుగుతున్నారన్నారు. రోజుకు సుమారు 600 మందిని ఇరాన్ దళాలు అనుమతిస్తున్నాయని తెలిపారు. 


ఇదిలావుండగా, ఆఫ్ఘనిస్థాన్ నుంచి ఇరాన్‌లో ప్రవేశించాలనుకునేవారి పట్ల ఇరాన్ సైనికుల తీరు దారుణంగా కనిపిస్తోంది. ఆఫ్ఘన్ల నుంచి డబ్బులు లాక్కుని, గాయపరుస్తున్నట్లు బాధితులు మీడియాకు చెప్తున్నారు. ఇటీవల ఇరాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ ఆఫ్ఘన్ వ్యక్తి ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది.


Advertisement
Advertisement