బండబారిన బతుకులు

ABN , First Publish Date - 2020-06-03T10:06:47+05:30 IST

ఇంటి నుంచి నవ్వుకుంటూ వెళ్లిన వాళ్లు విగత జీవులయ్యారు.. విధి వారిని మందుగుండు సామగ్రి పేలుళ్లకు బలితీసుకున్నది.. అయిన వారందరికీ

బండబారిన బతుకులు

ఓసీపీ-1 ఫేస్‌-2లో ఘోర ప్రమాదం

బ్లాస్టింగ్‌ చార్జింగ్‌ సమయంలో భారీ విస్పోటం

నల్గురు కాంట్రాక్టు కార్మికుల దుర్మరణం

ముగ్గురికి తీవ్ర గాయాలు

ఘటన స్థలాన్ని పరీశీలించిన సీపీ సత్యనారాయణ


రామగిరి, మే 2: ఇంటి నుంచి నవ్వుకుంటూ వెళ్లిన వాళ్లు విగత జీవులయ్యారు.. విధి వారిని మందుగుండు సామగ్రి పేలుళ్లకు బలితీసుకున్నది.. అయిన వారందరికీ దూరమయ్యారు.. పేలుడు ఘటనకు తునాతునకలైన వారి మృతదేహాలను పూర్తిగా చూసుకోలేని ఘటన ఇది.. ‘ఒక్కసారి నా భర్తను చూపించండి.. ఒకసారి చూస్తా.. ఓ అయ్యా అంటూ రోధిస్తున్న మృతుడు అంజయ్య భార్య.. మా డాడికి నేనంటే చాలా ఇష్టం.. బ్లాస్టింగ్‌ జరిగితే భయపడుతుంటాడు.. ఈ పని వద్దు నీకు కష్టం అవుతుందని చెప్పినా వినలేదు.. రోజు టైం టు టైం పనికి పోతాడు.. ఈ రోజు కూడా టైంకు వెళ్లాడు.. ఇలా తిరిగిరాని లోకాలకు వెళతాడని ఊహించ లేదు.. ఓ నాన్నో.. ఓ నాన్న అంటూ.. బిల్ల రాజేశం కూతురు శిరీష, ఇతర మృతుల కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు హృదయ విదారకం..


 సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధీలోని ఓసీపీ-1 ఫేస్‌-2లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఫేస్‌-2 బ్లాస్టింగ్‌  ఏరియాలో ఉదయం పదిగంటల నలబై నిమిషాలకు బ్లాస్టింగ్‌హోల్స్‌లో (నాన్‌ఎల్సి డిటెనేటర్స్‌,లిక్విడ్‌మాగ్జిన్‌) చార్జింగ్‌ కోసం వెళ్ళిన కాంట్రాక్టు కార్మికులైన బండారి ప్రవీణ్‌(32) రమేశ్‌నగర్‌ గొదావరిఖని, బిల్లారాజేషం(42)కమాన్‌పూర్‌ ఎక్స్‌రోడ్‌, అర్జాయ్య(41)జూలపల్లి, బైక్‌నర్‌ రాకేష్‌(26) మృతిచెందగా, మరో ముగ్గురు బీమయ్య(48) బండిశంకర్‌(48), కదురుపాక వెంకటేష్‌లు తీవ్రంగా గాయాపడ్డారు. వివరాల్లో వెలితే... ఆర్జీ-3 డివిజన్‌ పరిధిలోని ఓసీపీ-1లో మహాలక్ష్మి ఓబి కంపెనీలో సబ్‌ కాంట్రాక్టు నిర్వహించే సాకర్‌, విష్ణుశివ ఫార్మాలో బ్లాస్టింగ్‌ సెక్షన్‌లో విదులు నిర్వహిస్తున్న 13 మంది కాంట్రాక్టు కార్మికులు ఉదయం ఫేస్‌-2లో కోల్‌యార్డ్‌ ప్రాంతంలోకి వెళ్లారు.


ఫేస్‌-2లో సింగరేణి అధికారుల పర్యవేక్షణలో ఆదివారం, సోమవారాల్లో బ్లాస్టింగ్‌ కోసం వేసిన సుమారు 80 హోల్స్‌లో బ్లాస్టింగ్‌ మేటిరియల్‌ రీచార్జింగ్‌ పనుల చేపట్టారు. ఉదయం సుమారు 31 హోల్స్‌లో మెటీరియల్‌ నింపి పూర్తి చేశారు. భారీ బండరాయికి వేసిన హోల్స్‌ను లిక్విడ్‌ను నింపుతుండగా భారీ విస్పోటం సంభవించింది. డిటోనేటర్‌ హోల్‌లో లిక్విడ్‌ ఎక్స్‌ఫ్లోజీవ్‌ను పైప్‌ను పట్టుకున్న బండారి ప్రవీణ్‌, బిల్లా రాజేషం, అర్జయ్య, రాకేష్‌లు పేలుడు ధాటికి గాలిలోకి ఎగిరి అక్కడిక్కడే దుర్మరణం చెందగా, తీవ్ర గాయాలతో ఉన్న వెంకటేష్‌ను సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సలహా మేరకు మెరుగైన వైద్యం కోసం కరీంనగర్‌కు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతిచెందాడు. మరో ఇద్దరు కార్మికులు భీమయ్యకు కాళ్ళు విరిగిపోగా, బండి శంకర్‌కు చేతికి గాయాలయ్యాయి.


సింగరేణి తప్పిదం

సింగరేణి సంస్థ ఆర్జీ-3 డివిజన్‌ పరిధీలోని ఓసీపీ-1 ఫేజ్‌-2లో మంగళవారం జరిగిన ప్రమాదంలో సింగరేణి తప్పిదంగా తెలుస్తోంది. ఫేజ్‌-2లో ప్రస్తుతం ప్రమాదం జరిగిన ప్రాంతంలోనే పెద్దబండరాయి ఏర్పాడింది. అయితే అదే బండరాయికి గతంలో బ్లాస్టింగ్‌హోల్స్‌వేసి నాన్‌ఎల్సి డిటెనేటర్‌తోలిక్విడ్‌ను నింపిఉంచినట్లు తెల్సింది. మంగళవారం అదే బండరాయికి మరో హోల్‌ను ఏర్పాటు చేసి అందులో డిటేనేటర్‌ను అమర్చే క్రమంలో అదిక ఒత్తిడి కారణంగా బారీ విస్పోటనం సంభవించినట్లుగా విశ్వననీయా సమాచారం. ఈ ప్రమాదంలో అక్కడిక్కడే దుర్మరణం చెందిన కార్మికుల మృతదేహలను సింగరేణి యాజమాన్యం హడవుడిగా సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించింది. దీనిపై కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటన స్థలాన్ని సీపీ సత్యనారయణ, డీసీపీ రవీందర్‌, ఏసీపీ ఉమేందర్‌, సీఐలువెంకటేశ్వర్లు, మహేందర్‌, ఎస్‌ఐలు మహేందర్‌, శ్యాంపటేల్‌లు సందర్శించారు. జరిగిన ఘటనపై బ్లాస్టింగ్‌ ఇంచార్జ్‌ మధును విచారించారు.


ఫేస్‌-2లో భీతావహ వాతావరణం

డివిజన్‌లో తొలిసారిగా బ్లాస్టింగ్‌ కారణంగా నలుగురు కాంట్రాక్టు కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మంగళవారం ఫేస్‌-2లో బ్లాస్టింగ్‌ చార్జింగ్‌ సమయంలో భారీ విస్పోటనంతో మృతదేహాల విడిభాగాలు చిందరవందరగా పడి ఉన్నాయి. బ్లాస్టింగ్‌ గ్యాలరీ ప్రదేశం రక్తం, కార్మికులు దేహం మాంసం ముద్దలు పడి బీతావహ వాతవరణం తలపించింది.


బ్లాస్టింగ్‌ తప్పిదాలపై విచారణ చేపడుతాం:  రామగుండం సీపీ సత్యనారయణ

ఓసీపీ-1 ఫేస్‌-2లో జరిగిన బ్లాస్టింగ్‌ తప్పిదాలపై విచారణ చేపడుతామని రామగుండం సీపీ సత్యనారాయణ తెలిపారు. మంగళవారం ఓసీపీ-1 ఫేస్‌-2లో జరిగిన బ్లాస్టింగ్‌ ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. వివరాలు సింగరేణి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్వారీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ మాట్లాడారు. ప్రాజెక్టులో డిటోనేటర్‌ విస్పోటనంపై లోతుగా సింగరేణి అధికారులతో అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు. ఈ ఘటనపై క్రిమినల్‌ కేసు నమోదు చేస్తామన్నారు. విచారణ కోసం డీసీపీ, ఏసీపీ, సీఐల నేతృత్వంలో విచారణ కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. ఈ తప్పిదానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. 


Updated Date - 2020-06-03T10:06:47+05:30 IST