‘మందు’చూపు

ABN , First Publish Date - 2020-04-01T15:52:43+05:30 IST

ఓ వైపున కరోనా విజృంభిస్తున్నా..

‘మందు’చూపు

గుంటూరు నగరంలో యథేచ్ఛగా మద్యం అక్రమ అమ్మకాలు

గుట్టుగా బ్లాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్న కొందరు వ్యాపారులు

ఫిర్యాదులు చేసినా పట్టించుకోని వైనం 


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ఓ వైపున కరోనా విజృంభిస్తున్నా.. లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా గుంటూరు నగరంలో మద్యం విక్రయాలు గుట్టుగా జరుగుతున్నాయి. గుంటూరులోని పలు బార్ల యజమానులు సిండికేట్‌గా మారి బ్లాక్‌ మార్కెట్‌ ద్వారా మద్యం అమ్మకాలకు జరుపుతున్నారు. నగరంలోని ఏటుకూరు రోడ్డు, బుడంపాడు రోడ్డు, వసంతరాయపురం రోడ్డు, అమరావతి రోడ్డు, కాకాని రోడ్డులోని పలు బార్లను తెల్లవారుజామున తెరిచి బయటకు తరలిస్తున్నారు. కేసుల మద్యాన్ని బయటకు తరలించి రహస్యంగా కొంతమంది దళారులను పెట్టుకుని అమ్మకాలు సాగిస్తున్నారు. 


క్వార్టర్‌ బాటిల్‌ (180 ఎంఎల్‌), రూ.700 నుంచి వెయ్యి వరకు అమ్ముతుండగా, ఫుల్‌బాటిల్‌ (750 ఎంఎల్‌) మద్యాన్ని రూ.3వేల నుంచి 4 వేల వరకు అమ్ముకుంటున్నారు. జనతా కర్ఫ్యూ ప్రారంభమైన 22వ తేదీ నుంచి జిల్లాలో మద్యం షాపులు మూతపడి ఉండగా అప్పటికే స్టాకు ఉన్న బార్లలో ఈ తరహా దందా నడుస్తోంది.  ఈ దందాపై ఎక్సైజ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శలు వస్తున్నాయి. అక్రమ సంపాదనే ధ్యేయంగా మద్యాన్ని అమ్ముకుంటూ కొందరు దళారులు నిత్యం వేలాది రూపాయలను ఆర్జిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికీ సారా కాస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నగరంలో జరుగుతున్న ఈ అక్రమ దందాలను అరికట్టాలని ఆయా పలువురు ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2020-04-01T15:52:43+05:30 IST