Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఉలిక్కిపడ్డ అమీన్‌సాహెబ్‌పేట

పసికందు హత్యతో విషాదఛాయలు

తల్లే హంతకురాలని తెలిసి కలవరపాటు

కన్నీరు పెట్టిన నర్సాపురం ప్రజలు

శోక సంద్రంలో కుటుంబీకులు, బంధువులు


కశింకోట, నవంబరు 27: పసికందు హత్యతో అమీన్‌సాహెబ్‌పేట పంచాయతీ ప్రజలు ఉలిక్కిపడ్డారు. శుక్రవారం అర్ధ రాత్రి పసికందు కనిపించడం లేదన్న వార్త దావనంలా వ్యాపించడంతో ఈ పంచాయతీ పరిధిలోని నర్సాపురం, గొబ్బూరుపాలెం గ్రామ ప్రజలు ఆందోళన చెందారు. పిల్లల దొంగలు ఎవరైనా చొరబడి పసిబిడ్డ చైతన్య ఎత్తుకెళ్లారేమోనని భయబ్రాంతులకు వారు గురయ్యారు. తీరా ఎస్సీ కాలనీలో ఇంటి ఆవరణలోని డ్రమ్ములోనే పసికందు మరణించి వుండడంతో కలవరపాటుకు గురయ్యారు. పసికందును చూసి అంతా చలించిపోయారు. గిట్టనివాళ్లు ఎవరో చంపిపడేసి ఉంటారని భావించారు. తరువాత కన్నతల్లే కడుపున పుట్టిన బిడ్డను హతమార్చిందన్న చేదునిజాన్ని జీర్ణించుకోలేకపోయారు. ఇలాంటి దురదృష్ణకరమైన సంఘటన ఎక్కడ జరగకూడదంటూ వారు ప్రార్థించారు.


గుండెలవిసేలా రోధించిన కుటుంబీకులు

ముక్కుపచ్చలారని పసికందు కళ్లముందే విగతజీవిగా మారడంతో పసిబిడ్డ తండ్రి యాసలపు అప్పలరాజు కన్నీరుమున్నీరయ్యాడు. ఇష్టపూర్వకంగా ప్రేమించి పెళ్లాడిన భార్య సంధ్యే ఇంతటి దారుణానికి దిగుతుందని కలలో కూడా ఊహించలేదంటూ భోరున విలపించాడు. భగవంతుడా? ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదంటూ అప్పలరాజు, అతని కుటుంబ సభ్యులు, బంధువులు లబోదిబోమన్నారు. పుట్టిన నెల రోజులకే నూరేళ్లు నిండిపోయాయా అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ దృశ్యాలు చూపరులను సైతం కంటతడి పెట్టించాయి.


కుటుంబాన్ని ఎదురించి.. కులాంతర వివాహం చేసుకుని..

అప్పలరాజును ప్రేమ వివాహం చేసుకోవడానికి సంధ్య తన తండ్రి చిట్టిబోయిన వరంతో విభేదించింది. సంధ్య చిన్న తనంలోనే తల్లి గణపతి కన్నుమూసింది. దీంతో ఆటోడ్రైవర్‌గా ఉన్న సంధ్య తండ్రి రెండో పెళ్లి చేసుకున్నాడు. సవతి తల్లివద్దనే సంధ్య పెరిగింది. ఈ నేపథ్యంలో పుట్టింటి వద్ద కుటుంబ కలహాలు జరిగేవని స్థానికులు చెప్పారు. కులాంతర వివాహంపై కలహాలు, మూర్చరోగం తదితర అంశాలపై కూడా సంధ్య మానసిక స్థితి బాగోవడం లేదని స్థానిక ప్రజలు తెలిపారు.

Advertisement
Advertisement