ముస్లింలు సూర్య నమస్కారాలు చేయొద్దు : ఏఐఎంపీఎల్‌బీ

ABN , First Publish Date - 2022-01-04T19:36:38+05:30 IST

దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని

ముస్లింలు సూర్య నమస్కారాలు చేయొద్దు : ఏఐఎంపీఎల్‌బీ

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా పాఠశాలల్లో సూర్య నమస్కారాల కార్యక్రమాన్ని నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై ముస్లింలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ తమ మతాచారాలకు అనుగుణంగా ప్రార్థన చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని చెప్తున్నారు. సూర్య నమస్కారాల కార్యక్రమాలకు ముస్లిం విద్యార్థులు దూరంగా ఉండాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ఆదేశించింది. 


జనవరి 1 నుంచి 7 వరకు దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లోనూ సూర్య నమస్కారాల కార్యక్రమాలను నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఆదేశాలను ఏఐఎంపీఎల్‌బీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ బోర్డు ప్రధాన కార్యదర్శి మౌలానా ఖలీద్ సైఫుల్లా రహమానీ విడుదల చేసిన ప్రకటనలో, భారత దేశం లౌకికవాద దేశమని, ఇక్కడ మెజారిటీ మతస్థుల ఆచారాలు, సంప్రదాయాలను ఇతర మతాలపై రుద్దకూడదని చెప్పారు. ముస్లిం విద్యార్థులు ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించారు. 


కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు జారీ చేసిన ఈ ఆదేశాలు రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించారు. ప్రతి ఒక్కరికీ తమ మతాచారాలకు అనుగుణంగా ప్రార్థన చేసుకునే స్వేచ్ఛను రాజ్యాంగం కల్పించిందని తెలిపారు. ఒక మతంలో ఆచరించే ప్రార్థన పద్ధతులను అన్ని మతాలకు వర్తింపజేయరాదని చెప్పారు. రాజ్యాంగ లౌకికవాద విలువలను గౌరవిస్తూ, ఈ ఆదేశాలను ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేశం పట్ల నిజంగా ప్రేమ చూపించాలని ప్రభుత్వం  అనుకుంటే, నిజమైన సమస్యలపై దృష్టి సారించాలన్నారు. 



Updated Date - 2022-01-04T19:36:38+05:30 IST