Advertisement
Advertisement
Abn logo
Advertisement

‘ఎయిడెడ్‌’పై Jagan Sarkar మరో పిడుగు

  • 20మందిలోపు పిల్లలుంటే గుర్తింపు రద్దు 
  • ప్రైవేటు పాఠశాలలకు అదే నియమం 
  • జిల్లాలో 200 స్కూళ్లకు ముప్పు


ఒంగోలు విద్య, నవంబరు 27 : జిల్లాలోని 200 ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలలు,  ఎయిడెడ్‌ స్కూళ్లకు మరో ముప్పు పొంచి ఉంది. ‘మూలిగే నక్క మీద తాటిపండు పడినట్లు’ అన్న చందంగా అసలే అంతంతమాత్రంగా నడుస్తున్న ప్రైవేటు, ఎయిడెడ్‌ పాఠశాలల మూసివేతే లక్ష్యంగా ప్రభుత్వం మరో పిడుగు వేసింది. ప్రభుత్వంలో విలీనం ప్రతిపాదన నుంచి గట్టెక్కి హమ్మయ్య.. అని ఊపిరిపీల్చుకున్న ఎయిడెడ్‌ పాఠశాలలకు తాజా ఉత్తర్వులు శరాఘాతంగా మారనున్నాయి. 20మందిలోపు విద్యార్థులు ఉన్న పాఠశాలల గుర్తింపు రద్దుకు నోటీసులు జారీ చేయాలని పాఠశాల విద్య డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు. ఆ ప్రకారం 125 ప్రైవేటు పాఠశాలలు, 75 ఎయిడెడ్‌ పాఠశాలలు మూతపడను న్నాయి. ముందుగా 20 మందిలోపు ఉన్న స్కూళ్లను గుర్తించి వాటి యాజమా న్యాలకు గుర్తింపు ఎందుకు రద్దు చేయకూడదో వివరణ కోరుతూ సంజాయిషీ నోటీసులు జారీచేయాలి. పాఠశాలలపై తగు చర్యలు తీసుకుని డిసెంబరు 31 నాటికి తమ కార్యాలయానికి తెలియజేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.

125 ప్రైవేటు స్కూళ్లపై వేలాడుతున్న కత్తి

జిల్లాలోని 125 ప్రైవేటు పాఠశాలలపై కూడా మూసివేత కత్తి వేలాడు తోంది. వీటన్నింటిలోనూ 20మందిలోపు విద్యార్థులు ఉండమే దీనికి కారణం. పాఠశాల విద్యాశాఖ తాజా గా జారీచేసిన ఉత్తర్వులు ప్రకారం ప్రభుత్వ గుర్తింపు కొనసాగాలంటే కనీసం 20మందికిపైగా పిల్లలు ఉండాలి. ప్రస్తుత విద్యా సంవత్సరం 2021-22కు సంబంధించి అక్టోబర్‌ 31తో అడ్మిషన్ల గడువు ముగిసింది. పాఠశాలల్లో చేరిన విద్యార్థుల వివరాలను యూడైస్‌, చైల్డ్‌ ఇన్‌ఫోలో నమోదు చేశారు. యూడైస్‌ డేటాను ప్రామాణికంగా తీసుకొని 20మందిలోపు ఉన్న పాఠశా లలకు ప్రభుత్వ గుర్తింపు ఎందుకు రద్దుచేయకూడదో నోటీసులు జారీ చేయమన్నారు. తక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలను స్వయం ఉపాధి కోసం నిర్వహిస్తున్నారు.


వీటిలో కుటుంబ సభ్యులే ఉపాధ్యాయు లుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గుర్తింపు లేకుండా ఏపాఠశాలనూ నిర్వహించరాదు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం 20మందిలోపు విద్యార్థులు ఉన్నారన్న సాకుతో తమ పాఠశాల గుర్తింపు రద్దుచేసి మూసివేస్తే ఉపాధిని కోల్పోయి,  కుటుంబాలు వీధినపడతాయని ఆయా స్కూళ్ల యాజమాన్యాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రైవేటు స్కూళ్లకు ప్రభుత్వం నుంచి ఎటువంటి సాయం అందడం లేదు కాబట్టి విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా తమ పాఠశాలలను కొనసాగిం చాలని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. 


75 ఎయిడెడ్‌ స్కూళ్లకు పొంచి ఉన్న ముప్పు 

పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ తాజాగా జారీచేసిన ఉత్తర్వులతో 75 ప్రైవేటు అన్‌ ఎయిడెడ్‌ స్కూళ్లకు మూసివేత ముప్పు పొంచి ఉంది. జిల్లాలో మొత్తం 248 ఎయిడెడ్‌ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో ఆరింటిలో  విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎవరూ లేకపోవడంతో వాటిని మూసివేశారు. మరో 9 స్కూళ్లలో విద్యార్థులు చేరకపోవడంతో అక్కడ టీచర్లను ఇతర పాఠశాలలకు డిప్యుటేషన్‌ వేశారు. ఈ 15 పాఠశాలలు పోను, 151 ప్రాథమిక, 29  ప్రాథమికోన్నత, 53 ఉన్నత పాఠశాలలు మొత్తం 233 పనిచేస్తున్నాయి. వీటిలో సుమారు 60కిపైగా పాఠశాలల్లో 20మందిలోపు మాత్రమే పిల్లలు ఉన్నారు.


ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల ప్రకారం అసలు పిల్లలు లేనివి, 20మందిలోపు ఉన్నవి మొత్తం 75 పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు రద్దుకానుంది. విద్యాహక్కు చట్టం ప్రకారం 20మందిలోపు ఒకటి నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు ఉన్న ప్రాథమిక పాఠశాలల నిర్వహణ సాధ్యం కాదని, వాటి గుర్తింపును రద్దుచేయాలని ఈ ఏడాది మార్చిలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ప్రభుత్వం జారీచేసిన గెజిట్‌ ప్రకారం జిల్లాలోని 75 ఎయిడెడ్‌ పాఠశాలలకు ప్రభుత్వ గుర్తింపు రద్దు కానుంది.

Advertisement
Advertisement