Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఆర్టీసీ చార్జీల మోత?

- జిల్లా ప్రయాణికులపై పడనున్న అదనపు భారం

- కిలో మీటరుకు పల్లె వెలుగుకు 25పైసలు

- ఇతర సర్వీసులకు 30 పైసలు పెంపు

- ప్రతీ ఏట అదనపు భారం సుమారు రూ.25.50 కోట్లకు పైనే..

- ఆర్టీసీ సంస్థకు ప్రతినెల సుమారు రూ.3 కోట్ల వరకు ఆదాయం


కామారెడ్డి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ సంస్థ తీసుకున్న చార్జీల పెంపు నిర్ణయంతో జిల్లా ప్రయాణికులపై అదనపు భారం పడనుంది. ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నందున చార్జీలు పెంచుకోవాలంటూ ఇటీవల ప్రభుత్వం సూచించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ సంస్థ భారం ప్రయాణికులపైనే ప్రభుత్వం మోపనుంది. కిలో మీటరుకు పల్లె వెలుగుకు 25 పైసలు, ఇతర సర్వీసులకు 30పైసల చొప్పున చార్జీలను పెంచుకోవాలని ఆర్టీసీ సంస్థకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని రెండు డిపోల పరిధిలోని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులపై సంవత్సరానికి సుమారు రూ.25.50 కోట్లకు పైగానే భారం పడనుంది. అదే విధంగా చార్జీల పెంపుతో నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ప్రతినెల సుమారు రూ.3కోట్ల వరకు ఆదాయం సమకూరనుందని ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి.

రెండు డిపోల్లో 232 బస్సులు

జిల్లాలో కామారెడ్డి, బాన్సువాడ రెండు డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిఽధిలో మొత్తం 232 ఆర్టీసీ బస్సులు ఉన్నాయి. సుమారు ప్రతిరోజూ 124 సర్వీసులు వివిధ రూట్లలో నడుస్తుంటాయి. ప్రధానంగా కామారెడ్డి నుంచి బాన్సువాడ, ఎల్లారెడ్డి పట్టణాలతో పాటు జిల్లాలోని 22 మండలాలకు పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. అదే విధంగా కామారెడ్డి నుంచి ప్రధాన రహదారుల రూట్లైన నిజామాబాద్‌, హైదారాబాద్‌, సిరిసిల్లా, సిద్దిపేట్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నారు. కామారెడ్డి డిపో పరిధిలో 122 బస్సులు ఉండగా ఇందులో హైయర్‌ బస్సులు 33, ప్రభుత్వ బస్సులు 99 ఉన్నాయి. బాన్సువాడలో 103 బస్సులు ఉండగా ఇందులో 21 హైయర్‌ బస్సులు, 82 ప్రభుత్వ బస్సులు ఉన్నాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌, నిజామాబాద్‌ రూట్లలో ప్రయాణించే బస్సులతో కామారెడ్డి ఆర్టీసీకి ఎక్కువ ఆదాయం సమకూరుతుంది. ప్రతిరోజూ రెండు డిపోల పరిధిలో సుమారు రూ.18లక్షలకు పైగా ఆదాయం వస్తుండేది. పెరిగిన చార్జీలతో మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉంది.

కిలో మీటర్‌కు 25 పైసలు పెంపు

ఆర్టీసీ సంస్థను లాభాల బాటలో నడిపేందుకు చార్జీలు పెంచుకునేందుకు ప్రభుత్వం ఇటీవల ఆదేశాలు జారీ చేసింది. కిలో మీటరుకు పల్లె వెలుగుకు 25 పైసలు చార్జీలు పెంచుకునేందుకు ఆర్టీసీ సంస్థకు అనుమతి ఇచ్చారు. జిల్లా నుంచి సుమారు 127 సర్వీసులు వివిధ రూట్‌లలో నడుస్తుంటాయి. కామారెడ్డి నుంచి హైదరాబాద్‌కు 108 కిలో మీటర్లు ఉండగా ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్‌ చార్జీలు రూ.127 ఉంది. 30పైసల పెంపుతో అదనంగా రూ.32.40పైతో రూ.159.40కు చార్జీలు చేరుతోంది. అదే విధంగా డీలక్స్‌ ప్రస్తుతం రూ.147 చార్జీలు ఉన్నాయి. పెరిగిన చార్జీలతో రూ.179.40కు చేరుతోంది. ఇలా జిల్లా నుంచి ప్రధాన రూట్‌లలో వెళ్లే నిజామాబాద్‌, కరీంనగర్‌, సిద్దిపేట్‌, సిరిసిల్లా, హైదరాబాద్‌ ప్రయాణికులపై మరింత భారం పడనుంది.

జిల్లా ప్రయాణికులపై రూ.25.50 కోట్ల భారం

ఆర్టీసీ చార్జీల పెంపుతో జిల్లా ప్రయాణికులపై సంవత్సరానికి సుమారు రూ.25.50 కోట్ల భారం పడనుంది. ఆర్టీసీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనుగడ సాధించేందుకు పల్లెవెలుగుకు 25 పైసల చొప్పున పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కిలో మీటరుకు పల్లెవెలుగుకు 25 పైసలు, ఇతర సర్వీసులకు 30పైసలు పెంచుతున్నప్పటికీ ఆర్టీసీకి కోట్ల రూపాయల్లో అదనపు ఆదాయం రానుంది. ప్రస్తుతం జిల్లాలోని రెండు డిపోల పరిఽధిలో 232 బస్సులు వివిధ రూట్‌లలో ప్రయాణిస్తున్నాయి. ప్రతిరోజూ రూ.18లక్షల వరకు ఆర్టీసీ సంస్థకు ఆదాయం సమకూరుతోంది. పెరిగిన చార్జీలతో రోజుకు రూ.20 నుంచి 23 లక్షల వరకు ఆదాయం రానుంది. ఈ లెక్కన చూస్తే నెలకు పెరిగిన చార్జీలతో నెలకు రూ.8కోట్లు రాగా ఏడాదికి రూ.96 కోట్ల ఆదాయం సమకూరనున్నట్లు ఆర్టీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన పెరిగిన చార్జీలతో ప్రయాణికులపై నెలకు రూ.2.70కోట్ల అదనపు భారం పడనుంది.

Advertisement
Advertisement