Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందరినోటా.. దాసాలమ్మ గుట్ట మాట

గ్రామస్థులను కాపాడిన దాసాలమ్మ ఆలయం గుట్ట 

రాజంపేట, నవంబరు 28 : నేడు అందరూ తొగూరుపేట దాసాలమ్మ ఆలయం గురించే చర్చించుకుంటున్నారు. కారణం అన్నమయ్య ప్రాజెక్టు తెగి ఏకంగా 3 లక్షల క్యూసెక్కుల నీరు చెయ్యేరు గుండా ప్రవహించి దిగువ ప్రాంతాలైన తొగూరుపేట, పులపత్తూరు, మందపల్లె ఇతర గ్రామాలను ముంచెత్తి భారీగా కనీవిని ఎరుగని ప్రాణ, ఆస్తి, పంట నష్టాన్ని కలిగించిన విషయం విదితమే.. ఈ సమయంలో తొగూరుపేట అంతా భారీ భవనాలు సైతం నేలమట్టమై ఊరంతా వల్లకాడైంది. ఈ గ్రామంలో ఊరంతా పాడైపోయినా ఒక్క మరణం కూడా జరగలేదు. కారణం.. ఆ గ్రామానికి చెందిన లస్కర్‌ రామయ్య అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతంలో నివాసముండటం, అదే రాత్రి అతను అక్కడ ఉండి జరిగే నష్టాన్ని ముందుగానే గ్రామస్థులకు తెలియజేయడం వల్ల ప్రజలంతా అప్రమత్తమయ్యారు. ఊరంతా గురువారం తెల్లవారుజామున ఒక్కటై ఏటికి అడ్డుగా ఉండి తమ గ్రామానికి ఆనుకొని ఏకంగా 80 అడుగుల పైన ఉన్న దాసాలమ్మ గుట్టపైకి ఎక్కి దాసాలమ్మ ఆలయంలో తలదాచుకున్నారు. ఒకటి రెండు సార్లు అలలు ఆలయాన్ని తాకినా పెద్ద గుట్ట ఉండటం వల్ల వారికి ఎటువంటి హాని జరగలేదు. ఒక్కరు కూడా మరణించలేదు. దీంతో ఈ ఆలయ ప్రాశస్త్యం గురించి ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఆ గ్రామ నాయకులు తొగూరుపేట శేఖర్‌ అందించిన వివరాల ప్రకారం మా దాసాలమ్మ గ్రామ దేవతను ఇతర జిల్లాల నుంచి కూడా వచ్చి పూజిస్తారని అమ్మవారి పేరునే గుట్టకు కూడా దాసాలమ్మ గుట్ట అని పిలుస్తారన్నారు. ఒక్కసారిగా తాటిచెట్టంతా వరదొచ్చినా తట్టుకుని ఈ గుట్ట నిలబడిందని, ఆలయాన్ని అలలు తాకినా పడిపోలేదని అమ్మవారి మహిమ వల్లే ఏ ఒక్కరికి కూడా ప్రాణహాని జరగకుండా బయటపడ్డామని తెలిపారు. ప్రతి ఏడాది దసరా, సంక్రాంతి రోజున పెద్ద ఎత్తున అమ్మవారికి తిరుణాల జరుగుతుందని, ఆ సమయంలో ఇతర జిల్లాల వారితో పాటు మా గ్రామ పరిసరాల్లోని రామచంద్రాపురం, సాలిపేట, పాటూరు, పులపత్తూరు గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి పొంగళ్లు పెట్టుకుని పూజలు చేస్తారన్నారు. ఆ సమయంలో అందరం ఒకచోట చేరిపోతామని ఇది మా దాసాలమ్మ గొప్పతనమని వారు పేర్కొన్నారు. 

గుట్టపై ఉన్న దాసాలమ్మ అమ్మవారు ఆలయం


Advertisement
Advertisement