అన్నింటికీ అగచాట్లు!

ABN , First Publish Date - 2021-05-05T06:26:50+05:30 IST

జిల్లాలో కొవిడ్‌ దూకుడు పెరిగింది. దాని బారి నుంచి బయట పడేందుకు ప్రజలు పరుగులు తీస్తున్నారు.

అన్నింటికీ అగచాట్లు!
ఒంగోలు రిమ్స్‌లోని కొవిడ్‌ అడ్మిషన్‌ కౌంటర్‌ వద్ద పడకల కోసం పడిగాపులు కాస్తున్న బాధితులు

పరీక్షల కోసం పడిగాపులు 

ఫలితాలకు ఎదురుచూపులు

జాప్యంతో మరికొందరు వైరస్‌ వ్యాప్తి

వ్యాక్సిన్‌కు ఆస్పత్రుల చుట్టూ ప్రదక్షిణలు

బెడ్లు, చికిత్స కోసం టెన్షన్‌

జిల్లాలో కరోనా ఉగ్రరూపం

తల్లడిల్లుతున్న జనం 

ఒంగోలు, మే 3 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో కొవిడ్‌ దూకుడు పెరిగింది. దాని బారి నుంచి బయట పడేందుకు ప్రజలు పరుగులు తీస్తున్నారు. కానీ చికిత్సకు అవసరమైన వసతులు కరువయ్యాయి. పరీక్షల్లో వేగం పెరగకపోవడంతోపాటు  కిట్ల సమస్య ఎదురైంది. ఫలితాల కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది. మరోవైపు వ్యాక్సిన్‌ కొరత కూడా వేధిస్తోంది. ఇప్పటికే వైరస్‌ సోకిన బాధితులు చికిత్సల కోసం,  సీరియస్‌ కేసుల వారు ఆస్పత్రులలో బెడ్‌లు, ఆక్సిజన్‌, ఇతర మందుల కోసం నిరీక్షి స్తున్నారు. అదేసమయంలో తమకు కూడా వైరస్‌ సోకి ఉంటుందేమోనన్న ఆందోళనచెందుతున్న వారు తక్షణం కరోనా టెస్టుల కోసం పరుగులు తీస్తుండగా ఆ స్థాయిలో పరీక్షలు జరగడం లేదు. 


రోజుకు వెయ్యికిపైగా పాజిటివ్‌లు 

జిల్లాలో గత నెలలో ప్రత్యేకించి రెండో పక్షంలో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. వందల మంది మృత్యువాతపడ్డారు. అదే పరంపర ఈనెలలోనూ కొనసాగుతోంది. జిల్లాలో ఈనెల 1నుంచి 3వ తేదీ వరకూ  నిత్యం వెయ్యికిపైగానే పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈనెల 1వతేదీ  1106, 2వతేదీ 1378, సోమవారం 1218 కేసులు వెలుగు చూశాయి. మంగళవారం ఆ సంఖ్య 1741కి చేరింది. వారం నుంచి కేసులు భారీగా నమోదవుతుండటంతో బాధితుల సమీప బంధువులు, స్నేహితులు, వారితో కాంటాక్టు ఉన్న వారు తమకు కూడా వైరస్‌ సోకి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. టెస్టుల కోసం ఆస్పత్రులకు భారీగా వస్తున్నారు. నిజానికి గత ఏడాది ఇలాంటి వారిని  ప్రభుత్వమే గుర్తించి పరీక్షలు చేయించగా ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. కనీసం అనుమానంతో టెస్టుల కోసం వస్తున్న వారిందరికీ పరీక్షలు చేసే పరిస్థితి కూడా ఉండటం లేదు. ఒంగోలులోని రిమ్స్‌లో గతంలో తీసిన శాంపిల్స్‌ పేరుకుపోయి ప్రస్తుతం కొత్త టెస్టులకు శాంపిల్స్‌ తీసుకోవడం నిలిపివేశారు. ఇతర ఆస్పత్రుల్లో యాంటిజన్‌, ట్రూనాట్‌ పరీక్షలు చేస్తున్నారు. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో వస్తున్న అనుమానితులు టెస్టుల కోసం నిరీక్షించక తప్పడం లేదు. 


ఫలితాల్లో తీవ్ర జాప్యం 

ఇక టెస్టులకు శ్వాబ్‌ ఇచ్చిన వారు వాటి ఫలితాల సకాలంలో అందక ఎదురుచూపులు చూస్తున్నారు. రెండు రోజుల నుంచి వివిధ ప్రాంతాల్లో చేస్తున్న యాంటిజన్‌, ట్రూనాట్‌ టెస్టులలో ఫలితాలు వెంటనే వస్తున్నప్పటికీ వాటిలో కచ్ఛితత్వం తక్కువ అన్నది అందరికీ తెలిసిందే. అయితే ప్రధానమైన వీఆర్‌డీఎల్‌ పరీక్షల ఫలితాలు రోజుల తరబడి ఆలస్యమవుతుండగా వాటి కోసం ఆందోళనగా ఎదురుచూడాల్సి వస్తోంది. కొన్ని గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే శాంపిల్స్‌ ఫలితాలకు వారం కూడా పడుతోంది. వైర్‌స్‌ సోకిన బాధితులుగా అధికారులు ప్రకటిస్తున్న జాబితాలు చూస్తే వారం క్రితం పరీక్ష చేయించుకున్న వారికి ఇప్పుడు ఫలితం వస్తోంది. ఈ లోపు కాస్తంత అప్రమత్తత లేని వారిలో వైరస్‌ ముదిరి కొందరు మృత్యువాత పడుతుండగా, మరికొందరి పరిస్థితి సీరియస్‌ అవుతోంది.  


బెడ్లు, ఆక్సిజన్‌ కోసం ఎదురుచూపులు 

ఈసారి కేసుల సంఖ్యతోపాటు, వైరస్‌ తీవ్రత కూడా అధికంగానే ఉంటోంది. దీంతో పెద్ద  సంఖ్యలో బాధితులు చికిత్స కోసం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అక్కడ అనేక ఇబ్బందులు పడుతున్నారు. బెడ్లు, ఆక్సిజన్‌, ఇతర మందుల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ పరిస్థితి హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్న వారిని కూడా ఆందోళనకు గురి చేస్తోంది. అత్యవసరమైతే బెడ్లు దొరకుతాయో లేదోనన్న ఆందోళనతో వారు కూడా అస్పత్రులకు వస్తున్నారు. పడకల కోసం ప్రయాసపడుతున్నారు. రెండు, మూడు రోజులుగా పలు ప్రాంతాల్లో కొవిడ్‌ కేర్‌ సెంటర్ల ఏర్పాటు, పలు ఆసుపత్రుల్లో చికిత్సలకు అనుమతులు ఇవ్వడం వంటి చర్యలతో కొంత మేర ఉపశమనం కల్గింది. అయినప్పటికీ పెద్ద సంఖ్యలోనే బాధితులు ఒంగోలు రిమ్స్‌కు వస్తున్నారు. 


వ్యాక్సిన్‌ కొరతతో అరకొరగా ప్రక్రియ

కొవిడ్‌ నివారణ కోసం ముందు జాగ్రత్తగా తీసుకోసం వ్యాక్సిన్‌ కోసం ప్రజలు పడిగాపులు కాస్తున్నారు. తొలుత వ్యాక్సిన్‌ వేయించుకొనేందుకు సందేహించిన వారు ప్రస్తుతం వైరస్‌ వ్యాప్తి తీవ్రత నేపథ్యంలో ముందుకు వస్తున్నారు. గత పది, పదిహేను రోజులుగా వ్యాక్సిన్‌ కోసం వచ్చేవారి సంఖ్య భారీగా పెరిగింది. ప్రభుత్వ ఆస్పత్రులు, సచివాలయాల వద్ద క్యూలు కడుతున్నారు. అయితే వ్యాక్సిన్‌ కొరత వేధిస్తోంది. తొలిడోస్‌ వేయించుకున్న వేలాది మంది రెండో డోస్‌ సమయం వచ్చి వ్యాక్సిన్‌ కోసం ఎదురుచూస్తున్నారు. నిత్యం ఆయా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ వేస్తుండగా కొద్దిరోజుల నుంచి కొవాగ్జిన్‌ అందుబాటులో లేదు. తొలి విడత దాన్ని వేయించుకున్న వారు రెండో విడతకు సమయం మించి పోవడంతో టెన్షన్‌ పడుతున్నారు. కొవిషీల్డ్‌ నిల్వలు కూడా సోమవారంతో పూర్తిగా నిండుకున్నాయి. ప్రైవేటు వైద్యశాలల్లో ఇప్పటికే టీకా కార్యక్రమం పూర్తిగా నిలిచిపోయింది. అరకొరగా వేస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ వ్యాక్సిన్‌ కొరతతో సోమవారం మధ్యాహ్నం నుంచి బ్రేక్‌ పడింది. ఇలా కరోనా వైరస్‌ బాధితులు, అనుమానితులు అన్నింటికీ నిరీక్షించాల్సి వస్తోంది. సోమవారం పలు ప్రాంతాల్లో టెస్టులు, వ్యాక్సిన్‌ కోసం వచ్చే వారి రద్దీని నివారించేందుకు పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొందంటే వైరస్‌ తీవ్రత ఎలా ఉందో అర్థమవుతుంది. 



Updated Date - 2021-05-05T06:26:50+05:30 IST