Abn logo
Oct 23 2021 @ 23:42PM

అంతిమ విజయం న్యాయానిదే

దొండపాడులో పాద యాత్ర చేస్తున్న మహిళలు , రైతులు

676వ రోజు ఆందోళనుల్లో రాజధాని రైతులు

తుళ్లూరు, అక్టోబరు 23: మూడు రాజధానులంటూ సీఎం జగన్‌రెడ్డి అమరావతి రైతులకు అన్యాయం చేస్తున్నారని, కాని అంతిమ విజయం న్యాయానిదేనని రాజధాని రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు చేస్తోన్న ఉద్యమం శనివారంతో 676 రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి వారు మాట్లాడుతూ రాజధాని రైతులు న్యాయం కోసం పోరాడుతున్నారని, అన్యాయం ఎప్పుడూ గెలవదన్నారు.     భావితరాల భవిషత్‌ కోసం భూములు ఇస్తే, అమరావతిని నాశనం చేయాలని సీఎం జగన్‌రెడ్డి ఆయన మంత్రి బృందం కుట్రలు చేస్తున్నారన్నారు. రాజధాని 29 గ్రామాలలో అమరావతి వెలుగు కార్యక్రమం కొనసాగింది. దీపాలు వెలిగించి సేవ్‌ అమరావతి అంటూ నినాదాలు చేశారు.  

మహా పాదయాత్ర - పవిత్ర యాత్ర 

అమరావతి మహా పాదయాత్ర ఒక పవిత్ర యాత్ర అని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్‌ పువ్వాడ సుధాకర్‌ తెలిపారు. అమరావతి నుంచి తిరుమలకు ఒకటో తేదీ నుంచి 45 రోజుల పాటు జరిగే మహా పాదయాత్రను ప్రజలు జయప్రదం చేయాలంటూ శనివారం రాజధాని పరిధిలోని దొండపాడు, బోరుపాలెం గ్రామాలలో పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఈ పవిత్ర యాత్రలో పాల్గొనడానికి అందరూ ముందుకు వస్తున్నారన్నారు. అమరావతి ప్రజా రాజధాని అని అందరూ కలసి రక్షించుకోవాలని పిలుపునిచ్చారు. మూడు రాజధానుల అనాలోచిత నిర్ణయంతో అమరావతితో పాటు, ఏపీ ప్రజల ప్రగతి కుంటుపడిందన్నారు. అమరావతి కావాలని సర్వేలో 80 శాతం మంది చెప్పారన్నారు.