కరోనాపై అప్రమత్తం

ABN , First Publish Date - 2021-04-20T06:20:55+05:30 IST

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమయ్యిం ది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది.

కరోనాపై అప్రమత్తం
సుల్తానాబాద్‌ పట్టణంలో కరోనా గురించి అవగాహన కల్పిస్తున్న పోలీసులు

- ప్రజలను చైతన్యపరుస్తున్న పోలీస్‌ శాఖ

- విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు

- మాస్కులు ధరించని వారికి జరిమానాలు


(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

జిల్లాలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండడంతో పోలీస్‌ శాఖ అప్రమత్తమయ్యిం ది. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. బహిరంగ ప్రదేశాలు, కూరగాయల మార్కెట్లు, బస్టాండ్లు, జనం రద్దీగా ఉండే ప్రాంతాల్లో జనాలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ అప్రమత్తం చేస్తున్నారు. విధిగా మాస్కులు ధరించాలని, శానిటైజర్‌ వాడాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. మాస్కులు ధరించాలని చెబుతున్నా వినని వారికి ప్రభుత్వ ఆదేశాల మేరకు 1000 రూపాయల చొప్పున జరిమానాలు విధిస్తున్నారు. రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఉన్న పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో సీపీ సత్యనారాయణ ఆదేశాల మేరకు పోలీసులు విస్తృత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గత ఏడాది మార్చిలో రాష్ట్రంలో ప్రవేశించిన కరోనా తగ్గుముఖం పట్టడంలేదు. కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు గాను ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిర్వహించడంతో పాటు పలు చర్యలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి క్రమంగా కరోనా తగ్గుముఖం పడుతుండడంతో లాక్‌డౌన్‌ను దశల వారీగా ఎత్తివేసిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి నుంచి దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతి పెరగడంతో ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. ఈ వేవ్‌ను తగ్గించేందుకు లాక్‌ డౌన్‌ వంటి చర్యలకు పోకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

- కమిషనరేట్‌ వ్యాప్తంగా 10వేల మందికి జరిమానా..

వ్యాక్సిన్‌ వచ్చింది కదా.. ఇక కరోనా అంతమైపోయి నట్లేనని ప్రజలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్న తరుణంలో సెకండ్‌ వేవ్‌ ఉధృతి దినదినం పెరుగుతున్నది. ఒక్క పెద్దపల్లి జిల్లాలోనే ఈ నెలలో 2 వేల మందికి పైగా కరోనా బారినపడగా, పలువురు మృతి చెందారు. కరోనా సోకకుండా ఉండేందుకు తప్పనిసరిగా మాస్క్‌ వాడాలని, శానిటైజర్‌ వాడాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నా ఎవరు పట్టించుకోవడం లేదు. దీంతో ప్రభుత్వం మాస్క్‌ ధరించని వారికి రూ. 1000 జరిమానా విధించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజలు కరోనా బారిన పడకుండా ఉండేందుకు పోలీస్‌ శాఖాధికారులు పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నా రు. స్వయంగా సీపీ సత్యనారాయణ ఇటీవల గోదావ రిఖని గాంధీ చౌరస్తాకు వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించారు. మాస్కులు లేకుండా తిరిగిన వారికి జరిమానాలు విధించారు. ఇప్పటి వరకు కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో 10 వేల మందికి పైగా జరిమానా విధించారు. పెద్దపల్లి జిల్లాలోని పెద్దపల్లి, సుల్తానాబాద్‌, గోదావరిఖని, రామగుండం, ధర్మారం, పాలకుర్తి, కాల్వశ్రీరాంపూర్‌, మంథని, రామగిరి, కమాన్‌పూర్‌, ఓదెల, జూలపల్లి, తదితర మండలాల్లో పోలీసులు కరోనాపై అవగాహన కల్పిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల మార్కెట్‌కు వచ్చే జనాలు మాస్కులు ధరించడం గానీ, భౌతిక దూరం పాటించడం గానీ చేయక పోవడంతో వారికి పరిస్థితిని వివరిస్తున్నారు. బస్టాండ్లకు వచ్చే ప్రయాణికులకు సైతం సూచనలు చేస్తున్నారు. అలాగే పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే, ఆటోల్లో ప్రయాణించే వారు మాస్కులు ధరించడం లేదని గుర్తించి ముందుగా ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ‘నో మాస్క్‌.. నో ఎంట్రీ’ అనే స్టిక్కర్లను ముద్రించి ఆటోలకు అంటిస్తున్నారు. ఉచితంగా ఆటో డ్రైవర్లకు మాస్కులను కూడా పంపిణీ చేస్తున్నారు. కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరం ఉంటేనే బయట తిరగాలని, భౌతిక దూరం పాటించాలని చెబుతున్నారు. 

Updated Date - 2021-04-20T06:20:55+05:30 IST