నత్తనడకన భవన నిర్మాణం

ABN , First Publish Date - 2021-04-19T05:35:42+05:30 IST

దుబ్బాక సమీకృత భవన నిర్మాణానికి స్థలం ఎంపికలో తప్పటడుగు వేయడంతో మూడు కోట్ల రూపాయాలను వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిధుల కొరత ఏర్పడి మూడెళ్లుగా పనులు నత్తనడకన సాగుతున్నాయి.

నత్తనడకన భవన నిర్మాణం
దుబ్బాకలో మూడేళ్లుగా కొనసాగుతున్న సమీకృత భవన నిర్మాణం

దుబ్బాక, ఏప్రిల్‌ 18: దుబ్బాక సమీకృత భవన నిర్మాణానికి స్థలం ఎంపికలో తప్పటడుగు వేయడంతో మూడు కోట్ల రూపాయాలను వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో నిధుల కొరత ఏర్పడి మూడెళ్లుగా  పనులు నత్తనడకన సాగుతున్నాయి. 2018 జూన్‌ 3న దుబ్బాక పట్టణ శివారులోని రామసముద్రం చెరువు ఆయకట్టులో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, సుమారు రూ.17 కోట్ల ఎస్‌డీఎఫ్‌ నిధులను కేటాయించారు. దుబ్బాక మండలానికి చెందిన తహసీల్దార్‌ కార్యాలయంతో పాటు పంచాయతీరాజ్‌ పరిధిలోని సుమారు 15 విభాగాల శాఖలకు ఒకే చోట సమీకృత భవనాన్ని ఏర్పాటు చేయాలనే కృత నిశ్చయంతో పనులను చేపట్టారు. దుబ్బాకలోని పోలీ్‌సశాఖ, మున్సిఫ్‌ కోర్టు, ఆరోగ్యశాఖ మినహా అన్ని శాఖలను పట్టణం నుంచి శివారులో నిర్మించే భవనంలోకి తరలించాలనుకున్నారు. దివంగత ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి హయాంలో ప్రారంభమైన పనులు మూడెళ్ల నుంచి నత్తనడకన కొనసాగుతూ.. ఇటీవలే నిలిచిపోయాయి. ఇంకా 30 శాతం నిర్మాణం పెండింగ్‌లో ఉంది.


స్థలం ఎంపికలో తప్పటడుగు?


రామసముద్రం చెరువు ఆయకట్టు పరిసర ప్రాంతంలో సుమారు 30 ఏళ్ల క్రితం అప్పటి ప్రభుత్వం సుమారు 80 ఇళ్లతో చేనేత కాలనీని నిర్మించింది. రామసముద్రం ఆయకట్టు ప్రాంతంలో నల్లరేగడి భూములు ఉండడంతో ఆ కాలనీలో నిర్మించిన ఇళ్ల పునాదులు గట్టి పడక కార్మికులు గృహ ప్రవేశం చేయకముందే పూర్తిగా కూలిపోయాయి. అలాంటి నల్లరేగడి భూమిలోనే రూ.17 కోట్లతో సమీకృత భవన నిర్మించడం తప్పటడుగుగానే ప్రజల్లో అభ్యంతరాలు వెల్లువెత్తాయి. పిల్లర్లతో పునాదుల నిర్మాణం చేపట్టడానికి ధరి (భూమి అడుగు) లభించకపోవడంతో సుమారు మట్టిలోనే రూ.3కోట్లు వెచ్చించారు. దీంతో భవనం పూర్తవ్వడానికి 7కోట్ల నిధులు సరిపోవనే ఉద్దేశంతో మొదట కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేశాడు. మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు కాంట్రాక్టర్‌ మళ్లీ పనులు మొదలు పెట్టినా నత్తనడకన సాగుతున్నాయి. మరిన్ని నిఽధులు కేటాయిస్తేనే భవనం పూర్తయ్యే అవకాశాలున్నాయని అధికారులే చెబుతున్నారు. 


పాత మండల కార్యాలయమే భేష్‌


పాత మండల పరిషత్‌ కార్యాలయం బస్టాండ్‌కు, గ్రామానికి దగ్గరగా ఉండడంతో ఇక్కడే సమీకృత భవనం నిర్మించి ఉంటే బాగుండేదని మండల ప్రజలు అంటున్నారు. పట్టణం నడిబొడ్డున ఉన్న మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలోనే నిర్మించి ఉంటే, మూడు కోట్ల రూపాయాలు మట్టిపాలయ్యే అవకాశం ఉండేది కాదనేది ప్రజలు అభిప్రాయపడుతున్నారు.  అంతేగాక పట్టణం సమీపంలో ఎకరా స్థలానికి రూ.కోటీ మార్కెట్‌ విలువ కూడా ఉండేది కాదంటున్నారు. స్థలాన్ని కొనుగోలు చేసి నిర్మించినా మరో రెండు కోట్ల ప్రజాధనం వృథా కాకుండా పోయేదని అంటున్నారు. 


 

Updated Date - 2021-04-19T05:35:42+05:30 IST