‘అంబానీ’ పేలుడు పదార్థాల కేసు..పోలీసుల అధికారి అరెస్టు

ABN , First Publish Date - 2021-03-15T07:51:10+05:30 IST

ముఖేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు రాజకీయ రంగు పులుముకొని కీలక మలుపులు తిరుగుతోంది

‘అంబానీ’ పేలుడు పదార్థాల కేసు..పోలీసుల అధికారి అరెస్టు

బీజేపీ.. శివసేన మధ్య మరో రగడ మొదలు


ముంబై, మార్చి 14: ముఖేశ్‌ అంబానీ నివాసానికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనం కేసు రాజకీయ రంగు పులుముకొని కీలక మలుపులు తిరుగుతోంది. శివసేన.. బీజేపీకి మధ్య మరో రగడ రాజుకొన్నట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే ఆ వాహన యజమాని అనుమాస్పద స్థితిలో మృతి చెందగా... తాజాగా ఒక పోలీసు అధికారిని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. ఎన్‌కౌంటర్‌  స్పెషలిస్టుగా పేరున్న అసిస్టెంట్‌ ఇన్స్‌పెక్టర్‌ సచిన్‌ వాజే తన వాంగ్మూలాన్ని ఇవ్వడానికి శనివారం ఉదయం 12గంటల సమయంలో ఎన్‌ఐఏ కార్యాలయానికి వెళ్లారు. దాదాపు 12గంటలపాటు ప్రశ్నించిన తర్వాత.. అదేరోజు రాత్రి 12గంటల సమయంలో ఆయనను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది. తదుపరి కోర్టులో హాజరు పరచడం.. మార్చి 25 వరకూ ఎన్‌ఐఏ కస్టడీకి కోర్టు అనుమతించడం అన్నీ రాత్రికిరాత్రే జరిగిపోయాయి.


ఫిబ్రవరి 25న ముఖేశ్‌ అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో ఉన్న వాహనాన్ని గుర్తించారు. సదరు వాహనాన్ని అప్పటికే వారం క్రితం ఎవరో దొంగిలించారని దాని యజమాని, వ్యాపారవేత్త మన్సుక్‌ హీరేన్‌ చెప్పారు. తర్వాత మార్చి 5న ఆయన అనుమాస్పద స్థితిలో చనిపోయారు. తన భర్త మరణంలో వాజే హస్తముందని మన్సుక్‌ భార్య విమల ఆరోపించారు. ఈ కేసు దర్యాప్తు తొలుత యాంటీ టెర్రరిజం స్క్వాడ్‌(ఏటీఎస్‌) ప్రారంభించింది. మన్సుక్‌ మరణం తర్వాత కేసును ఎన్‌ఐఏకు అప్పగించారు. కాగా, ముందస్తు బెయిల్‌ కోరుతూ థానే సెషన్సు కోర్టును వాజే ఆశ్రయించారు. ఈ నెల 19న ఆ వ్యాజ్యం విచారణకు వచ్చే అవకాశం ఉంది. అయితే, ఆయన ఆందోళనకరమైన వాట్సప్‌ మెసేజ్‌ను పోస్ట్‌ చేశారు. ప్రపంచానికి వీడ్కోలు చెప్పే సమయం దగ్గర పడుతోందని తాను భావిస్తున్నానని దానిలో పేర్కొన్నారు. 


వాజే.. ఎవరు?

1990 బ్యాచ్‌కు చెందిన రాష్ట్ర క్యాడర్‌ పోలీసు అధికారి సచిన్‌ వాజే. 63 ఎన్‌కౌంటర్లు చేసిన చరిత్ర ఉంది. 2002లో జరిగిన ఘట్‌కోపర్‌ పేలుళ్ల అనుమానితుడు ఖాజా యూనస్‌ పోలీసు కస్టడీలో మృతి చెందాడు. ఈ కేసుకు సంబంధించి బాంబే హైకోర్టు ఆదేశాలతో 2004లో వాజేను విధుల నుంచి తప్పించారు. తర్వాత ఆయన శివసేనలో చేరారు. 2008 వరకూ శివసేనలో వాజే ఉన్నారని శివసేన అధినేత, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ఇటీవల చెప్పారు. గత ఏడాదిలో వాజేను మళ్లీ విధుల్లో తీసుకొన్నారు. అదే ఏడాది నవంబర్‌లో రిపబ్లిక్‌ చానెల్‌ అధినేత అర్ణబ్‌ గోస్వామి అరెస్టు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆ కేసు దర్యాప్తు బృందానికి వాజే నేతృత్వం వహించారు.


ఇక, వాజే అరెస్టుతో ఈ కేసు రాజకీయ రంగు పులుముకుంది. తాను సీఎంగా ఉండగా.. వాజేకు పోస్టింగ్‌ ఇవ్వాలని కొందరు శివసేన మిత్రులు కోరారని మాజీ సీఎం, బీజేపీ నేత దేవేంద్ర ఫడణవీస్‌ వెల్లడించారు. అయితే, అందుకు తాను అంగీకరించలేదన్నారు. శివసేన అధికారంలోకి వచ్చాక.. క్రైం బ్రాంచ్‌లో అత్యంత సున్నితమైన క్రైం ఇంటెలిజెన్స్‌ యూనిట్‌లో వాజేకు విధులు అప్పగించారని పేర్కొన్నారు. ఇప్పుడు ఈ కేసులో ఆయనను కాపాడడానికి శివసేన ప్రయత్నిస్తోందన్నారు. తీవ్రవాద కార్యకలాపాల కేసులో ఉన్న ఒక పోలీసు అధికారిని అరెస్టు చేయనీయకుండా సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే ప్రయత్నించడం రాష్ట్రానికే సిగ్గుచేటని మహారాష్ట్ర బీజేపీ చీఫ్‌ చంద్రకాంత్‌ పాటిల్‌ విమర్శించారు.   

Updated Date - 2021-03-15T07:51:10+05:30 IST