అన్నదాత అరిగోస

ABN , First Publish Date - 2020-06-04T09:51:20+05:30 IST

జిల్లా రైతులు పంట అమ్ముకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.

అన్నదాత అరిగోస

సతాయిస్తున్న రైస్‌మిల్లర్లు

లారీల్లోనే పేరుకుపోతున్న ధాన్యం

ధాన్యం అమ్మినా రైతుకు తప్పని ఇబ్బందులు


ఆంధ్రజ్యోతి, జగిత్యాల: జిల్లా రైతులు పంట అమ్ముకునేందుకు  ఇబ్బందులు పడుతున్నారు. తాలు, తప్ప పేరిట ఇప్పటికే ఒక్కో 40 కిలోల సంచికి అదనంగా 2 కిలోల తూకం వేస్తుండగా, ఇప్పుడు తేమ శాతం ఎక్కువగా ఉందంటూ రైస్‌మిల్లర్లు రైతులను ఇబ్బందులు పెడుతున్నారు. ధాన్యం తూకంతో రైతు పని పూర్తయిందని భావించినప్పటికీ, రైస్‌మిల్లర్లు లారీల్లోంచి ధాన్యం దించుకోకపోవడంతో కొత్త ఇబ్బందులు తలెత్తుతున్నాయి.


లారీల్లోనే పేరుకుపోతున్న ధాన్యం

జిల్లాలో రబీ సీజన్‌ వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోలు చేసిన ఽధాన్యం చాలా చోట్ల రైస్‌మిల్లర్ల వద్ద పేరుకుపోతోంది. ఒక్కో రైస్‌మిల్‌ వద్ద ధాన్యం అన్‌లోడ్‌ చేసుకోకపోవడంతో లారీలు మూడు, నాలుగు రోజుల పాటు అక్కడే పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. గత రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో  ధాన్యం ఎక్కడ తడిసిపోతుందోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.  జిల్లాలో 385 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా, ఇప్పటివరకు 4.8లక్షల మెట్రిక్‌ టన్నులు కొనుగోలు చేశారు. సీఎంఆర్‌ కింద రైస్‌మిల్లులకు తరలించేందుకు జిల్లాను ఏడు క్లస్టర్లుగా విభజించారు. ఆయా సెంటర్ల నుంచి కొనుగోలు చేసిన ధాన్యం నేరుగా రైస్‌మిల్లులకు తరలించాలని నిర్ణయించారు.


ఇప్పుడు తాలు, తప్ప ఎక్కువగా ఉందంటూ క్వింటాల్‌కు 4 నుంచి 5 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. అలా వేసినప్పటికీ రైస్‌మిల్లుల్లో దించుకునేందుకు మిల్లర్ల యాజమానులు కొర్రీలు పెడుతున్నారు. రైతులు అదనంగా క్వింటాల్‌కు 4-5 కిలోల ధాన్యం తగ్గించుకుంటేనే మిల్లర్లు దించుకుంటున్నారు. లేదంటే ససేమిరా అనడంతో మూడు, నాలుగు రోజుల పాటు లారీలు మిల్లుల వద్దనే ఉండిపోతున్నాయి. దీంతో ఇప్పుడు లారీ ఓనర్లు కూడా తమ ఖర్చు పెరిగిపోతుందని ఆందోళన చెందుతున్నారు.


ఒక రోజు మెయింటనెన్స్‌ ఖర్చు కింద డ్రైవర్‌ జీతం, ఇతర ఖర్చులు రూ.1500 మేరకు ఉంటాయని, ఒక్కో ట్రిప్పు తీసుకునేందుకు మూడు రోజులు పడుతుండటంతో లారీ యాజమానులకు అదనంగా ఒక్క ట్రిప్పుకే రూ.4500 మేరకు నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో చాలా చోట్ల రైస్‌మిల్లుల ఎదుట ధాన్యంతో నిండిన లారీలు కనిపిస్తున్నాయి. అధికారులు, నాయకులు చొరవ తీసుకుని సకాలంలో అన్‌లోడ్‌ చేయిం చి సమస్యకు పరిష్కారం చూపితేనే రైతు గట్టెక్కే పరిస్థితి ఉంది.

Updated Date - 2020-06-04T09:51:20+05:30 IST