స్వామీ దర్శనమేదీ!

ABN , First Publish Date - 2021-10-21T06:53:16+05:30 IST

అన్నవరం దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు స్వామి కటాక్షానికి నోచుకోలేకపోతున్నారు.

స్వామీ దర్శనమేదీ!

  అన్నవరం దేవస్థానంలో భక్తులకు స్వామివారి దర్శనం కరవు
  కొవిడ్‌ ఆంక్షల సాకుతో సాయంత్రం ఐదున్నరకే దర్శనాలు కట్‌
  వివాహ బృందాలు, కుటుంబాలతో వచ్చే భక్తులకు తీవ్ర ఇక్కట్లు

(కాకినాడ-ఆంధ్రజ్యోతి) అన్నవరం దేవస్థానంలో స్వామివారి దర్శనానికి భక్తులు పడిగాపులు కాస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు స్వామి కటాక్షానికి నోచుకోలేకపోతున్నారు. ఎక్కడా లేని విధంగా ఇంకా కొవిడ్‌ ఆంక్షల సాకుతో సాయంత్రం ఐదున్నరకే దర్శనాలు ముగిస్తుండడంపై భక్తులంతా మండిపడుతున్నారు. ఒక పక్క సింహాచలం, ద్వారకాతిరుమల తదితర ప్రముఖ ఆలయాల్లో రాత్రి వరకు యథావిధిగా దర్శనాలకు అనుమతిస్తుండగా అన్నవరంలో ఇష్టమొచ్చిన నిబంధనలతో భక్తులను ఇబ్బందిపెడుతున్నారు. అన్నవరం సత్యనారాయస్వామి దేవస్థానం దేశవ్యాప్తంగా పేరుగాంచింది. ఇక్కడకు అనేక రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. తెలంగాణతోపాటు రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుంచి వివాహం, వ్రతాలు, దర్శనాల కోసం పెద్దఎత్తున చేరుకుంటారు. అయితే వీరికి సాయంత్రం ఐదు గంటల తర్వాత ఆలయ అధికారులు దర్శనాలు కుదరవని చెప్తున్నారు. కొవిడ్‌ ఆంక్షల పేరుతో ఐదున్నర తర్వాత దర్శనాలన్నీ రద్దు చేస్తున్నారు. తిరిగి ఉదయమే స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు. దీంతో  ఆలయానికి వచ్చే భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, విశాఖ, తిరుపతి, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, ఒడిసా, ముంబై... ఇలా అనేక ప్రాంతాల నుంచి బస్సులు, రైళ్లు, విమానాల్లో భక్తులు రాజమహేంద్రవరం, అన్నవరం వస్తుంటారు. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కొండపైకి వెళ్లేసరికి సాయంత్రం అవుతోంది. కానీ వీరికి దర్శనాలకు అనుమతి ఇవ్వకపోవడంతో వారంతా పడిగాపులు కాస్తున్నారు. కొండ కిందకు వెళ్లలేక, గదుల్లో దిగలేక, తిరిగి వెళ్లలేక కొండపై ఆరుబయట పడిగాపులు కాస్తున్నారు. ప్రస్తు తం వివాహాల సీజను నడుస్తుండడంతో వివిధ ప్రాంతాల నుంచి సత్యదేవుని సన్నిధిలో పెళ్లిళ్ల కోసం వధూవరులు, కుటుంబ సభ్యులు పెద్దఎత్తున ఆలయానికి వస్తున్నారు. తీరా ఎన్నో వ్యయప్రయాసలతో స్వామి దర్శనం కోసం వచ్చే భక్తులకు సాయంత్రం ఐదున్నర తర్వాత అనుమతి ఇవ్వకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరైతే పూర్తిగా సాయంకాలం దర్శనాలకే మొగ్గుచూపుతారు. తీరా అధికారుల తీరుతో నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఇంకొందరు సాయంత్రం దర్శనం కాక ఆరోజు రాత్రికి కొండపై బసచేసి సత్రం గది అద్దెకు తీసుకుని అదనపు ఖర్చులతో ఉండిపోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఒకపక్క విజయవాడ, ద్వారకాతిరుమల, సింహాచలం ఆలయాల్లో దర్శనాలను పూర్వపు పద్ధ తిలో రాత్రి తొమ్మిది వరకు అనుమతిస్తున్నారు. కానీ అన్నవరంలో ఇంకా కొవిడ్‌ ఆంక్షల సాకుతో భక్తులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఒకపక్క జిల్లాలో కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పట్టాయి. దీంతో సినిమా థియేటర్లు, బార్లు, రెస్టారెంట్లు అర్ధరాత్రి వరకు కిక్కిరిసి ఉంటున్నాయి. కానీ అన్నవరం దేవస్థానంలో దర్శనాలకు మాత్రం ఆంక్షలు కొనసాగిస్తుండడం దుమారం రేపుతోంది. ఆల యంలో ఐదున్నర తర్వాత దర్శనాలను కొనసాగించేందుకు కలెక్టర్‌ అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని ఆలయ అధికారులు చెప్తున్నారు. ఇదే విషయపై గతంలో కలెక్టర్‌ను కలిసి దర్శనాల సమయం సడలింపు కోరగా దసరా తర్వాత ఆలోచి ద్దామని కలెక్టర్‌ బదులిచ్చారు. కానీ పండగ దాటిపోయినా ఆంక్షలు తొలగించలేదు. అటు భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై కనీసం పాలకమండలి సభ్యులైనా స్పందిస్తున్నారా అంటే అదీ లేదు. తమకు ఆలయంలో జరగాల్సిన గౌరవ మర్యాదలపై ఉన్న శ్రద్ధ భక్తుల ఇబ్బందులపై పెట్టకపోవడం విశేషం.

Updated Date - 2021-10-21T06:53:16+05:30 IST