న్యాయం జరుగుతుందన్న ఆశ పోయింది.. మంత్రి కుమారుడికి బెయిలుపై రైతు ఆవేదన

ABN , First Publish Date - 2022-02-11T03:09:05+05:30 IST

ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటన కేసులో కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్

న్యాయం జరుగుతుందన్న ఆశ పోయింది.. మంత్రి కుమారుడికి బెయిలుపై రైతు ఆవేదన

లక్నో: ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో జరిగిన హింసాత్మక సంఘటన కేసులో కీలక నిందితుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు గురువారం బెయిలు మంజూరు చేయడంపై బాధిత రైతుల కుటుంబ సభ్యులు స్పందించారు. గత సంవత్సరం అక్టోబరు 3న జరిగిన ఈ సంఘటనలో నలుగురు రైతులు సహా ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు.


ఈ కేసులో ఆశిష్‌ను గత సంవత్సరం అక్టోబరు 9న అరెస్టు చేశారు. తాజాగా, అలహాబాద్ హైకోర్టు ఆశిష్‌కు బెయిలు మంజూరు చేయడంపై బాధిత రైతు కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేశాయి. న్యాయం జరుగుతుందన్న ఆశ ఈ దెబ్బతో పోయిందని పేర్కొన్నాయి. 


బెయిలు పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం  కేసులోని వ్యత్యాసాలను ఎత్తిచూపుతూ బెయిల్ మంజూరు చేసింది. అయితే, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగుతున్న వేళ ఆశిష్‌కు బెయిలు మంజూరు కావడం వివాదాస్పదమైంది. రైతులపై నుంచి మంత్రి కుమారుడి కారు దూసుకెళ్లిన ఘటనలో ప్రాణాలు కోల్పోయిన 19 ఏళ్ల గుర్విందర్ సింగ్ తండ్రి సుఖ్విందర్ సింగ్ మాట్లాడుతూ.. ఆశిష్‌కు బెయిలు లభించడం మంచి పరిణామం కాదని అన్నారు.


ఈ ప్రభుత్వంపై తమకు ఇది వరకే నమ్మకం లేదని, ఇప్పుడు ఉన్న ఆశ కూడా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి ఇంకా పదవిలోనే ఉన్నారని పేర్కొన్నారు. ప్రధానమంత్రి అక్కడ కూర్చుని బోల్డన్ని హామీలు ఇస్తారని కానీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న సొంత మంత్రిని మాత్రం తప్పించలేకపోయారని అన్నారు.


బెయిలు వచ్చినంత మాత్రాన ఆశిష్ మిశ్రా నిర్దోషి కాదని ఇదే ఘటనలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టు రమణ్ కాశ్యప్ సోదరుడు అమన్ కాశ్యప్ అన్నారు. న్యాయం కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండడం వల్లే ఇలా జరుగుతోందని ఆయన విమర్శించారు.  

Updated Date - 2022-02-11T03:09:05+05:30 IST