సాగు భళా!

ABN , First Publish Date - 2021-04-18T06:34:40+05:30 IST

సంగారెడ్డి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా యాసంగిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం యాసంగి సాగుతో పోల్చితే ప్రస్తుత యాసంగి సాగు రెట్టింపు స్థాయిలో జరిగింది. జిల్లాలోని ప్రధాన పంట వరి అయితే గతేడాది కన్నా మూడింతలు ఎక్కువగా సాగవడం గమనార్హం. 2019-20 యాసంగిలో అన్ని పంటలు కలిపి ఇల్లాలో 66,744 ఎకరాలలో సాగయింది.

సాగు భళా!

సంగారెడ్డి జిల్లాలో యాసంగి సాగు విస్తీర్ణం రెట్టింపు 

మూడింతలు పెరిగిన వరి 


ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, ఏప్రిల్‌ 17 :  సంగారెడ్డి జిల్లాలో మునుపెన్నడూ లేని విధంగా యాసంగిలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గత సంవత్సరం యాసంగి సాగుతో పోల్చితే ప్రస్తుత యాసంగి సాగు రెట్టింపు స్థాయిలో జరిగింది. జిల్లాలోని ప్రధాన పంట వరి అయితే గతేడాది కన్నా మూడింతలు ఎక్కువగా సాగవడం గమనార్హం. 2019-20 యాసంగిలో అన్ని పంటలు కలిపి ఇల్లాలో 66,744 ఎకరాలలో సాగయింది. వీటిలో వరి 23,.557 ఎకరాల్లో సాగు చేయగా, జొన్న 13,846 ఎకరాల్లో, శనిగలు 23,410 ఎకరాలలో సాగయ్యాయి. అదే 2020-21 సంవత్సరంలో అంటే గతేడాది నవంబర్‌, డిసెంబర్‌ నెలలో సాగు చేసే యాసంగి సీజన్‌లో రెట్టింపు స్థాయిలో 1,38,845 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. వీటిలో ప్రధానమైన వరి పంట అయితే గత యాసంగి సీజన్‌కన్నా మూడింతల స్థాయిలో 80,865 ఎకరాల్లో సాగయింది. మిగిలిన పంటల విస్తీర్ణం కూడా గత సీన్‌కన్నా పెరిగింది. జొన్న 17,691 ఎకరాల్లో, శనిగలు 29,960 ఎకరాల్లో సాగు చేశారు. పంటల సాగు పెరగడతో ఈ సారి దిగుబడి కూడా పెరుగుతందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు.  ప్రధానంగా వరి విషయానికి వస్తే గత యాసంగి సీజన్‌లో 89 వేల మెట్రిక్‌ టన్నుల దిగుబడి రాగా, ఈ సారి (ఈ నెల రోజుల్లో ) 1,60,500 మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ మేరకు ధాన్యం కొనుగోళ్ల కోసం పౌరసరఫరాల శాక అవసరమైన ఏర్పాట్లను చేస్తుంది. 


గత సీజన్లలో పంటల విస్తీర్ణం

వానాకాలంలో వుండే ఖరీఫ్‌ సీజన్‌లోనూ 2019 ఖరీఫ్‌ సీజన్‌కన్నా 2020 సీజన్‌లో సాగు విస్తీర్ణం పెరిగింది. 2019 ఖరీఫ్‌ సీజన్‌లో 6,33,989 ఎకరాల్లో వివిధ పంటలు సాగు కాగా, 2020 ఖరీఫ్‌ సీజన్‌లో 7,42,032 ఎకరాల్లో సాగయింది. ఈ సీజన్‌లోనూ ప్రధాన పంట వరి సాగు బాగా పెరిగింది. 2019 సీజన్‌లో 54,389 ఎకరాల్లో సాగైన వరి పంటను రైతులు 2020 సీజన్‌లో 78,522 ఎకరాల్లో సాగు చేశారు. దాంతో వరి సాగు గతంకన్నా 24,132 ఎకరాలు పెరిగినట్టయింది.  అలాగే వాణిజ్య పంట పత్తిని రైతులు 2019 ఖరీఫ్‌లో 3,45,822 ఎకరాల్లో సాగు చేయగా, 2020లో 3,99,895 ఎకరాల్లో సాగైంది. అంటే పత్తి పంట విస్తీర్ణం 54,072 ఎకరాలు పెరిగింది. అలాగే మరో ప్రధాన పంట కందులు 2019 సీజన్‌లో 49,017 ఎకరాలు సాగు చేయగా, 2020 సీజన్‌లో రెట్టింపుకన్నా ఎక్కువగా 1,08,433 ఎకరాల్లో సాగు చేశారు. వరి సాగు విస్తీర్ణం పెరిగిన కారణంగా 2019లో 73,890 మెట్రిక్‌టన్నుల దిగుబడి రాగా 2020లో 96,450 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది.


విస్తార వర్షాలతోనే

2019 సంవత్సరంకన్నా 2020 సంవత్సరంలో వర్షాలు విస్తారంగా కురియడంతో పంటల విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. ఖరీఫ్‌ సీజన్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 692 మి.మీ.లు నమోదు కావల్సి ఉన్నది. అయితే 2019లో 150 మి.మీ.లు తగ్గి 543.4 మి.మీ.ల వర్షమే కురిసింది. అదే 2020 వానాకాలంలో 898.6 మి.మీ.ల వర్షం వచ్చింది. అంటే ఈ సీజన్‌లో జిల్లా వ్యాప్తంగా 200 మి.మీ.ల వర్షం అధికంగా కురిసింది. ఫలితంగా సింగూరు, నల్లవాగులతో పాటు అన్ని ప్రాజక్టులలోకి సమృద్దిగా నీల్లు వచ్చాయి. చెరువులు, కుంటలు నిండాయి. భూగర్భ జలాలు సైతం పెరిగి, బోరు బావులలోకి నీళ్లు వచ్చాయి. ఇదే 2020 యాసంగి సీజన్‌లోనూ కనిపించింది. యాసంగి సీజన్‌లో భాగంగా అక్టోబరు నుంచి జనవరి వరకు జిల్లా సాధారణ వర్షపాతం 139.9 మి.మీ.లు ఉండగా, 2019-20 సీజన్‌లో 124.6 మి.మీ.ల వర్షమే కురిసింది. అంటే సీజన్‌ మొత్తం మీద 15 మి.మీ.ల వర్షం తగ్గింది. 2020-21 సీజన్‌లోనైతే దాదాపు 120 మి.మీ.ల వర్షం ఎక్కువగా కురిసి, జిల్లా వర్షపాతం 257.2 మి.మీ.లులగా నమోదైంది. వానాకాలం సీజన్‌కు తోడుగా యాసంగి సీజన్‌లోనూ 2020-21లో వర్షాలు బాగా రావడంతో రైతులు పంటల సాగును పెంచుకున్నారు. సాగు నీటి కొరత లేని కారణంగా 2020-21 సంవత్సరంలో రైతులు హుషారుగానే పంటలను సాగు చేశారు.

Updated Date - 2021-04-18T06:34:40+05:30 IST