తమిళనాట 2021లో ఎన్నికలు.. అమ్మ పార్టీలో అప్పుడే ప్రకంపనలు..!

ABN , First Publish Date - 2020-09-29T01:06:56+05:30 IST

తమిళనాడులో రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో...

తమిళనాట 2021లో ఎన్నికలు.. అమ్మ పార్టీలో అప్పుడే ప్రకంపనలు..!

చెన్నై: తమిళనాడులో రాజకీయ సమీకరణాలు జోరందుకున్నాయి. వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉండటంతో అన్నాడీఎంకే నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే అంశం తాజాగా తెరపైకొచ్చింది. ఇదే అంశంపై ఓ నిర్ణయానికొచ్చేందుకు సోమవారం అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నాడీఎంకేలో నెలకొన్న వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. రాబోయే ఎన్నికల్లో అన్నాడీఎంకే నుంచి సీఎం అభ్యర్థి ఎవరనే విషయంలో పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య వాగ్వాదం నడిచింది.


మరోసారి తనకే సీఎం అభ్యర్థిగా అవకాశమివ్వాలని సీఎం పళనిస్వామి పార్టీ సమావేశంలో కోరగా, ఈసారి సీఎం అభ్యర్థిగా తాను బరిలో నిలుస్తానని.. తనకే అవకాశం ఇవ్వాలని పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు. ఈ పరిణామంతో ఇరు వర్గాల నేతలు పోటాపోటీగా నినాదాలు చేశారు. మొత్తం మీద.. దాదాపు 5 గంటల పాటు సాగిన ఈ సమావేశంలో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థిని అక్టోబర్ 7న ప్రకటించాలని పార్టీ నేతలు తీర్మానించారు. అయితే.. అక్టోబర్ 7న పార్టీ సీఎం అభ్యర్థిని పళనిస్వామి, పన్నీర్ సెల్వం కలిసి ప్రకటిస్తారని అన్నాడీఎంకే డిప్యూటీ కో-ఆర్డినేటర్ కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు.


అన్నాడీఎంకేలో నెలకొన్న ఈ పరిణామాలను.. ప్రతిపక్ష డీఎంకే ఆసక్తిగా పరిశీలిస్తోంది. ప్రతిపక్ష డీఎంకేలో సీఎం అభ్యర్థిపై ఎలాంటి తర్జనభర్జన లేదు. 2021లో జరగనున్న తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే నుంచి సీఎం అభ్యర్థిగా స్టాలిన్ నిలవనున్నారు. డీఎంకేకు పార్టీపరంగా ఎలాంటి తలనొప్పులు లేకపోవడం అన్నాడీఎంకేతో పోల్చుకుంటే ఆ పార్టీకి కలిసొచ్చే అంశం. పొత్తులపరంగా కూడా డీఎంకే స్పష్టమైన వైఖరితో ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న కాంగ్రెస్‌తో కలిసే దాదాపు వచ్చే ఎన్నికల్లో డీఎంకే బరిలో నిలవనుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో.. సీఎం అభ్యర్థి ఎంపికపై పన్నీరు సెల్వం, పళని స్వామి మధ్య సయోధ్య కుదరని పక్షంలో అన్నాడీఎంకేలో చీలిక వచ్చే అవకాశమూ లేకపోలేదు. 


ఇక.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ప్రస్తుతం తమిళనాడులో బీజేపీ రెండు ఆప్షన్లను పరిశీలిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకుల అంచనా. అన్నాడీఎంకేతో కలిసి నడవాలని తమిళనాడు బీజేపీలోని కొందరు భావిస్తుంటే.. మరికొందరు మాత్రం మాస్‌లో ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్‌తో కలిసి నడవాలని కేంద్ర పెద్దలకు సంకేతాలు పంపినట్లు తెలిసింది.


తమిళనాడులో బీజేపీ ఎవరితో కలిసి ముందుకెళ్లనుందన్న అంశం కూడా ఎన్నికల సమీపించే సమయంలో చర్చనీయాంశంగా మారే అవకాశముంది. ఇక.. తమిళనాడులో మరో నటుడు కమల్‌హాసన్ ఇప్పటికే పార్టీని స్థాపించి.. సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించారు. మొత్తంగా చూస్తే.. తమిళనాడులో 2021లో జరగబోయే ఎన్నికలు గతంతో పోల్చితే ఆసక్తికర పొత్తులకు, ఊహించని రాజకీయ ఎత్తుగడలకు సాక్ష్యంగా నిలవనున్నాయనడంలో సందేహం లేదనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.

Updated Date - 2020-09-29T01:06:56+05:30 IST