అంతా బంద్‌

ABN , First Publish Date - 2021-03-06T06:36:26+05:30 IST

జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి.

అంతా బంద్‌
ఒంగోలులో ర్యాలలీ నిర్వహిస్తున్న వామపక్షాలు, ఇతర పార్టీలు, ప్రజా సంఘాల నేతలు

సంపూర్ణం.. స్వచ్ఛందం.. ప్రశాంతం

విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై వెల్లువెత్తిన నిరసనలు

పరిరక్షణ సమితి పిలుపునకు అన్నివర్గాల మద్దతు

జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, మానవహారాలు, ధర్నాలు

మూతపడిన ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, బ్యాంకులు

ఒంగోలు, మార్చి 5 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో బంద్‌ విజయవంతమైంది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయంపై జిల్లావ్యాప్తంగా శుక్రవారం నిరసనలు వెల్లువెత్తాయి. ఉక్కు పరిరక్షణ సమితి ఇచ్చిన బంద్‌ పిలుపునకు జిల్లాలోని అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. బంద్‌ పాటించడంతోపాటు ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు చేపట్టారు. ఉక్కు పరిరక్షణ సమితిలో కీలక కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, సీఐటీయూలతోపాటు వామపక్షాల శ్రేణులు ప్రధానంగా ఆందోళనలు నిర్వహించగా టీడీపీ, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు మద్దతు తెలుపుతూ పలుచోట్ల పాల్గొన్నారు. అధికార వైసీపీ కూడా ప్రభుత్వపరంగా మద్దతు తెలిపింది. జిల్లాలో కార్మికవర్గాలతోపాటు ఉద్యోగ, వ్యాపార, విద్యాసంస్థల నుంచి కూడా స్పందన కనిపించింది. ఆర్టీసీ బస్సులకు కూడా మధ్యాహ్నం వరకు బ్రేకులు పడ్డాయి. జిల్లావ్యాప్తంగా బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు  మూతపడగా మధ్యాహ్నం వరకు వ్యాపారసంస్థల కార్యకలాపాలు స్వచ్ఛందంగా నిలిచిపోయాయి. ఉదయం నుంచే కార్మిక సంఘాలు, వామపక్షాల కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి బంద్‌ చేపట్టారు. పదిగంటల నుంచి మధ్యాహ్నం వరకూ ప్రధాన పట్టణాలు, మండల కేంద్రాల్లో ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు నిర్వహించారు. ఈ సందర్బంగా విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అన్న నినాదం మార్మోగింది. ఒంగోలులో బైపాస్‌ ప్లైఓవర్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, సీపీఐ జిల్లా కార్యదర్శులు పూనాటి ఆంజనేయులు, ఎంఎల్‌ నారాయణతో పాటు కార్మికసంఘాల ముఖ్యనేతలు చీకటి శ్రీనివాసరావు, పీవీఆర్‌ చౌదరి పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. అలాగే మార్కాపురం, చీరాల, అద్దంకి, కనిగిరి, కందుకూరు, దర్శి, పొదిలి, చీమకుర్తి, గిద్దలూరు, వైపాలెం, పామూరు, మార్టూరు తదితర ప్రాంతాల్లోనూ ప్రభావం అధికంగానే కనిపించింది. మండల కేంద్రాల్లోనూ నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. తక్షణం కేంద్రం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని విశాఖ ఉక్కును ఆంధ్రుల ఆస్తిగానే ఉంచాలని ఆయా ప్రాంతాల్లో జరిగిన ఆందోళనల్లో పాల్గొన్న నేతలు డిమాండ్‌ చేశారు. అది జరిగే వరకూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని వారు స్పష్టం చేశారు. 




Updated Date - 2021-03-06T06:36:26+05:30 IST