నలుగురికి అన్నా పతకాల ప్రదానం
ABN , First Publish Date - 2021-01-27T14:09:38+05:30 IST
గణతంత్ర వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వీరోచిత సాహసకృత్యాలకు పాల్పడిన నలుగురికి ‘అన్నా’ పతకాలను బహూకరించారు. కాంచీపురం జిల్లా షోళింగ్ తాలూకా పులివలం...
చెన్నై (ఆంధ్రజ్యోతి): గణతంత్ర వేడుకల అనంతరం ముఖ్యమంత్రి వీరోచిత సాహసకృత్యాలకు పాల్పడిన నలుగురికి ‘అన్నా’ పతకాలను బహూకరించారు. కాంచీపురం జిల్లా షోళింగ్ తాలూకా పులివలం ప్రాంతానికి చెందిన టీచర్ ముల్లై, సేలం జిల్లా ఫారెస్ట్ రేంజ్ వెటర్నరీ డాక్టర్ ప్రకాష్, మదురై జిల్లా తిరుమంగళం ప్రాంతానికి చెందిన రైలు డ్రైవర్ సురేష్, నీలగిరి జిల్లాకు చెందిన ట్యాక్సీ డ్రైవర్ పుగళేంద్రన్లకు ఈ అన్నా అవార్డులు దక్కాయి. అయితే ఇందులో ఉపాధ్యాయుడు ముల్లై దివంగతులవ్వడంతో ఆయన తరఫున ఆయన కుటుంబీకులు ఈ పతకాన్ని స్వీకరించారు.
మతసామరస్య అవార్డు: కోయంబత్తూరు జిల్లా కునియముత్తూరులోని తాజుల్ ఇస్లామ్ హనబీ సున్నత్ జమాత్ దర్గా అధ్యక్షుడు కేఏ అబ్దుల్ జబ్బార్ (51)కు ఈ యేడాది కోట్టై అమీర్ మతసామరస్య అవార్డును ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. అవార్డుతో పాటు రూ.25 వేల నగదు, సర్టిఫికెట్‌ను అందించారు. కునియముత్తూరు ప్రాంతంలో తరచూ ఏర్పడే మత ఘర్షణలు నివారించేందుకు చర్యలు తీసుకున్నందుకు ఆయనకు ఈ అవార్డు లభించింది.
నారాయణస్వామి నాయుడు అవార్డు: కొత్త వరిగండం ద్వారా అధిక ఉత్పత్తి సాధించే రైతుకు ఇచ్చే నారాయణస్వామి నాయుడు అవార్డును శ్రీవిల్లిపుత్తూరు ప్రాంతానికి చెందిన కె.సెల్వకుమార్‌కు ప్రదానం చేశారు. అవార్డుతోపాటు రూ. 5లక్షల నగదు, సర్టిఫికెట్‌ను ఆయన స్వీకరించారు.
అధిక దిగుబడిదారుల సంఘాలకు అవార్డులు: పంటల ఉత్పత్తిలో అధిక దిగుబడులను సాధించే సంఘాలకు ఇచ్చే అవార్డులను కూడా ముఖ్యమంత్రి ప్రదానం చేశారు. ఈ అవార్డులను 88 ఉప సంఘాలను నిర్వహిస్తున్న ఈరోడ్ సూక్ష్మ సేద్యపు ఉత్పత్తిదారుల సంఘం, వెల్లయం గిరి సాగు ఉత్పత్తిదారుల సంఘం, వాణిజ్యపరంగా అధిక ఉత్పత్తులను సాధించిన తమిళనాడు అరటి ఉత్పత్తిదారుల సంఘం, విరుదై చిరుధాన్యాల ఉత్పత్తిదారుల సంఘం అందుకున్నాయి. ఇదే విధంగా కల్తీసారాను నిరోధించడానికి చర్యలు చేపట్టే ఎక్సైజు పోలీసులకు ఇచ్చే గాంధీ స్మారక పోలీసు పతకాన్ని చెన్నై సెయింట్ థామస్ మౌంట్ ఎక్సైజ్ ఎస్ఐ టి.ముకుటీశ్వరికి, సేలం జోన్ సెంట్రల్ దర్యాప్తు విభాగం ఎస్ఐ ఎన్.సెల్వరాజుకు, విరుదునగర్ జిల్లా శ్రీవిల్లిపుత్తూరు తాలూకు హెడ్‌కానిస్టేబుల్ ఎస్.షణ్ముగనాథన్, తిరువణ్ణామలై జిల్లాకు చెందిన హెడ్‌కానిస్టేబుల్ ఎస్. రాజశేఖరన్ అందజేశారు. ఈ పతకంతోపాటు రూ.40 వేల నగదు కూడా అందించారు.
సేలం సిటీ పోలీసుస్టేషన్‌కు అవార్డు: రాష్ట్రంలోనే అత్యుత్తమ సేవలందించిన సేలం నగర పోలీసుస్టేషన్‌కు సీఎం ట్రోఫీ లభించింది. ఆ ట్రోఫీని ఆ స్టేషన్ సీఐ పి. కుమార్ సీఎం చేతుల మీదుగా అందుకు న్నారు.. ద్వితీయ స్థానం పొందిన తిరువణ్ణామలై పోలీసుస్టేషన్‌కు, తృతీయ స్థానం పొందిన చెన్నై జే4 కోట్టూరుపురం పోలీసుస్టేషన్‌కు కూడా ట్రోఫీలను ప్రదానం చేశారు.
అన్నా పతకాలు ఎందుకంటే...?: షోళింగర్ తాలూకా పులివలం ప్రభుత్వ ఉన్నతపాఠశాల సహాయ టీచర్ ముల్లై విద్యార్థులకు డ్రామా రిహార్సల్స్ జరుపుతున్నప్పుడు స్కూలు పక్కనే ఉన్న ఇంటిలోని వంట గ్యాస్ సిలిండర్ నుంచి గ్యాస్ లీకైంది. జరుగబోయే ప్రమాదాన్ని ఊహిం చిన ముల్లై 26 మంది విద్యార్థులను స్కూలు బయటకు పంపించి, తాను తప్పించుకునే యత్నంలో ప్రాణాలు విడిచారు. అంతమంది విద్యార్థులను కాపాడిన ఆ ఉపాధ్యాయుడి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఈ సంఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నా అవార్డును ప్రకటించింది. ముల్లై కుటుంబీకులు ముఖ్యమంత్రి ఎడప్పాడి నుంచి ఈ పతకాన్ని స్వీకరించారు.
వెటర్నరీ డాక్టర్‌కు...: సేలం జిల్లా ఫారెస్ట్ రేంజ్లో పనిచేస్తున్న వెటర్నరీ డాక్టర్ ప్రకాష్ అరవై అడుగుల దిగుడుబావిలో పడిన అడవి ఏనుగును కాపాడేందుకు ప్రాణాలకు తెగించి పోరాడారు. సకాలంలో ఆయన అగ్నిమాపక, అటవీశాఖలకు ఫిర్యాదు చేసి వారిని రంగంలోకి దింపి ఏనుగును బావి నుంచి బయటకు తీయించారు. ఆ సమయంలో ఏనుగు హఠాత్తుగా జనంపై దూసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు డాక్టర్ ప్రకాష్ ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆ ఏనుగు దగ్గరకు వెళ్ళి చేతితో మత్తుమందు సూదిని ఎక్కించారు. ఈ వీరోచిత సాహ సానికి గాను డాక్టర్ ప్రకాష్‌కు అన్నా అవార్డును ఎడప్పాడి అందజేశారు.
చెన్నై - వైగై ఎక్స్‌ప్రెస్ రైలు కొడైకెనాల్ రైల్వేస్టేషన్ సమీపంలో వెళుతుండగా పట్టాలపై పడి వున్న పెద్ద బండరాళ్ళను గమనించి సకాలంలో రైలు ఆపేసిన మదురై జిల్లా తిరుమంగళం ప్రాంతానికి చెందిన లోకో పైలట్ సురేష్‌కు ముఖ్యమంత్రి అన్నా పతకాన్ని ప్రదానం చేసి సత్కరించారు. అదేవిధంగా నీలగిరి జిల్లాల్లో గర్భిణిలు, రోగులు, ప్రమాదాల్లో గాయపడినవారిని సకాలంలో తన కారులో ఆస్పత్రులకు చేర్చి సేవలందించిన ప్రైవేటు టాక్సీ డ్రైవర్ పుగళేంద్రన్కు అన్నా పతాకాన్ని ముఖ్యమంత్రి అందజేశారు. ఈ నలుగురికి తలా లక్ష రూపాయల చెక్కు, బంగారు పతకం, సర్టిఫికెట్‌ను ప్రదానం చేశారు.