మేం కదలం!

ABN , First Publish Date - 2021-09-13T04:51:53+05:30 IST

నెల్లూరు నగరంలో రోడ్లపై ఎక్కడ చూసినా పశువులే కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై సైతం మూగజీవాలు అడ్డదిడ్డంగా నిలబడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి.

మేం కదలం!

నగరంలో రోడ్లపై అడ్డదిడ్డంగా పశువులు

ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్‌జామ్‌

తరుచూ రోడ్డు ప్రమాదాలు 

హడావిడి చేసి సరిపెట్టుకున్న కార్పొరేషన్‌


నెల్లూరు (సిటీ), సెప్టెంబరు 12 : 

నెల్లూరు నగరంలో రోడ్లపై ఎక్కడ చూసినా పశువులే కనిపిస్తున్నాయి.  ప్రధాన రహదారులపై సైతం మూగజీవాలు అడ్డదిడ్డంగా నిలబడి వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ముఖ్యకూడళ్లతోపాటు పార్కింగ్‌ ప్రాంతాలలో ఇవే ఎక్కువగా ఉండటంతో వాహనదారులకు స్థలం కొరత ఎదురవుతోంది. పైగా వీటి వల్ల తరుచూ అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. తోపుడు బండ్ల చిరు వ్యాపారులు పశువుల తాకిడితో స్వేచ్ఛగా విక్రయాలు జరుపుకోలేని దుస్థితి ఏర్పడింది. రోడ్లపై పశువులను తరలిస్తున్నామంటూ గతంలో కాస్త హడావిడి చేసిన కార్పొరేషన్‌ అధికారులు ఆ తర్వాత ఈ అంశాన్ని విస్మరించారు. దీంతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. 


మద్రాసు బస్టాండ్‌ కూడలి, ఆర్టీసీ సెంటరు, చిన్నబజార్‌, ఆత్మకూరు బస్టాండ్‌ సెంటర్‌, స్టోన్‌హౌస్‌పేట, పప్పులవీధి, రేబాలవారివీధి, నవాబుపేట, వేదాయపాళెం, సంతపేట, బరకాసు సెంటర్‌, డైకస్‌రోడ్డు కూడలి, వాకర్స్‌ రోడ్డు... ఇలా పలు ప్రాంతాల్లో మూగజీవాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిల్లో కొన్ని వాహనాల శబ్దానికి బిత్తరపోయి మిగత వాహనాలపై పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి.  మరికొన్ని చిన్నారులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పొడుస్తున్నాయి. ఇంకొన్ని రోడ్డుకు అడ్డంగా పడుకుని వాహనాలను నిలువరిస్తున్నాయి. ఇవి ఎవరివన్నది ఎవరికీ తెలియదు. వీటి యజమానులు కూడా కనిపించరు. కొందరు అప్పుడప్పుడు ఈ మూగజీవాల్లో ఒక్కొక్కటి తీసుకువెళ్లి మాయం చేస్తుంటారు. ఈ పశువుల వల్ల దుకాణదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి.


హడావిడితో సరి....

గతంలో రోడ్లపై మూగజీవాలను వాటి యజమానులు తీసుకెళ్లాలని, లేకపోతే భారీగా జరిమానా వేస్తామని, పశువులను కొట్టాలకు తరలించి తిరిగి ఇవ్వబోమని కార్పొరేషన్‌ అధికారులు హెచ్చరించారు. అప్పట్లో ప్రత్యేక వాహనాల ద్వారా రోడ్లపై ఉన్న 300లకుపైగా పశువులను కల్లూరుపల్లిలోని గోశాలకు తరలించారు. దాంతో  పశువుల సమస్య గణనీయంగా తగ్గింది. కానీ మళ్లీ ఇతర పశువులు రోడ్లపైకి చేరుతుండటంతో ప్రజల ఇబ్బందులు మొదటకొచ్చాయి. గతంలో హడావిడి చేసిన కార్పొరేషన్‌ అధికారులు తాజాగా రోడ్లపై పశువుల సంఖ్య పెరిగినా పట్టించుకోవడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వ్యక్తమవుతున్నాయి. గోవులను పెంచి మాంసంతో వ్యాపారం చేసేవారే ఇలా రోడ్లపై వదిలేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికైనా కార్పొరేషన్‌ అధికారులు స్పందించి రోడ్లపై పశువులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు. 

Updated Date - 2021-09-13T04:51:53+05:30 IST