Abn logo
Aug 2 2020 @ 01:11AM

అయోధ్య వైపే అందరి చూపు

  • భద్రతా వలయంలో భక్తి నగరం.. 
  • భారీగా మోహరించిన పోలీసు బలగాలు
  • శ్రీరంగం నుంచి బంగారు ఇటుక.. 
  • తెలంగాణ నుంచి వెండి ఇటుకలు


అయోధ్య, ఆగస్టు 1: ఆగస్టు 5. చరిత్రకెక్కనున్న రోజు. దేశ ప్రజల దశాబ్దాల నిరీక్షణ ఫలించనున్న రోజు. రామ జన్మభూమిలో రాములోరి గుడికి పునాదిరాయి పడనున్న రోజు. ఈ చరిత్రాత్మకమైన రోజుకు మరో నాలుగురోజులే మిగిలున్న వేళ.. అందరి చూపూ ప్రస్తుతం అయోధ్య వైపే నిలిచింది. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులు హాజరవనుండడంతో.. ఆలయ ట్రస్ట్‌ భారీ ఏర్పాట్లు చేస్తోంది. భక్తులు భారీగా తరలివస్తారన్న అంచనాల నేపథ్యంలో.. అయోధ్య ఇప్పటికే భద్రతా బలగాల చేతుల్లోకి వెళ్లిపోయింది. పోలీసు బలగాలు ఈ భక్తి నగరాన్ని పూర్తిగా కమ్మేశాయి. సమూహాలుగా ఏర్పడడం, గుమిగూడడంపై పోలీసులు నిషేధం విధించారు. భౌతికదూరం తప్పనిసరి చేశారు. రాజకీయ కురువృద్ధుడు, రామాలయ స్వాప్నికుడు ఎల్‌కే అడ్వాణీ, బీజేపీ సీనియర్‌ నేత మురళీ మనోహర్‌ జోషీ వీడియో కాన్ఫరెన్సు ద్వారా అయోధ్య రామాలయ శంకుస్థాపన వేడుకల్లో పాల్గొననున్నారు. బీజేపీ సీనియర్‌ నేతలు ఉమాభారతి, కళ్యాణ్‌సింగ్‌లు కూడా ఈ కార్యక్రమానికి హాజరవనున్నారు.


వేదికపై ప్రధాని సహా ఐదుగురికే చోటు

ప్రధాని మోదీ హాజరవనున్న ఈ కార్యక్రమంలో.. ఆయనతో పాటు మరో నలుగురు వేదికను పంచుకోనున్నారు. రామజన్మభూమి న్యాస్‌ చీఫ్‌ సహా ఆర్‌ఎ్‌సఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌, నృత్య గోపాల్‌దా్‌స, మరో ప్రముఖుడు ప్రధానితో కలిసి వేదికపై ఆసీనులవుతారు.


బంగారు.. వెండి ఇటుకలు

తమిళనాడులోని శ్రీరంగం ఆలయం తరఫున రాముడికి ఓ బంగారు ఇటుకను పంపుతున్నట్లు ఆలయ సనాతన ధర్మ ప్రచారక్‌ వీరరాఘవన్‌ సంపత్‌ తెలిపారు. అయోధ్య రాముడికి ఉడతాభక్తిగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌, హైదరాబాద్‌కు చెందిన చల్లా శ్రీనివాస్‌ చెరో నాలుగు వెండి ఇటుకలను సమర్పిస్తున్నట్లు తెలిపారు. కాగా, ఆగస్టు 5న ఉత్తర అమెరికాలోని అన్ని హిందూ ఆలయాల్లోనూ వర్చువల్‌గా సామూహిక ప్రార్థనలు నిర్వహించనున్నట్లు హెచ్‌ఎంఈసీ ప్రకటించింది.


రామాలయ నిర్మాణాన్ని స్వాగతిస్తున్నా: కమల్‌నాథ్‌

అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని తాను స్వాగతిస్తున్నానని ఎంపీ మాజీ సీఎం కమల్‌నాథ్‌ అన్నారు. రామాలయ నిర్మాణంతో రాజీవ్‌ ఆకాంక్ష నెరవేరుతోందని కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement