అన్నదాత అయోమయం

ABN , First Publish Date - 2021-03-02T05:49:41+05:30 IST

ఖరీఫ్‌ కష్టకాలాన్ని దాటుకొని యాసంగి పంటలను సాగుచేస్తున్న అన్నదాతకు మళ్లీ అయోమయ పరిస్థితులు ఎదురవుతున్నాయి.

అన్నదాత అయోమయం

యాసంగికి రైతులకు కరువైన దిశానిర్దేశం

పంట కొనుగోళ్లకు వెలువడని మార్గదర్శకాలు 

సర్కారు ధర కంటే ప్రైవేటులోనే ధర అధికం

వరి కొనుగోలు కేంద్రాలపై స్పష్టత కరువు 

శనగ  కొనుగోలుకు సిద్ధమవుతున్న అధికారులు 

సర్కారు ఆదేశం కోసం ఎదురుచూపులు 

నిర్మల్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్‌ కష్టకాలాన్ని దాటుకొని యాసంగి పంటలను సాగుచేస్తున్న అన్నదాతకు మళ్లీ అయోమయ పరిస్థితులు ఎదురవుతున్నాయి. పంట కొనుగోలుపై స్పష్టత కరువవ్వడంతో అటు సంబంధిత యంత్రాంగం, ఇటు రైతాంగం ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం ముందుగానే అన్ని పంటలకు సంబంధించి మద్దతు ధరలు ప్రకటిస్తున్నప్పటికీ కొనుగోలు కేంద్రాలపై చివరి దాక దోబూచులాడుతుండడం అన్నదాతకు శాపమవుతోంది. ఈ సర్కారు విధానాలు పరోక్షంగా ప్రైవేటు వ్యాపారుల వరమవుతున్నాయంటున్నారు. ముఖ్యంగా జిల్లాలో ఈ యాసంగిసీజన్‌కు గాను వరి, కందులు, శనగ, జొన్న తదితర పంటలను ఇక్కడి రైతులు పెద్దఎత్తున సాగు చేస్తుంటారు. ఈ సారి కూడా రైతులు వ్యవసాయశాఖ నిర్దేశించిన లక్ష్యానికి అనుగుణంగా ఆయా పంటలను సాగుచేశారు. కాలువలు, బోరుబావులపై ఇక్కడ యాసంగి పంటలు సాగవుతుంటాయి. ఈ సారి అన్ని ప్రాజెక్ట్‌ల్లో సాగునీటి నిల్వలు పుష్కలంగా ఉండడం, భూగర్భ జలాల లభ్యత కూడా ఆశించిన మేరకు ఉండడంతో రైతులు యాసంగి పంటలపై పెద్దఎత్తున ఆశలు పెట్టుకొని సాగుకు ఉపక్రమించారు. అయితే జిల్లావ్యాప్తంగా 90 వేల ఎకరాల్లో ఈ సారి వరిపంటను రైతులు సాగుచేశారు. 2,11,439 మెట్రిక్‌ టన్నుల పంటల దిగుబడి లక్ష్యాన్ని నిర్ధారించారు. అయితే వరిపంట ఆశాజనకంగా కనిపిస్తుండడంతో రైతులు ఈ సారి తమ కరువు తీరిపోతుందని ఆనందపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటి వరకు వరి కొనుగోలు కేంద్రాలపై స్పష్టమైన విధి విధానాలను, మార్గదర్శకాలను జారీ చేయకపోవడం వరి రైతును తీవ్రనిరాశకు గురిచేస్తోంది. కేంద్ర వ్యవసాయ చట్టాల ప్రకారం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తారో లేదోనన్న సందేహాలతో రైతులు సతమతమవుతున్నారు. అయితే కందిపంట కొనుగోళ్లకు సిద్ధంగా ఉండాలంటూ కలెక్టర్‌ సంబంధిత యంత్రాంగాన్ని ఆదేశించినప్పటికీ దీనికి సంబంధించి కూడా స్పష్టమైన మార్గదర్శకాలు జారీ కాకపోవడంతో అయోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే శనగపంట విషయంలో మాత్రం కుభీర్‌ , భైంసాల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు సంబంధిత అధికారులను ఆదేశిస్తున్నారు. ఇదిలా ఉండగా పంటల వివరాలను తప్పనిసరిగా సమగ్ర రైతు సర్వే పోర్టర్‌లో ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ పోర్టల్‌లో నమోదైన పంటలకే మద్దతు ధర చెల్లిస్తామని అలాగే ఆ పంటలను కొనుగోలు చేస్తామంటూ అధికారులు స్పష్టం చేస్తున్నారు. చాలామంది రైతులు అవగాహన లోపంతో సమగ్ర రైతు సర్వే పోర్టల్‌లో తాము సాగుచేస్తున్న పంటల వివరాలను నమోదు చేయించుకోలేదు. దీంతో పంట దిగుబడి వచ్చే సమయానికి మరింత గందరగోళం ఏర్పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. 

వరిపై కొరవడిన స్పష్టత

ఇదిలా ఉండగా ప్రతియేటా నిర్మల్‌ జిల్లాలో ఖరీఫ్‌, రబీసీజన్‌లలో ఎక్కువగా రైతులు వరిపంటనే సాగుచేస్తుంటారు. అధికారులు పంట మార్పిడి చేయాలని సూచించినప్పటికీ సంప్రదాయంగా వస్తున్న వరి సాగుకే వారు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఖరీఫ్‌, రబీసీజన్‌లలో వరి దిగుబడులు పెద్దమొత్తంలో వస్తున్నందున కొనుగోలు ప్రక్రియకు అనేక ఆటంకాలు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం మద్దతు ధరను ఆశాజనకంగా కొనసాగిస్తున్నందున రైతులు ఈ పంటపైనే ఆసక్తి చూపుతున్నారు. ఈ సారి యాసంగిలో 90 వేల ఎకరాల్లో వరిపంటను సాగుచేస్తున్న రైతులు 2,11,439 మెట్రిక్‌టన్నుల దిగుబడిని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఇప్పటి వరకు సర్కారు కొనుగోలు కేంద్రాల విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. మద్దతుధర ఇప్పటికే ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాలపై స్పష్టత లేకపోవడంతో అన్నదాతలు అయోమయానికి లోనవుతున్నారు. రాబోయే రోజుల్లో కేంద్ర సాగుచట్టాల ప్రకారం కొనుగోలు కేంద్రాలు ఉండబోవన్న ప్రచారం రైతులను కుంగదీస్తోంది. అయితే రైతులు మాత్రం కేంద్ర చట్టాలు రాష్ట్రంలో అమలు కావని ఇక్కడి సర్కారు ఎలాగైనా పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తుందన్న ధీమాతో ఉన్నారు. 

శనగ కొనుగోళ్లపై ఆశలు

ఇదిలా ఉండగా జిల్లాలో కందులు, శనగపంట కొనుగోళ్ల విషయమై అధికారుల ప్రకటనలు రైతుల్లో ఆశలు నింపుతున్నాయి. అయితే మద్దతు ధర కన్నా ప్రైవేటు వ్యాపారులు చెల్లించే ధర ఎక్కువగా ఉండడంతో రైతులు ఎటువైపు మొగ్గు చూపాలో తేల్చుకోలేని పరిస్థితి ఎదురుకావచ్చంటున్నారు. కందులకు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 6వేలు కాగా ప్రస్తుతం ప్రైవేటులో క్వింటాల్‌కు రూ. 7500 వరకు ధర పలుకుతుందంటున్నారు. దీంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే శనగ పంటకు మాత్రం సర్కారు మద్దతు ధర క్వింటాల్‌కు రూ. 5100 ఽకాగా ప్రైవేటులో రూ. 4800 వరకు ధర పలుకుతోంది. అయితే కంది పంట కొనుగోళ్లకు సంబందిత అధికారులు సిద్ధం కావాలంటూ జిల్లా కలెక్టర్‌ ఆదేశించారు. అలాగే శనగపంట విషయంలో కూడా మార్కెటింగ్‌ అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు.

రైతుసర్వే పోర్టల్‌తో చిక్కులు

ఇదిలా ఉండగా ఈ సారి మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేసే వ్యవహారంపై ప్రభుత్వం కొన్ని నిబంధనలను పకడ్భందీగా అమలు చేయతలపెట్టింది. రైతుబందు, పంట కొనుగోళ్లకు ముడిపెట్టబోతున్నట్లు సమాచారం. రైతులు తప్పనిసరిగా తమ పంటల సాగు వివరాలను సమగ్ర రైతు సర్వే పోర్టల్‌లో నమోదు చేయించుకోవాల్సి ఉంటుందంటున్నారు. పంటల సాగు వివరాలు ఈ పోర్టల్‌లో నమోదు కానట్లయితే ఆ పంటలను సర్కారు కేంద్రాల్లో కొనుగోళ్లు చేయబోరని అధికారులు వెల్లడిస్తున్నారు. అయితే చాలా మంది రైతులు అవగాహన లోపంతో తాము సాగు చేసిన పంటల వివరాలను సమగ్ర రైతు సర్వేపోర్టల్‌లో ఇప్పటికి కూడా నమోదు చేయించుకోలేదని చెబుతున్నారు. గ్రామీణస్థాయిలో సరియైున ప్రచారం నిర్వహించకపోవడం సంబందిత శాఖల నిర్వాహకం కారణంగా రైతులు ఈ  పోర్టల్‌ వైపు కన్నెత్తి చూడలేదంటున్నారు. ప్రభుత్వం ఈ సారి పోర్టల్‌లో నమోదును తప్పనిసరి చేస్తుండడం అన్నదాతకు శాపంగా మారబోతుందంటున్నారు. ముఖ్యంగా వరి పంట విషయంలో పోర్టల్‌ నమోదు వ్యవహారం వివాదాలకు ఆస్కారమివ్వవచ్చంటున్నారు. 

శనగ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలి

ఈ యేడు రబీలో నాకున్న ఐదు ఎకరాల్లో శనగ పంటను సాగు చేశాను. దిగుబడి బాగా వచ్చింది. కొనుగోలు కేంద్రం లేకపోవడంతో దళారులకు విక్రయిద్దామంటే గిట్టుబాటు కావడం లేదు. ఇప్పటికే 40శాతం రైతులు దళారులకు పంటలను అమ్ముకున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులు పండించిన శనగ దిగుబడులను కొనుగోలు చేసి గిట్టుబాటు ధర అందించాలి. 

దీపాయి విజయ్‌, రైతు, గ్రామం : కుభీర్‌ 

Updated Date - 2021-03-02T05:49:41+05:30 IST