Advertisement
Advertisement
Abn logo
Advertisement

మరో ముప్పు

జిల్లాపై అల్పపీడన ప్రభావం

నేటి నుంచి విస్తారంగా వర్షాలు  

మారిన వాతావరణం, అధికమైన చలిగాలులు

ఇప్పటికే భారీగా దెబ్బతిన్న పంటలు, పెరిగిన తెగుళ్లు

తాజా పరిస్థితితో రైతుల్లో మరింత ఆందోళన

ఒంగోలు, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఇటీవల ముసురుతో తల్లడిల్లుతున్న జిల్లా రైతాంగానికి మరో ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో ఆదివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. శనివారం ఉదయం నుంచే జిల్లా అంతటా వాతావరణంలో మార్పు వచ్చింది. చల్లటి గాలులు అధికమయ్యాయి. దీంతో  రైతుల్లో మరింత ఆందోళన వ్యక్తమవుతోంది. వాతావరణ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం తమిళనాడు-శ్రీలంక మధ్యలో బంగాళాఖాతంలో ఉన్న అల్పపీడన ప్రభావంతో తమిళనాడులో భారీ వర్షాలు   కురుస్తున్నాయి. ఆ ప్రభావం జిల్లాపై ఉండనుంది. అలాగే అండమాన్‌ దక్షిణ ప్రాంతంలోని సముద్రంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడగా రెండు రోజుల్లో అది అల్పపీడనంగా, తర్వాత వాయుగుండంగా మారవచ్చని సమాచారం. దీంతో తమిళనాడుతోపాటు దక్షిణ కోస్తా ప్రాంతాల్లో వర్షాలు పడనున్నాయి. ఆ రెండింటి ప్రభావంతో ఆదివారం నుంచి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే జిల్లాలో ముసురుగా కురిసిన వర్షాలతో అధికారిక అంచనా ప్రకారం 1.01లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రూ.450 కోట్ల మేర  రైతులు నష్టపోయారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ భారీవర్షాలు కురిస్తే మొత్తం పంటలు తుడిచిపెట్టుకు పోతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా తుఫానులు, వాయుగుండాల ప్రభావం అధికంగా ఉన్న సమయంలో చల్లటి వాతావరణంతో పంటలకు మరింత నష్టం వాటిల్లనుంది. ఇప్పటి కే రకరకాల తెగుళ్లు సోకాయి. తాజా వాతావరణ పరిస్థితులు పంటలను మరింత దెబ్బతీయనున్నాయి. ఇదిలా ఉండగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో దెబ్బతిన్న పంటలను శనివారం పరిశీలించారు. 

Advertisement
Advertisement