అదే నినాదం.. అదే ఉత్తేజం!

ABN , First Publish Date - 2021-04-30T06:15:02+05:30 IST

ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానిగా అమరావతి కొనసాగాలనే డిమాండ్‌తో అలుపెరగకుండా సాగుతున్న ఉద్యమం నేడు 500వ రోజుకు చేరింది. ఈ పోరాటంలో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు.

అదే నినాదం.. అదే ఉత్తేజం!

 అలుపెరగని ఉద్యమ కెరటాలు 

 నేడు 500వ రోజుకు చేరిన రాజధాని రైతుల పోరాటం 

 ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తున్న మహిళలు

  ఐదు కోట్ల ఆంధ్రుల రాజధానిగా అమరావతి కొనసాగాలనే డిమాండ్‌తో అలుపెరగకుండా సాగుతున్న ఉద్యమం నేడు 500వ రోజుకు చేరింది. ఈ పోరాటంలో మహిళలు ప్రధాన భూమిక పోషిస్తున్నారు. ప్రారంభం నుంచి విరామమెరుగకుండా ఉద్యమ పథంలో కదులుతున్నారు. 

 తుళ్లూరు, ఏప్రిల్‌ 29 : భావితరాల భవిష్యత్‌ బాగుటుందని, ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అమరావతి రాజధాని అందుబాటులో ఉండి, మన ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటుతుందని భూములిచ్చామని రైతులు స్పష్టం చేశారు.  మూడు ముక్కల ఆటతో రాష్ట్ర ప్రభుత్వం నడిరోడ్డు మీదకు నెట్టిందంటూ ఆవేదన చెంది కడుపు మండి ఉద్యమం సాగిస్తున్నారు. ఉద్యమాన్ని అణచివేయటానికి సీఎం జగన్‌ రెడ్డి నేతృత్వంలో అనేక అణచివేత ధోరణలు జరిగాయి. గుడికి వెళతామంటే ఆంక్షలు, లాఠీచార్జీలు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతామంటే అక్రమ కేసులు పెడుతున్నారు. తొలుత రోడ్డు మీద ధర్నాలు చేశారు. కరోనా మహమ్మారితో కొనాళ్లు ఇంటి నుంచి ఉద్యమం, ఆ తరువాత మరలా శిబిరాలలో ఉద్యమాలు, నిరసనలు. ఇలా అమరావతి ఉద్యమం అనేక ఒడిదుడుకులు తట్టుకొని ఉవ్వెత్తున ఎగసి పడుతోంది.  వైసీపీ తప్ప అన్ని పార్టీలూ అమరావతి రాజధానికి మద్దతు ప్రకటించాయి. మూడు ముక్కలఆట మానుకోవాలని రైతులు, మహిళలు, రైతు కూలీలు నిరసనలు, ధర్నాలతో  ఒకపక్క  పోరాటం  చేస్తూనే మరో పక్క న్యాయ పోరాటానికి దిగారు. దీంతో సీఆర్డీఏ రద్దు బిల్లు నిలిపివేయటం, మూడు రాజధానులు బిల్లు అమలు చేయవద్దని ఉన్నత న్యాయస్థానం స్టేట్‌సకో విధించడం జరిగాయి. అమరావతి రైతులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి న్యాయ దేవత అండగా ఉంటుందని ప్రగాఢ విశ్వాసంతో  భూములు త్యాగం చేసిన రైతులు ఉన్నారు. మొదటి నుంచి ఉద్యమాన్ని మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా ఉండాలని వారు చేస్తున్న ఉద్యమం శుక్రవారంతో 500 రోజులకు చేరుకుంటుంది. ఈ సందర్భంగా పోరాటం చేస్తున్న మహిళా ఉద్యమకారిణిల స్పందన ఇది.

మహిళలను, దళితుల్ని అవమానించారు 

 రాజధాని ఉద్యమం చేస్తున్న దళిత మహిళల్ని అవమానించారు.  రాజధానికి భూములిచ్చిన వారిలో అధిక శాతం ఎస్సీలు, బహుజనులున్నారు. కమ్మ వారిదని అమరావతిని అభివృద్ధిని నిలిపివేశారు. ఈ పాపం ఊరికే పోదు. ఎంతో మంది దళితులు రోడ్డున పడ్డారు. అమరావతి పింఛన్‌ ఐదు వేలు అని చెప్పి రైతు కూలీలను ప్రభుత్వం మోసం చేసింది. ఇంతకన్నా దారుణం లేదు. పేదలకు కట్టిన ఇళ్లు ఇవ్వలేదు. ఇది చాలా పెద్ద తప్పు. అమరావతి రాజధాని అభివృద్ధితో రాష్ట్ర ప్రగతి,  లేదంటే అధోగతే.

-  అంకం సువర్ణ కమల,దళిత మహిళా జేఏసీ కన్వీనర్‌ 

అక్రమ కేసులు పెట్టారు 

మూడు రాజధానులని, రైతులను మోసిన ప్రభుత్వం ఉద్యమాన్ని అణగదొక్కటానికి అక్రమ కేసులు చాలా పెట్టారు. అయినా భయపడకుండా  అమరావతిని సాధించుకోవటానికి ముందుకు వెళుతున్నాం. పోరాటంలో మాకు ఏమైనా ఫర్వాలేదు. భావితరాల భవిష్యత్‌ బాగుండాలి. అమరావతికి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సై అన్న పాలకులు అధికార పీఠం ఎక్కగానే అమరావతిని నాశనం చేయటం మొదలు పెట్టారు. మూడు ముక్కల ఆట అంటూ రైతులను నడి రోడ్డు మీద 500 రోజుల నుంచి నిలబెట్టారు. నా బిడ్డను  పోలీసులు కాళ్లతో కడుపులో తన్నారు. ఎన్నో అవమనాలు చేశారు. భయపెట్టాలని చూశారు. అయినా వెనక్కి తగ్గేది లేదు. 

- యర్రమనేని నాగమల్లేశ్వరి, రాజధాని మహిళా రైతు 

ఐదేళ్ల నుంచి పాలన

 అసెంబ్లీ, సచివాలయం, ఉద్యోగుల భవనాల నిర్మాణం జరిగాయి. పెద్ద పెద్ద రోడ్లు రైతులు త్యాగం చేసిన భూములలో నిర్మాణం చేశారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పని చేస్తున్నది. ఐదేళ్ల నుంచి పాలన అంతా అమరావతి రాజధాని వేదిక చేసుకొని జరుగుతోంది. మధ్యలో మూడు రాజధానులని మాట తప్పారు. మోసం చేశారు. చట్ట ప్రకారం రాష్ట్ర రాజధానికి ప్రభుత్వం అడిగితేనే  భూములు ఇచ్చాం.  అభివృద్ధిని నిలిపివేశారు. ఇది మోసం చేయటమే. నమ్మించి మోసం చేస్తే శిక్ష వేయాలి. దేవుడు వేస్తాడని నమ్ముతున్నాం. న్యాయ దేవత రైతులకు అండగా ఉంటుంది. 

 - కొమ్మినేని వరలక్మీ, రాజధాని మహిళా రైతు 

దళితుల రాజధాని అమరావతి

రాజధాని అమరావతి ప్రాంతం ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం అయిన తాడికొండ నియోజకవర్గంలో ఉంది. భూములు త్యాగం చేసిన వారిలో అత్యధికులు దళితులు ,బహుజనులే. అందుకే రాజధాని అభివృద్ధిని సీఎం జగన్‌రెడ్డి నిట్ట నిలువునా నిలిపివేశాడు. మహిళలంటే చులకనగా చూస్తున్నారు. 500 రోజులుగా రోడ్డు మీదకు మహిళలు వస్తే కనీసం ఒక్కసారి కూడా చర్చలు లేవు, పరామర్శలేదు. రైతులు, రైతు కూలీలు, మహిళా రైతులు మనోవేదనతో చనిపోతున్నారు. అయినా చీమ కుట్టినట్టుగా కూడా ఈ ప్రభుత్వానికి లేదు. మూడు రాజధానులు అనటం సిగ్గు చేటు. అమరావతి రాష్ట్ర ఏకైక రాజధానిగా కొనసాగాలి. 

 - కంభం పాటి శిరీష, దళిత మహిళా జేఏసీ సభ్యురాలు



Updated Date - 2021-04-30T06:15:02+05:30 IST