పోరువాడ

ABN , First Publish Date - 2020-12-04T06:46:25+05:30 IST

నంద్యాలో అబ్దుల్‌ సలామ్‌ కేసులో న్యాయం చేయాలని టీడీపీ, ముస్లిం సంఘాల పిలుపు ఒక వైపు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాలు, వామపక్షాల ఆందోళన ఇంకో వైపు. వెరసి విజయవాడ నగరం అంతటా గురువారం ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

పోరువాడ
రైతు సంఘాల కార్యకర్తలను అరెస్టు చేస్తున్న పోలీసులు

అన్ని దిక్కులా ఆందోళనలే

వేడెక్కిన విజయవాడ

సలాం కుటుంబం కోసం న్యాయపోరాటం

టీడీపీ చలో అసెంబ్లీ...

రైతుల ఉద్యమానికి వామపక్షాల బాసట

జాతీయ రహదారుల దిగ్బంధం

ఎక్కడికక్కడ అరెస్టులు


విజయవాడ, డిసెంబరు 3 (ఆంధ్రజ్యోతి) : నంద్యాలో అబ్దుల్‌ సలామ్‌ కేసులో న్యాయం చేయాలని టీడీపీ, ముస్లిం సంఘాల పిలుపు ఒక వైపు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా రైతు సంఘాలు, వామపక్షాల ఆందోళన ఇంకో వైపు. వెరసి విజయవాడ నగరం అంతటా గురువారం ఉద్రిక్త వాతావరణం కనిపించింది. జాతీయ రహదారితోపాటు నగరంలోని ప్రధాన రహదారులనూ పోలీసులు అధీనంలోకి తీసుకున్నారు. ఎంపీ కేశినేని నాని కార్యాలయం నుంచి చలో అసెంబ్లీకి వెళ్లాలని టీడీపీ శ్రేణులు, ముస్లిం సంఘాలు పిలుపునిచ్చాయి. దీంతో టీడీపీ, ముస్లిం సంఘాల నాయకులను పోలీసులు గృహనిర్బంధం చేశారు. కేశినేని కార్యాలయ ప్రాంతాన్ని మూసివేశారు. ఇక్కడికి వచ్చిన నాయకులను, కార్యకర్తలను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ముస్లిం సంఘాల నేతలు షారూక్‌ షుబ్లి, ఇతరులను గృహ నిర్బంధం చేశారు. కేశినేని కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇక్కడ దక్షిణ మండలం సహాయ కమిషనర్‌ ఎం.వెంకటేశ్వరరావు, టాస్క్‌ఫోర్స్‌ సహాయ కమిషనర్‌ జీవీ రమణమూర్తి బందోబస్తును పర్యవేక్షించారు. 


వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా..

మరోపక్క కేంద్రం ఆమోదించిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా వామపక్ష నేతలు, రైతు సంఘాల నాయకులు రోడ్డెక్కారు. జిల్లావ్యాప్తంగా అన్ని జాతీయ రహదారులనూ దిగ్బంధం చేశారు. విజయవాడ బెంజ్‌సర్కిల్‌లో నిరసన తెలిపి, జాతీయ రహదారిపై రెండు వైపులా వెళ్తున్న వాహనాలను అడ్డుకున్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, రైతు సంఘం నేత వి.శ్రీనివాసరావు తదితరులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ రాస్తారోకో కారణంగా జాతీయ రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఈ ప్రభావం అటు ఎంజీ రోడ్డు, ఇటు కారల్‌మార్క్స్‌ రోడ్లపై కూడా పడింది. 



Updated Date - 2020-12-04T06:46:25+05:30 IST